- మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, వెలుగు: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలున్నాయని గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకే రోజు గ్రూప్ 2, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలున్నందున గ్రూప్ 2 పరీక్షలను వేయాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వుల జారీకి కోర్టు నిరాకరించింది. ఈ నెల 15, 16 తేదీల్లో జరగునున్న గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆర్.జ్యోతి, వేర్వేరు జిల్లాలకు చెందిన మొత్తం 23 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పుల్లా కార్తీక్ సోమవారం విచారణ చేపట్టారు. గ్రూప్–2 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని నవంబరు 25న టీజీపీఎస్సీకి వినతి పత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఈ నెల 16న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 7,951 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించనుందని, అదే రోజు గ్రూప్–2 రెండో పేపర్ పరీక్ష ఉందని చెప్పారు. పలువురు అభ్యర్థులు గ్రూప్ 2తోపాటు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలకూ హాజరవుతున్నారని, అభ్యర్థులు రెండు పరీక్షలు రాసేందుకు వీలుగా గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు ఉత్తర్వులివ్వాలని కోరారు.
ALSO READ : తెలంగాణ తల్లి విగ్రహం.. ఆత్మగౌరవానికి ప్రతీక.. అందరితో చర్చించాకే రూపకల్పన: అసెంబ్లీలో సీఎం రేవంత్
టీజీపీఎస్సీ న్యాయవాది వాదిస్తూ.. గ్రూప్ 2 పరీక్షలకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. పరీక్షను వాయిదా వేయడం వల్ల తక్కువ మంది అభ్యర్థులకు ప్రయోజనం ఉండొచ్చని, అయితే, ఎక్కువ మంది అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. వాదనలు విన్న జడ్జి.. పరీక్షల వాయిదాకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కి వాయిదా వేశారు.