
హైదరాబాద్, వెలుగు: గ్రామ పాలనా అధికారుల (జీపీఓ) నియామక నోటిఫికేషన్ జారీపై వివరణ ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీపీఓల నియామకానికి ఈనెల1న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ వీఆర్వో అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదిస్తూ.. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని హైకోర్టులో సవాల్ చేశామని, ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా తిరిగి ప్రభుత్వం నియామకాల నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని తెలిపారు.
జీపీఓల నియామకానికి ఎలాంటి నిబంధనలు రూపొందించకుండా నియామకాలు చేపట్టడం చెల్లదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. జీపీఓల నియామకం ప్రభుత్వ విధాన నిర్ణయమని పేర్కొన్నారు. గతంలో వీఆర్వోలుగా పనిచేసినవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ, రెవెన్యూశాఖ, ఆర్థికశాఖల ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.