
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో మళ్లీ వైస్ చైర్మన్ స్థానాలపై లొల్లి మొదలైంది. ప్రస్తుతం వైస్ చైర్మన్ 2 గా కొనసాగుతున్న మహమూద్.. తనను వైస్ చైర్మన్ 1గా మార్చాలని ఇటీవల విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణాను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా దీనికి సంబంధించిన వివరాలను ఆమెకు అందించారు. కౌన్సిల్ వైస్ చైర్మన్ 1గా కొనసాగిన ప్రమోషన్లో చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వెళ్లగా.. ఆయన స్థానంలో 2023లో ప్రభుత్వం తనను నియమించిందని తెలిపారు. అప్పటికే 2017లో వైస్ చైర్మన్ 2గా నియమితులైన వెంకటరమణ.. తను వచ్చిన తర్వాత వైస్ చైర్మన్ 1గా జీవో తెప్పించుకున్నారని వివరించారు.
హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చట్టం నిబంధనల ప్రకారం.. రెండు టర్మ్‌లు అంటే.. ఆరేండ్ల పాటు వైస్ చైర్మన్ గా కొనసాగే అవకాశం ఉంటుందని, కానీ, వెంకటరమణ ఏడేండ్లకు పైగా కొనసాగారని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆయన్ను ప్రభుత్వం కొనసాగించిందని, అలాంటి వ్యక్తి హోదాను ఎలా మారుస్తారని ఆయన లేఖలో ప్రశ్నించారు.
ఆయన తీరుతో అధికారుల్లోనూ గందరగోళం సృష్టించారని, సర్కారు వెబ్ సైట్లలోనూ తనను ముందుగా వైస్ చైర్మన్ 1గానే కంటిన్యూ చేశారని గుర్తుచేశారు. ఆ నేపథ్యంలో కౌన్సిల్ వైస్ చైర్మన్ 1 హోదాలో కొత్తగా పురుషోత్తం వచ్చారని వివరించారు. ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని సీనియార్టీని కాపాడేందుకు వైస్ చైర్మన్ 1గా తనను కంటిన్యూ చేయాలని విజ్ఞప్తి చేశారు.