ఫెయిలైనా పాస్​ మార్కులు!

ఫెయిలైనా పాస్​ మార్కులు!

హైదరాబాద్, వెలుగు: ఇంటర్​ సెకండియర్​ స్టూడెంట్లు ఫస్టియర్​ పరీక్షల్లో ఫెయిలైనా పాస్​ మార్కులు వేయాలని ఇంటర్​ బోర్డు యోచిస్తోంది. దీనిపై ఇంటర్​ బోర్డు అధికారులు, కొందరు లెక్చరర్లు, నిపుణులతో చర్చించి ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎగ్జామ్స్​ రాయని వాళ్లపై ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయంపై బోర్డు అధికారులు సర్కారుకు ప్రతిపాదనలను పంపారు. ఈ ప్రతిపాదనకు సర్కారు కూడా ఓకే అన్నట్టు సమాచారం. అయితే, పరీక్షలయ్యాకే నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయించినట్టు అధికారులు చెప్తున్నారు.

ఈ నెల 25 నుంచే పరీక్షలు

కరోనా కారణంగా 2020–21 అకడమిక్ ఇయర్ లో ఇంటర్ సెకండియర్ స్టూడెంట్లకు పరీక్షలు పెట్టకుండానే ఫస్టియర్​ రిజల్ట్ ఆధారంగా మార్కులు వేశారు. ఎగ్జామ్​​ఫీజు కట్టిన 4,59,008 మంది ఫస్టియర్​ స్టూడెంట్లను సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో ఫస్టియర్ స్టూడెంట్లకు పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు మూడు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా,  సర్కారు నుంచి అనుమతి రాలేదు. ఎట్టకేలకు ఈ నెల 25 నుంచి ఫస్టియర్ పరీక్షలను పెట్టేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే జులైలో సెకండియర్ క్లాసులు స్టార్ట్ కాగా.. ఇప్పుడు మళ్లీ ఫస్టియర్ పరీక్షలు పెట్టడం ఏమిటని కొందరు లెక్చరర్లు, స్టూడెంట్ల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. అయినా స్టూడెంట్ల భవిష్యత్​ దృష్ట్యా పరీక్షలు నిర్వహిస్తామని సర్కారు స్పష్టం చేసింది. నిరుడు చదువంతా ఆన్ లైన్ లోనే సాగింది. ఫిజికల్ క్లాసులు సర్కారులో కొద్దిరోజులే జరగగా, ప్రైవేట్ లో ఎక్కువ రోజులు నడిచాయి. దీంతో ఫస్టియర్ పరీక్షలు పెడితే సర్కారు స్టూడెంట్లే ఎక్కువగా ఫెయిల్ అవుతారన్న వాదనలు 
వినిపిస్తున్నాయి.