
- కె.ముత్తయ్య, మరో 18 మంది దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత.. రూ.20 వేల ఫైన్
- చర్యలు చేపట్టాలంటూ జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌కు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: గ్రూప్-1 వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు వివరాలతో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అంతేగాకుండా తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసిన పిటిషనర్లకు రూ.20 వేల జరిమానా విధించింది. కోర్టును తప్పుదారి పట్టించేలా అఫిడవిట్ దాఖలు చేసిన వారిపై తగిన చర్యలు చేపట్టాలంటూ జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది.
గ్రూప్-1 మెయిన్ పరీక్షల వాల్యుయేషన్, ఫలితాల విడుదల చేసిన విధానం లోపభూయిష్టంగా ఉందని, రీవాల్యుయేషన్ జరిపి ఫలితాలు వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కె.ముత్తయ్య, మరో 18 మంది ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టీజీపీఎస్సీ వాల్యుయేషన్‌లో లోపాలతో అభ్యర్థులు నష్టపోయారన్నారు. టీజీపీఎస్సీ జారీ చేసిన మార్కుల మెమోకు, వెబ్‌సైట్ నోట్‌కు తేడా ఉందని.. దీన్నిబట్టి చూస్తే మూల్యాంకనంలో పొరపాట్లు జరిగినట్లు తేలుతోందన్నారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నకిలీ పత్రాలను సృష్టించి పిటిషన్ వేయడం ద్వారా హైకోర్టు నుంచి ఉత్తర్వులు పొందాలని చూస్తున్నారని, ఈ పిటిషన్ విచారణార్హం కాదన్నారు.
పిటిషనర్లు పేరొన్న ఎం.రాహుల్‌కు చెందిన హాల్‌టికెట్‌లో సబ్జెక్ట్‌ల వారీగా మార్కులు సమర్పించామని.. మొత్తం 192.5 మార్కులు రాగా, పిటిషనర్ల ప్రకారం 392.5 మార్కులు వచ్చాయని తెలిపారు. 392.5 మార్కుల నుంచి 192.5 మార్కులకు తగ్గితే ఆ అభ్యర్థి ప్రశ్నించకుండా ఉండరన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు నకిలీ డాక్యుమెంట్ సృష్టించి తప్పుడు ప్రమాణ పత్రం దాఖలు చేసినట్లు తేలుతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కోర్టును తప్పుదోవ పట్టించే సమాచారం అందించిన పిటిషనర్ వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకుని కేసులోని అంశాల్లోకి వెళ్లకుండా కొట్టివేయవచ్చన్నారు.
అందువల్ల పిటిషన్‌ను జరిమానాతో కొట్టివేస్తున్నామని తెలిపారు. రూ.20 వేలు జరిమానాను విధిస్తూ ఈ మొత్తాన్ని హైకోర్టు జడ్జీల కోర్టు మాస్టర్స్, పర్సనల్ సెక్రటరీస్ అసోసియేషన్‌కు చెల్లించాలని పిటిషనర్లను ఆదేశించారు. తప్పుడు వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేసిన పిటిషనర్లపై తగిన చర్యలు చేపట్టాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.