కలెక్టర్ నివేదికిచ్చినా స్పందించరా?

పంటలు నష్టం రైతులకు పరిహారం ఎందుకివ్వలేదు?
వ్యవసాయశాఖపై హైకోర్టు మండిపాటు

హైదరాబాద్‌, వెలుగు: కిందటేడాది పంటలు నష్టపోయిన 28 వేల మంది రైతులకు పరిహారం అందించాలని అప్పటి ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నివేదిక పంపినా.. ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదో చెప్పాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. వచ్చే నెల 1న జరిగే విచారణకు హాజరుకావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.

ఈ ఫైల్ సీఎం దగ్గర ఉందని, భారీ మొత్తంలోనే చెల్లించాల్సివుందని, ప్రభుత్వ వాదన వినిపించేందుకు రెండు నెలల సమయం కావాలని ప్రభుత్వ లాయర్‌ శరత్‌.. ధర్మాసనాన్ని కోరారు. ఎంత చెల్లించాలోకూడా తెలియదా.. కలెక్టర్‌ నివేదిక పంపినా వ్యవసాయ శాఖ ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వివిధ పంటలు 17 వేల హెక్టార్లల్లో దెబ్బతిన్నాయని, రూ.12 కోట్లకు పైగా రైతులకు పరిహారం చెల్లించాలని కలెక్టర్‌ నివేదిక పంపినట్లు పిటిషనర్‌ లాయర్‌ కోర్టుకు వివరించారు. ప్రభుత్వం రైతులకు సాయం అందించకుండా ఫైలు దగ్గర పెట్టుకుని కూర్చుందని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జులై 1కి వాయిదా పడింది.