ఉగ్రవాద నిర్మూలనకు జీరో టాలరెన్స్ : కిషన్ రెడ్డి

ఉగ్రవాద నిర్మూలనకు జీరో టాలరెన్స్ : కిషన్ రెడ్డి
  • దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్ ఘటనపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ఉగ్రవాదాన్ని  నిర్మూలించేందుకు జీరో టాలెరెన్స్ విధానంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు.11 ఏండ్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలనలో ఇలాంటి ఘటనలకు తావులేదని, దేశభద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందని వివరించారు. దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. 

మారణకాండను సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తీర్పునివ్వడంతో ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైందన్నారు. 12 ఏండ్లుగా ఓ పీడకలలా వెంటాడుతున్న బాధితుల కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందని పేర్కొన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ నిందితులకు శిక్షపడటంలో కీలకపాత్ర పోషించిందని కొనియాడారు. 

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్న: లక్ష్మణ్ 

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇది ఒక చారిత్రాత్మక తీర్పు అని కొనియాడారు. కిందికోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి.. హైకోర్టు నిందితులకు ఉరిశిక్ష వేసిందని తెలిపారు. హైదరాబాద్​లో ఇంకా ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే సంస్థలు, పార్టీలుంటే వెంటనే వాటిని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాలని కోరారు.