బీసీ కులగణనపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

బీసీ కులగణనపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: బీసీ కులగుణనపై తెలంగాణ హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో కులగణన ప్రాసెస్ కంప్లీట్ చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. కాగా, రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలంటూ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎ను ఇవాళ (సెప్టెంబర్ 10) చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫున నాగుల అడ్వకేట్ శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు.

 అనంతరం మూడు నెలల్లో బీసీ కుల గణన చేసి.. నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ పిటిషన్‎పై విచారణను ముగించింది హైకోర్టు. కాగా, రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టేందుకు ప్రభుత్వం సైతం కసరత్తు చేస్తోంది. బీసీ కుల గణన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్‎కు పోవాలని భావిస్తోన్న సర్కార్.. ఇందుకు అనుగుణంగా ఇటీవల స్టేట్ బీసీ కమిషన్ నూతన చైర్మన్, సభ్యులను అపాయింట్ చేసింది. కుల గణన పూర్తి అయిన తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోన్న తరుణంలో.. మూడు నెలల్లో క్యాస్ట్ సెన్సెస్ కంప్లీట్ చేయాలని హై కోర్టు ఆదేశించడం గమనార్హం.