- వైసీపీ మాజీ ఎమ్మెల్యే భార్య పిటిషన్ పై హైకోర్టు వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: కాంపౌండ్ వాల్ నిర్మించడానికైనా స్థానిక సంస్థల అనుమతి తప్పనిసరి అని..వాటి అధికారాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాంపౌండ్ నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతి ఉండాల్సిందేనని తెలిపింది. హైడ్రా కూల్చివేసిన కాంపౌండ్ వాల్‌ను నిర్మించుకోవడానికి అనుమతించాలంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భార్య కె.ఉమామహేశ్వరమ్మ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అమీన్‌పూర్‌లో ఉన్న 9 ఎకరాల ఫామ్‌హౌస్ కాంపౌండ్, అందులో ఉన్న షెడ్‌లను హైడ్రా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఉమామహేశ్వరమ్మ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వాదిస్తూ..హైడ్రా కాంపౌండ్‌ను కూల్చివేయడంతో భద్రత లేకుండా పోయిందన్నారు. కనీసం కాంపౌండ్ నిర్మాణానికి అనుమతించాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ..అమీన్‌పూర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి స్థలాన్ని పరిశీలించి, నిర్మాణాలకు ఆమోదం తెలియజేయడం అన్నది స్థానిక సంస్థ విధుల్లో భాగమని, అందులో తాము జోక్యం చేసుకోలేమంటూ పేర్కొన్నారు.