తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ .. ఇదే ఇప్పటి వరకు అత్యధిక డిమాండ్​

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్  డిమాండ్ .. ఇదే ఇప్పటి వరకు అత్యధిక డిమాండ్​
  • బుధవారం ఉదయం 7.55 గంటలకు 16,058 మెగావాట్లు నమోదు
  • అప్రమత్తమైన సర్కారు.. అధికారులతో డిప్యూటీ సీఎం అత్యవసర రివ్యూ
  • విద్యుత్ సరఫరాలో ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​ నమోదవుతోంది. గత రికార్డులను బద్దలు కొడుతూ బుధవారం ఉదయం 7.55 గంటలకు 16,058 మెగావాట్ల డిమాండ్​ నమోదైంది. ఇదే నెల 10న నమోదైన 15,998 మెగావాట్ల డిమాండ్ ను అధిగమించింది. నిరుడు మార్చి 8న అత్యధిక విద్యుత్  డిమాండ్​ 15,623 మెగావాట్లుగా రికార్డయింది. అత్యధిక విద్యుత్​ డిమాండ్లు నమోదవుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. 

ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్  సరఫరా చేయడంపై విద్యుత్తు శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం  అత్యవసర రివ్యూ నిర్వహించారు. వేసవి పీక్​ డిమాండ్​ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను భట్టి ఆదేశించారు. 17 వేల మెగావాట్ల డిమాండ్​ వచ్చినా సరఫరాకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సదరన్​ డిస్కంలోనూ భారీగా డిమాండ్

గతంలో ఎన్నడూ లేనంతగా సదరన్​ డిస్కం పరిధిలో ఈ సీజన్ లో 10 వేల మెగావాట్లను మించి పీక్​ డిమాండ్​ నమోదవుతోంది. ఈనెల 7న 10,130  మెగావాట్లు, బుధవారం 10,049 మెగావాట్ల డిమాండ్  రికార్డయింది. గత ఏడాది సెప్టెంబర్  20న 9,910 మెగావాట్ల అత్యధిక డిమాండ్​ రికార్డయింది. ఈ యాసంగి సీజన్, వేసవి ఎండల ప్రభావంతో రానున్న రోజుల్లో విద్యుత్  డిమాండ్  మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అదనపు డిమాండ్ కు తగ్గట్టు కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటు, పవర్  ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంపు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, ఫీడర్ల విభజన వంటి పనులు చేశామని సదరన్​ డిస్కం సీఎండీ ముషారఫ్  ఫారూఖీ తెలిపారు.