- జగిత్యాల జిల్లా టీఆర్‌నగర్‌లో దారుణం
- నిజామాబాద్ జిల్లాలో భర్త చేతిలో భార్య హతం
- తుంగతుర్తిలో కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఎగ్ కర్రీ వండలేదని భార్యను చంపేశాడో భర్త. టీఆర్ నగర్‌కు చెందిన కట్ట సంజయ్ ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఎగ్ కర్రీ చేయాల్సిందిగా భార్య సుమలత (35)ను కోరాడు. తాను అలసిపోయానని, ఉన్నది తినాలని కోరింది. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఆవేశానికి లోనైన సంజయ్ సుమలత గొంతు నులిమి చంపి పారిపోయాడు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు. అదనపు కట్నం కోసమే సంజయ్ తన బంధువులతో కలిసి సుమలతను హత్య చేశాడని మృతురాలు తండ్రి ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా కుద్వాన్‌పూర్‌లో...
నందిపేట : నిజామాబాద్ జిల్లా నందిపేట మం డలం కుద్వాన్‌పూర్‌లో కుటుంబ కలహాలతో ఓ భర్త భార్యను హత్య చేశాడు. ఎస్ఐ రాహుల్కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నత్తి సాగర్‌కు బాల్కొండ మండలానికి చెందిన రోజా(35)తో 13 ఏండ్ల క్రితం పెండ్లయ్యింది. వీరికి సుశాంత్(12), అశ్విత్(3) కొడుకులు. సాగర్ జులాయిగా తిరుగుతుండడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇతడి తల్లి పెద్దమ్మి కూడా కొడుకుకే వత్తాసు పలుకుతూ ఉండేది. తల్లీ కొడుకులు ప్రతీ రోజు రోజాను వేధించేవారు. సోమవారం తెల్లవారుజామున నిద్రపోతున్న రోజాను సాగర్ గొంతు నులిమి హత్య చేశాడు. సాగర్, పెద్దమ్మిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ఆస్తులు, అప్పుల విషయంలో గొడవతో...
తుంగతుర్తి : ఆస్తి, అప్పుల విషయంలో భర్తతో గొడవపడిన భార్య కొడుకుతో కలిసి భర్తను చంపేసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మం డలం రామన్నగూడెం తండాకు చెందిన భూక్యా హర్జ (49), ఇతడి భార్య కైకకు భూమి, అప్పులకు సంబంధించిన విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. నాలుగు నెలల క్రితం కైక తన భర్తతో గొడవపెట్టుకొని హైదరాబాద్ కు వెళ్లి కొడుకు సురేశ్దగ్గర ఉంటోంది. గొడవలు మనస్సులో పెట్టుకొని భర్తను చంపాలనుకుంది. దసరా ఉండడంతో నాలుగు రోజుల క్రితం కొడుకుతో కలిసి తండాకు వచ్చింది. హర్జ మేకలు కాసుకుని రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు. గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత కైక, సురేశ్ కలిసి కత్తిపీటతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. నిందితులు పారిపోయారు. మృతుడి తమ్ముడు సుందర్ ఫిర్యాదు మేరకు తుంగతుర్తి సీఐ బ్రహమ్మమురారి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.