- ఓపెన్ కోర్టులో లోతుగా విచారణ జరుపుతాం
- V6 – వెలుగు పిటిషన్ పై హైకోర్టు కామెంట్
- సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్ కి ఆంక్షలు విధించడం
- రాజ్యాంగ ఉల్లంఘన కాదని సర్కారే నిరూపించుకోవాలన్న కోర్టు
వీ6, వెలుగుదాఖలుచేసిన రిట్పిటిషన్ చాలా అరుదైనదని,రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనతో ముడిపడిన పత్రికా స్వేచ్ఛకు చెందిన కేసు ఇదని హైకోర్టు పేర్కొంది.ఈ కేసుపై ఓపెన్ కో ర్టులో మరింత లోతుగా పరిశీలిస్తామని చెప్పింది.సెక్రటేరియట్ కూల్చివేత కవరేజీకి ఆంక్షలు విధించడంరాజ్యాంగ ఉల్లంఘన కాదని సర్కారే నిరూపించుకోవాలని తన ఆర్డర్లో స్పష్టం చేసింది. వీ6, వెలుగు దాఖలు చేసిన ఈ పిటిషన్ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ తో పత్రికా స్వేచ్ఛపై కొత్త చర్చకు తెరలేచినట్లైంది.దేశంలోనే మొదటిసారిగా ఆర్టికల్19 కింద మీడియా స్వేచ్ఛ అంశాన్ని హైకోర్టు లోతుగా పరిశీలించనుంది.దీంతో వీ6, వెలుగు వేసిన పిటిషన్ పై విచారణ మరి కొంత కాలం కొనసాగనుంది.
హైదరాబాద్, వెలుగు: ‘‘ఆర్కటిల్19 కింద రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనతో ముడిపడిన ప్రతికా స్వేచ్ఛకు చెందిన కేసు ఇది. ఫ్రీడం ఆఫ్ ప్రెస్ కోసం వీ6, వెలుగు దాఖలు చేసిన రిట్ పిటిషన్ చాలా అరుదైనది, ముఖ్యమైనది. సెక్రటేరియట్‌లోకి మీడియాను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అంగీకరించి నా.. ఈ కేసులోని పత్రికా స్వే చ్ఛకు సంబంధించిన కీలకాంశాలపై లోతుగా విచారణ జరిపి తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి కేసులు తిరిగి దాఖలయ్యే అవకాశాలు లేకుండా ఫ్రీడం ఆఫ్ ప్రెస్‌పై వివిధ దేశాల్లో వెలువడిన తీర్పులను కూడా పరిశీలిం చాల్సిన కేసు ఇది”అని హైకోర్టు అభిప్రాయపడింది. ఇది కరోనా కారణంగా వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ చేయాల్సిన కేసు కాదని, కోర్టులు తెరుచుకున్నాక ప్రత్యక్షంగా విచారణ చేయాల్సిన పత్రికా స్వే చ్ఛ కు సంబంధించిన కీలకమైన రిట్ అని స్పష్టం చేసింది. సెక్రటేరియట్ కూల్చివేత కవరేజీకి మీడియాను అనుమతించకపోవడంపై వీ6, వెలుగు సీఈవో, ఎడిటర్ అంకం రవి, క్రైం బ్యూరో చీఫ్ జి.సంపత్ దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై సోమవారం హైకోర్టు జడ్డి జస్టిస్ చల్లా కోదండరాం విచారణ జరిపారు.
ఇలాంటి కేసును చూడలేదు
‘‘న్యూస్ ప్రింట్ రాయితీ లేదనో, ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం లేదనో పత్రికలు గతంలో కోర్టుకు వచ్చాయి. కానీ, వార్తల కవరేజీకి పర్మిషన్ ఇవ్వాలని కోరడం మాత్రం ఇదే ఫస్ట్టైమ్. ఒక ప్రదేశంలోకి మీడియా ప్రవేశాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంపై పిటిషనర్ ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించి న హక్కుల రక్షణ,పత్రికా స్వే చ్ఛ వంటి అంశాలపై ఇలాంటి కేసును మేము చూడలేదు”అని హైకోర్టు పేర్కొంది. ప్రజలకు చెందిన పనులను మీడియా కవరేజీ చేయకుండా ఆంక్షలు విధించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కాదని రాష్ట్ర ప్రభుత్వమే నిరూపించుకోవాలని, దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఫ్రీడం ఆఫ్ ప్రెస్ పై వెలుడిన తీర్పులను నివేదించాలని పిటిషనర్ కు సూచించింది.
గుహలు ఉన్నాయట నిజమేనా?
‘‘సెక్రటేరియట్ ఆవరణలో మూడు గుహలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. విద్యారణ్య స్కూల్‌కు ఒక గుహ, హోం సైన్స్ కాలేజీకి మరో గుహ.. మరొకటి ఎటో ఉందంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే ఆ గుహల్ని ఆధునీకరించితే బాగుంటుంది. విదేశాల్లో ఇలానే చేస్తారు. టికెట్లు పెట్టి సందర్శనకు అనుమతిస్తే సర్కార్‌కు డబ్బు కూడా వస్తుంది. దేశ,విదేశాల నుంచి సందర్శకులు రావడం మొదలైతే వివిధ వస్తువుల కొనుగోళ్ల ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది’’ అని హైకోర్టు అభిప్రాయ పడింది. వాదనల తర్వాత కీలక ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. అన్ని వివరాలతో సమగ్ర కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలుకు ఏజీ గడువు కోరడంతో అందుకు అంగీకరించింది.