
న్యూఢిల్లీ, వెలుగు: పెట్రోల్ ధరల్లో తెలంగాణ దేశంలోనే టాప్3 ప్లేస్ లో ఉందని కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, లీటర్డీజిల్ ధర రూ.97.82(4వ స్థానం) ఉందని ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పొరుగు రాష్ట్రం ఏపీ దేశంలోనే టాప్ ప్లేస్, డీజిల్ ధరలో సెకండ్ ప్లేస్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏపీలోని అమరావతిలో పెట్రోల్ ధర రూ. 111.87, డీజిల్ రేటు రూ. 99.61గా ఉన్నట్లు తెలిపారు. డీజిల్ ధరల్లో లక్షద్వీప్ టాప్‌లో ఉంది. కేరళ లోని తిరువనంతపురంలో పెట్రోల్ ధర రూ. 109.73, డీజిల్ ధర 98.53 గా ఉంది. పెట్రోల్ ధరల్లో కేరళ, తెలంగాణకు మధ్య కేవలం రూ.0.07 పైసలు మాత్రమే ఉంది. అయితే దేశంలోనే అతి తక్కువ ఇంధన ధరలు అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి. అక్కడ లీటర్పెట్రోల్ ధర రూ. 84.1, లీటర్ డీజిల్ ధర రూ79.74 గా ఉంది.
రాష్ట్రానికి 1,958 కి.మీ.రోడ్లు.. రూ.37వేల కోట్లు: కేంద్రం
గత మూడేండ్లలో తెలంగాణ లో 1,958 కిలోమీటర్ల పొడవున్న 71 రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులకు రూ.37,069 కోట్లు మంజూరు చేశామని కేంద్రం తెలిపింది. ఇందులో గత నెల 30వ తేదీ వరకు రూ.2,580 కోట్లు సివిల్ పనులకు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. బీఆర్ఎస్ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
మూసీపై స్కైవేల ప్రపోజల్స్ఏవీ రాలేదు
మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి తెలంగాణ సర్కార్ ప్రపోజల్స్ ఏవీ తమ వద్ద పెండింగ్‌లో లేవని కేంద్రం వెల్లడించింది. అదే విధంగా మూసీపై స్కై వే ప్రతిపాదనలు కూడా తమకు రాలేదని స్పష్టం చేసింది. కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) సమాచారం ప్రకారం తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని కేంద్రం పేర్కొంది. అలాగే 2014 నుంచి తెలంగాణలో ఎన్‌ఆర్‌సీపీ కింద కొనసాగుతున్న ప్రాజెక్ట్ లేదని స్పష్టం చేసింది. దీంతో పాటూ మూసీ నది కాలుష్య నివారణకు ఎటువంటి ప్రతిపాదన కూడా కేంద్రం పరిశీలనలో లేదని వెల్లడించింది. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, బి.వెంకటేశ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే మూసీ నది పరిరక్షణ కోసం ఎన్‌ఆర్‌సీపీ కింద రూ.335.65 కోట్ల వ్యయంతో కాలుష్య నివారణ పనులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
అమృత్మిషన్ కింద రాష్ట్రానికి రూ.831 కోట్లు
2018–19 నుంచి 2022–23 వరకు ఐదేండ్లలో అమృత్ మిషన్ స్కీంలో భాగంగా తెలంగాణకు రూ.665 కోట్ల నిధులు రిలీజ్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేవ్వర్రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహరాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అమృత్ మిషన్, అమృత్ మిషన్ 2.0 స్కీంలు కలిపి మొత్తంగా తెలంగాణకు రూ.831.52 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.