గ్రూప్‌‌-1పై తీర్పు రిజర్వు

గ్రూప్‌‌-1పై తీర్పు రిజర్వు

హైదరాబాద్, వెలుగు : గ్రూప్‌‌–1 పరీక్షల నిర్వహణపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఇరుపక్షాల వాదనలు శుక్రవారం ముగియడంతో తీర్పును తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. 2022లో జారీ చేసిన గ్రూప్‌‌-1 నోటిఫికేషన్‌‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్‌‌  ఇవ్వడం చెల్లదని, ప్రాథమిక ‘కీ’లో తప్పులను సరిచేయలేదంటూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు కాగా వాటిని జస్టిస్‌‌ పుల్లా కార్తీక్‌‌ విచారించారు. 

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. కీలో జరిగిన పొరపాట్లను సరిచేశారని తెలిపారు. రెండు ప్రశ్నలకు మాత్రమే జవాబులు తప్పుగా రావడంతో ఎక్స్‌‌ఫర్ట్‌‌ కమిటీ సిఫార్సుల మేరకు వాటిని తొలగించినట్టు చెప్పారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణలో జాప్యం జరిగి అభ్యర్థులు నష్టపోయారని, మరోసారి నిరుద్యోగులు నష్టపోకూడదన్నారు. 

పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యానికి అవకాశం తక్కువని, పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఈ వాదనలను పిటిషనర్ల అడ్వకేట్లు వ్యతిరేకించారు. గత పరీక్షల నిర్వహణలో తప్పిదాలు జరగడంతో వాటిని ఇదే కోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.