మేడిగడ్డ బ్యారేజీ కుంగిన కేసులో కేసీఆర్‌‌కు లభించని ఊరట

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన కేసులో కేసీఆర్‌‌కు లభించని ఊరట

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌‌ రావుకు హైకోర్టులో ఎటువంటి ఊరట లభించలేదు. గతేడాది జులై 10న భూపాలపల్లి సెషన్స్‌‌ కోర్టు ఇచ్చిన నోటీసులను సవాల్‌‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ మంగళవారం తీర్పు చెప్పారు.

రివిజన్‌‌ పిటిషన్‌‌ విచారణార్హమేనని స్పష్టం చేశారు. రివిజన్‌‌ పిటిషన్‌‌కు ఉన్న చట్టబద్ధతపై జిల్లా కోర్టు తేల్చాలని ఆదేశించారు. చట్ట ప్రకారం విచారణ చేపట్టాలని జిల్లా కోర్టును ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.

మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపేలా పోలీసులు ఆదేశించాలని కోరుతూ 2023, నవంబర్‌‌ 7న కేసీఆర్, హరీశ్‌‌రావుతో పాటు మరో ఆరుగురిపై భూపాలపల్లి ప్రధాన మున్సిఫ్‌‌ మేజిస్ట్రేట్‌‌ కోర్టులో భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త ఎన్‌‌. రాజలింగమూర్తి ప్రైవేట్‌‌ పిటిషన్‌‌ వేశారు. దీనిని మేజిస్ట్రేట్‌‌ కోర్టు కొట్టేయడంతో రివ్యూ పిటిషన్‌‌ దాఖలు చేశారు.

దీనిని సెషన్స్‌‌ జడ్జి విచారణ జరిపి ఆ కేసులో కేసీఆర్, హరీశ్‌‌ సహా ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్‌‌ చేస్తూ కేసీఆర్, హరీశ్‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. జిల్లా సెషన్స్‌‌ కోర్టుకు రివ్యూ చేసే పరిధి, అధికారం ఉందని వెల్లడించింది. ఇది వారెంట్‌‌ కేసా, సమన్ల కేసా అనేది జిల్లా కోర్టులో కేసీఆర్, హరీశ్‌‌ తేల్చుకోవాలని తీర్పులో పేర్కొంది.