మేడిగడ్డపై వాదనలు పూర్తి

మేడిగడ్డపై వాదనలు పూర్తి
  • కేసీఆర్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలంటూ సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదులో కింది కోర్టు నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌ రావు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై సోమవారం హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. మేడిగడ్డ కుంగుబాటుకు నిర్మాణాల్లో జరిగిన అక్రమాలేనని, అందుకు బాధ్యులైన అప్పటి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రులతోపాటు అధికారులు, కాంట్రాక్టర్లపై దర్యాప్తు జరిపి క్రిమినల్‌‌‌‌  చర్యలు చేపట్టాలంటూ నాగవెల్లి రాజలింగమూర్తి  ప్రైవేటు పిటిషన్  దాఖలు చేసిన విషయం విదితమే.

ఈ ఫిర్యాదును తమ పరిధిలో లేదంటూ మేజిస్ట్రేట్‌‌‌‌  కోర్టు కొట్టివేయగా రాజలింగమూర్తి జిల్లా కోర్టులో రివిజన్‌‌‌‌  పిటిషన్‌‌‌‌  దాఖలు చేశారు. దీనిపై విచారణార్హతను నిర్ణయించడానికి  జయశంకర్‌‌‌‌  భూపాలపల్లి ప్రిన్సిపల్‌‌‌‌  సెషన్స్‌‌‌‌  జడ్జి.. కేసీఆర్, హరీశ్‌‌‌‌రావు తదితరులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్‌‌‌‌ రావు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై జస్టిస్‌‌‌‌  కె.లక్ష్మణ్‌‌‌‌  సోమవారం మరోసారి విచారణ చేపట్టారు.

ఫిర్యాదులో 8 మంది సాక్షులు ఉన్నారని, వారిని విచారించే పరిధి మేజిస్ట్రేట్‌‌‌‌కు ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. రాజలింగం కుమార్తె ఇందులో ఇంప్లీడ్‌‌‌‌  కావాలనుకుంటున్నట్లు పత్రికల్లో కథనాలు చూశామనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ పత్రికల్లో కథనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని, ఇంప్లీడ్‌‌‌‌  అయ్యాక పరిశీలిస్తామన్నారు.