మాజీ సీఎం జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం...

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులపై విచారణ వేగవంతం చేయాలని హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పై విహరణ జరిపిన హైకోర్టు సీబీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసులకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది హైకోర్టు.

ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. 2019 ఎన్నికల ముందు వరకు ఈ కేసుల్లో విచారణకు హాజరైన జగన్, ఆ తర్వాత ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం పదవి కోల్పోయిన నేపథ్యంలో జగన్ కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.