ప్రకృతి నిలిపిన లావా స్తంభాలు

  • బజార్​హత్నూరు అడవుల్లో గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం

హైదరాబాద్​, వెలుగు: ఈ రాతి స్తంభాలు.. శిల్పులు చెక్కినవి కావు. పోతపోసిన స్తంభాలు అంతకన్నా కావు. అడవిలో సహజంగా ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన రాతి స్తంభాలివి. ఆదిలాబాద్​ జిల్లా బజార్​ హత్నూర్​ అడవుల్లో తాజాగా వెలుగు చూశాయివి. అగ్నిపర్వతాలు బద్దలై లావా ఎగిసి ఇలా స్తంభాల్లా మారాయని, వాటిని ‘కాలమ్నార్​ బసాల్ట్​’ అని పిలుస్తారని రీసెర్చర్లు చెప్తున్నారు. గతంలో మధ్యప్రదేశ్​, గుజరాత్​, మహారాష్ట్ర, కర్నాటకలో మాత్రమే కనిపించిన ఈ బసాల్ట్​ రాతి స్తంభాలు.. మన రాష్ట్రంలో కనిపించడం ఇదే మొదటిసారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్​ శ్రీరామోజు హరగోపాల్​ చెప్పారు. సుమారు 6 కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వతం పేలి.. ప్రవహించిన లావా చల్లారి సెంట్రల్​ ఇండియా, వెస్ట్​ ఇండియాలోని అనేక చోట్ల వివిధ రూపాల్లో లావా శిలల్లా మారిపోయాయని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి శిలా రూపాలు కనిపించడం ఇదే తొలిసారని జీఎస్​ఐ రిటైర్డ్​ డిప్యూటీ డైరెక్టర్​ జనరల్​ చకిలం వేణుగోపాల్​ అన్నారు. ఉత్తర టర్కీలోని సైనప్​ ప్రావిన్స్​లో ఈ కాలమ్నార్​ బసాల్ట్​ శిలలు కనిపిస్తాయని, ప్రపంచంలో అనేక దేశాల్లో ఇలాంటి ప్రాంతాలను జియో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేశారని ఆయన చెప్పారు.