నిజాం నవాబును, నలభై వేల ఎకరాల భూస్వామి విస్నూర్ రామచంద్రారెడ్డి లాంటి జమీందార్లు, జాగిర్దార్లు, భూస్వాములను.. రైతాంగ సాయుధ పోరాటం ద్వారా ఎదిరించి నిలిచిన గడ్డ తెలంగాణ. అరవై ఏండ్ల ఆంధ్ర పాలకుల అణచివేతకు, దోపిడీకి గురైన తెలంగాణలో ‘నీళ్లు,- నిధులు - నియామకాలు’ అనే నినాదంతో ఉద్యమించి ఏర్పడ్డది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ హయాంలో మళ్ళీ ఆ పాత రోజులు పునరావృత్తమయ్యాయి. ఉద్యమం ముసుగులో అధికారం చేపట్టి రాచరిక పోకడలు, నియంతృత్వం, దొరలు, భూస్వాముల పాలన కొట్టొచ్చినట్టు కనిపించింది. తెలంగాణలో ఆనాటి గడీలు ప్రస్తుత ఫార్మ్హౌస్ల రూపంలో దర్శనమిస్తున్నాయి.
పదేండ్ల పాలనలో ఉద్యమ ద్రోహులకు ఎర్ర తివాచీలు పరిచిన కేసీఆర్.. ప్రొఫెసర్ కోదండరాం, గద్దర్ లాంటి వారిని అవమానించి ఉద్యమకారుల గొంతు నొక్కడం జరిగింది. ప్రశ్నించేవారిని అణచివేస్తూ, అక్రమ కేసులతో వేధించి ధర్నా చౌక్ ఎత్తేసి పోలీసులతో గృహ నిర్బంధాలు చేయించి ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించారు. ప్రగతి భవన్ పేరుతో పెద్ద పెద్ద గడీలు నిర్మించి ప్రజలు కలవకుండా ముళ్లకంచెలు ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నిటిని ఎదురీదుతూ మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలుతోపాటు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అమలు చేస్తాం అని కాంగ్రెస్‌పార్టీ ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టినరోజునే ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టి మహాత్మ జ్యోతిబా పూలేభవన్గా పేరు మార్చి ప్రజాపాలన అందిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించి ధర్నా చౌక్‌ను పునరుద్ధరించడం జరిగింది. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి ఆంక్షలు, నిర్బంధాలు లేకుండా వారి డిమాండ్ల పరిష్కారానికి ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలు తమ వాక్ స్వాతంత్ర్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా వెల్లడిస్తున్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.
- బందెల సురేందర్ రెడ్డి,
మాజీ సైనికుడు