హక్కు లేదని తేలినా.. నిషేధిత ల్యాండ్స్ లిస్టులో ఎట్ల పెడతారు: హైకోర్టు
రిజిస్ట్రేషన్ లేట్ చేసినందుకు పిటిషనర్‌కు రూ.50 వేలు చెల్లించాలె
10 రోజుల్లో కోల్‌కతా కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్‌భూములు తమవేనని చెప్పేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తుండడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆ ల్యాండ్స్ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులో 7 సార్లు ఎదురుదెబ్బ తగిలినా భూములు తమవేనని న్యాయపోరాటం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వే నంబరు 78లోని ల్యాండ్స్‌పై సర్కారుకు హక్కు లేదని తేలాక ఆ భూములను నిషేధిత ల్యాండ్స్ లిస్ట్‌లో ఎలా పెడతారని ప్రశ్నించింది. 2004లో అప్పటి రాష్ట్ర సర్కారు సర్వే నెంబరు 77 నుంచి 80ల్లోని 80 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానివి కావని తేల్చి, మ్యుటేషన్ చేయాలని ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేసింది. అదే ఫైనల్ అని తీర్పు చెప్పింది.
లేట్ చేసినందుకు రూ.50 వేలు కట్టండి
వేలంలో కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఉత్తర్వులు అందిన పదిరోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించింది. టైటిల్ డీడ్స్, పట్టాదారు పాస్‌బుక్స్ ఇవ్వాలని, నాలుగు వారాల్లో మ్యుటేషన్ చేయాలని తేల్చిచెప్పింది. రిజిస్ట్రేషన్ చేయకుండా టైమ్ వేస్ట్ చేసిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసీల్దార్ల నుంచి రూ.50 వేలు కలెక్ట్ చేసి పిటిషనర్‌కు చెల్లించాలని జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్‌ల డివిజన్ బెంచ్ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ఆ భూములు నిషేధిత లిస్ట్‌లో ఉన్నా, కోర్టుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆఫీసర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్‌లో 8 ఎకరాల 7 కుంటల భూమిని కోల్‌కతాకు చెందిన క్రాఫ్ట్ అల్లాయ్ ప్రైవేట్ లిమిటెడ్ 2020వ సంవత్సరంలో వేలంలో కొనుగోలు చేసింది. వేలం 2020లో జరిగిందని, 2020 అక్టోబర్ 29న తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ (ఆర్‌వోఆర్) యాక్ట్ వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ నుంచి సేల్ సర్టిఫికెట్ తీసుకుని, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది. ఆషి రియల్టర్స్, నీహారికా ఇన్‌ఫ్రా కంపెనీలు హఫీజ్‌పేటలోని సర్వే నెంబర్ 78లోని 7 ఎకరాల 8 కుంటల భూమిని తనఖా పెట్టి ఎన్‌ఆర్‌ఈఐ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.110 కోట్లు అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఆ భూముల్ని వేలం వేశారు. వేలంలో రూ.102.6 కోట్లకు తమ సంస్థ కొనుగోలు చేసిన తర్వాత ఆ భూములు రిజిస్ట్రేషన్ యాక్ట్–1906లోని నిషేధిత లిస్ట్‌లో ఉన్నాయని చెప్పి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయలేదని క్రాఫ్ట్ అల్లాయ్ ప్రైవేట్ లిమిడెట్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూములపై ఆషి రియల్టర్స్‌కు అన్ని హక్కులు ఉన్నాయని 2014 జనవరి 28న అప్పటి తహసీల్దార్ సర్టిఫికెట్ ఇచ్చారని, వేలంలో తాము కొన్నట్లుగా పోయిన ఏడాది జనవరిలో సేల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారని, రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించడం అన్యాయమని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
For More News..