
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చేపట్టే గ్రూప్-1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు( 6 నుంచి 10 శాతం)ను గ్రూప్-1 నియామకాలకు వర్తింపజేయడంపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం 2022లో జారీ చేసిన జీవో 33 ద్వారా పెంచిన ఎస్టీ రిజర్వేషన్‌లను విద్య, ఉపాధి రంగాలకు వర్తింపజేయడాన్ని సవాలు చేస్తూ పి.శ్యాంసుందర్ రెడ్డి మరికొందరు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పెంచిన రిజర్వేషన్లు విద్యారంగానికే పరిమితం చేయాలని, ఉపాధి రంగానికి వర్తింపజేయొద్దని కోరారు.
గతంలో వలె 6 శాతం రిజర్వేషన్లను గ్రూప్-1 నియామకాల్లో కొనసాగించాలని కోరారు. అయితే, పెంచిన రిజర్వేషన్లను కొనసాగించాలని, ఇందులో తమ వాదన వినాలని ఎస్టీ సంఘాలు ఇంప్లీడ్ పిటిషన్‌లు దాఖలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిందని పేర్కొన్నాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి.. విచారణను జూన్ 12కు వాయిదా వేసింది.