తెలంగాణ జ్యుడీషియల్​ సర్సీస్​ రూల్స్​ కరెక్టే: హైకోర్టు

తెలంగాణ జ్యుడీషియల్​ సర్సీస్​ రూల్స్​ కరెక్టే: హైకోర్టు
  • రూల్స్​ను సవాల్​ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర జ్యుడీషియల్​ సర్సీస్​ రూల్స్​ కరెక్టేనని హైకోర్టు పేర్కొంది. సర్వీస్​ రూల్స్​ నిబంధనల్లోని  2(కె), రూల్‌‌ 5.2(ఎ)ను సవాల్‌‌ చేసిన పలు పిటిషన్లను  జస్టిస్‌‌ కె.సుజయ్‌‌పాల్, జస్టిస్‌‌ ఎన్‌‌.తుకారాంజీలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌  కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. తెలంగాణలో ప్రాక్టీస్‌‌ చేస్తున్న లాయర్లకే అవకాశం కల్పించేందుకు వీలుగా ప్రాక్టీస్‌‌ చేస్తున్న బార్‌‌ అసోసియేషన్‌‌ సర్టిఫికెట్‌‌ను సమర్పించాలన్న నిబంధన సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమన్న పిటిషనర్ల వాదన చట్ట వ్యతిరేకమని బెంచ్​ చెప్పింది. 

కనీస, గరిష్ట వయోపరిమితిపై పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు సరికాదని పేర్కొంది. కనీస వయసు నిబంధన వల్ల పట్టా పొందిన అభ్యర్థులు ఏమీ నష్టపోవడం లేదని చెప్పింది. వారికి తగినన్ని అవకాశాలున్నాయని, పట్టా పొందిన వెంటనే సర్వీసులోకి రావాలన్న నిబంధన ఏమీ లేదని కూడా చెప్పింది. నిబంధనల రూపకల్పనపై విచక్షణాధికారం ఉంటుందని తెలిపింది. ఇటీవల బొడుగుల బ్రహ్మయ్య కేసులో ఇదే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది.   జూనియర్‌‌ సివిల్‌‌ జడ్జిల పోస్టుల భర్తీ నిమిత్తం ఏప్రిల్‌‌ 10న హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్‌‌ సబబేనని తేల్చి చెప్పింది.