
- భూవివాదాలను పరిష్కరించే అధికారం సివిల్కోర్టులకే: హైకోర్టు
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ నిలిపివేత
- విచారణ జూన్ 21 కి వాయిదా
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేందుకు వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. భూముల వర్గీకరణ, రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీలకు సంబంధించిన వివాదాల్ని పరిష్కరించే అధికారం అధికారులకు లేదని పేర్కొన్నది. భూ వివాదాలను పరిష్కరించే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని వెల్లడించింది. ఇలాంటి వివాదాలపై జిల్లా కలెక్టర్లు జోక్యం చేసుకోరాదని చెప్పింది. ప్రధానంగా ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చుతూ అనుబంధ సేత్వార్ జారీకి, కొత్త సర్వే నంబర్లు లేక విడిగా సర్వే నంబర్లు కేటాయించే అధికారం అధికారులకు లేదని తెలిపింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో కొండకల్, మోకిల్లా గ్రామాల మధ్యలో ప్రభుత్వానికి చెందిన 40.12 ఎకరాలు ప్రభుత్వ భూమని తేల్చుతూ సర్వే శాఖ, తహసిల్దార్ 2014లోనే ఉత్తర్వులు ఇచ్చినా.. వాటిని పట్టా భూమిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మార్పులు చేస్తూ.. ప్రైవేటు వ్యక్తుల పేర్లను రికార్డుల్లోకి చేర్చుతూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపివేయాలని ఆదేశించింది. తుది ఉత్తర్వులు జారీ చేసేదాకా ఆక్రమణల్లో ఉన్న 20 ఎకరాల భూమిని అన్యాక్రాంతం కాకుండా, సదరు భూమిలో మార్పులు చేర్పులు చేయరాదని పేర్కొన్నది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అందులో రాకపోకలకు అనుమతించడంలేదని, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ 2022, 2023లో కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలంటూ ఎర్రపోతు శైలజ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి శనివారం విచారించారు. దీనిపై పై విధంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ వివాదం..
‘‘కొండకల్ గ్రామంలో పిటిషనర్‌కు 2.14 ఎకరాల భూమి ఉంది. సరిహద్దులో కృష్ణ రాంభూపాల్ భూమి ఉంది. దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి 20.12 ఎకరాలను రాంభూపాల్ ఆక్రమించుకొని ప్రహరీ నిర్మించాడు. అయితే, రోడ్డు కోసం జాగా వదల్లేదు. దీనిపై 2014లో పిటిషన్ వేస్తే అధికారులు సర్వే చేసి 40.12 ఎకరాలు బిలదాఖలా భూమిగా (ప్రభుత్వ భూమిగా) తేల్చారు. అందులో 20.12 ఎకరాలు ఆక్రమణల్లో ఉందని తహసిల్దార్ కౌంటర్ కూడా వేశారు. ఆ భూమిని పట్టా భూమిగా పేర్కొంటూ విలేజ్ మ్యాప్‌ను మార్చాలని 2022లో కలెక్టర్ సర్వే శాఖకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. 2023లో కొత్త సర్వే నెంబర్లతో ప్రైవేటు వ్యక్తుల పేర్లను రికార్డుల్లో చేర్చారు” అని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనల అనంతరం జడ్జి దీనిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. సదరు భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడంగానీ, భూమి స్వరూపంలో మార్పులు చేర్పులు చేయరాదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేశారు.