ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
  •     తెలంగాణ భవన్​లో అమర వీరులకు నివాళులర్పించిన గౌరవ్ ఉప్పల్

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆదివారం రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షలు, ఆశయాలను నిజం చేసుకున్న రోజు జూన్ 2.

గడిచిన పదేండ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, చిక్కుముడులు ఎదురైనా.. సమిష్టిగా ఎదుర్కొని వాటన్నింటినీ పరిష్కరించుకుని ప్రగతి పథంలో నిలిచింది. వేరే రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలిచింది’’అని అన్నారు. ఈ ప్రోగ్రామ్​లో భవన్ మాజీ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్, తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కుమార్, భవన్ అధికారులు, సిబ్బంది, రాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు.

పదేండ్లైనా తెలంగాణకు ప్రియార్టీ లేదు: శ్రవణ్ కుమార్

రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయినా ఢిల్లీలో తెలంగాణ ప్రజలకు ప్రియార్టీ లేదని తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కుమార్ అన్నారు. ఢిల్లీ ఏపీ భవన్​లో ఆశించిన మార్పులు రాలేదని తెలిపారు. అందరూ ఆంధ్రా భవన్ అని అంటున్నారే తప్ప.. తెలంగాణ భవన్ అనే ఊసే లేదని చెప్పారు. తెలంగాణ వచ్చి అప్పుడే పదేండ్లు గడిచిపోయాయని తెలిపారు. ఉద్యమ సమయంలో ఈ భవన్​కు ఆంధ్రా, మద్రాసీ భవన్​గా తప్ప.. తెలంగాణ పేరు వినిపించేది కాదని గుర్తు చేశారు. త్వరగా తెలంగాణ భవన్ నిర్మించాలని ఆకాంక్షించారు. అందులో తెలంగాణ హస్త కళలకు, రాష్ట్రం నుంచి సివిల్స్​కు ప్రిపేర్ అవుతున్న వారికి సపోర్ట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరారు.