- పిటిషనర్ వినతిని పరిశీలించాలని రాష్ట్ర సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫారాల్లో కులం, మతం వెల్లడించని వారి వివరాల నమోదుకు.. నో క్యాస్ట్(ఎన్‌సీ), నో రిలీజియన్(ఎన్‌ఆర్) కాలమ్స్పెట్టే అంశంపై పిటిషనర్ వినతిని పరిశీలించాలని రాష్ట్ర సర్కారుకు హైకోర్టు సూచించింది. బుధవారం నుంచి జరిగే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వేలో కులం, మతం వద్దనకునేవారి వివరాల సేకరణకు ప్రత్యేక కాలమ్స్ పెట్టాలంటూ ఇచ్చిన వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ మహమ్మద్ వహీద్, కుల నిర్మూలన సంఘం ప్రధాన కార్యదర్శి డీఎల్ కృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు అడ్వకేట్ డి.సురేశ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. కులం, మతం వివరాలను వెల్లడించనివారి వివరాల సేకరణకు ప్రత్యేక కాలమ్ పెట్టాలని గత నెల 29, ఈ నెల 1న వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో కులం, మతం వద్దనుకునేవారి వివరాలను మాన్యువల్‌గా సేకరించాలని, సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అన్ని రికార్డుల్లో నమోదయ్యేలా చూడాలని, దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
వాదనలను విన్న జడ్జి.. పిటిషనర్ వినతిపత్రాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 25(1) ప్రకారం మనస్సాక్షికి నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పిటిషనర్ వినతిని పరిశీలించి, చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏ నిర్ణయం తీసుకున్నారో పిటిషనర్‌కు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. అలాగే, ఈ విషయంలో ఉన్న ఇబ్బందులేమిటో తెలియజేయాలని సాధారణ పరిపాలన, సామాజిక సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు, బీసీ కమిషన్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను డిసెంబరు 4వ తేదీకి వాయిదా వేశారు.