థియేటర్లలోకి అర్ధరాత్రి పిల్లల ఎంట్రీపై నిషేధం తొలగింపు

థియేటర్లలోకి అర్ధరాత్రి పిల్లల ఎంట్రీపై నిషేధం తొలగింపు
  • గత ఉత్తర్వులను సవరించిన హైకోర్టు 
  • ప్రభుత్వమే విధాన నిర్ణయం తీసుకోవాలని ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: సినిమా టాకీసులు, మల్టీప్లెక్స్‌‌‌‌లలో ఉదయం11 గంటలకు ముందు, రాత్రి11 తరువాత 16 ఏండ్లలోపు పిల్లలను అనుమతించరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. సినిమాలకు పిల్లల అనుమతిపై చట్టపరంగా ఎలాంటి నిబంధనలు లేకపోవడంతోపాటు, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లకు ఎదరవుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్తర్వులను సవరించినట్లు పేర్కొంది. అయితే, అన్ని వర్గాలతో చర్చించి పిల్లల ప్రవేశంపై విధాన నిర్ణయం తీసుకోవాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. పుష్ప-2, ‘గేమ్‌‌‌‌ ఛేంజర్‌‌‌‌’ సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్‌‌‌‌ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా, వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు జనవరి 24న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 తర్వాత, ఉదయం 11 లోపు పదహారేండ్లలోపు పిల్లలను సినిమా హాళ్లకు అనుమతించరాదని ఆదేశించింది. 

ఈ ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ మల్టీప్లెక్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా ప్రతినిధులు, తదితరులు ఇంప్లీడ్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. విచారణలో పిటిషనర్ల అడ్వకేట్లు వాదిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులతో మల్టీప్లెక్స్ లకు నష్టం వస్తోందని తెలిపారు. అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపునకు వ్యతిరేకంగా మాత్రమే పిటిషన్లు దాఖలయ్యాయన్నారు. రాత్రి 11 తర్వాత పిల్లలను సినిమాలకు అనుమతించరాదని చట్టపరంగా ఎలాంటి నిబంధనలు లేవన్నారు. ప్రభుత్వం అందరితో చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని విన్నవించారు. పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులను సవరిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.