ఇంటర్​లో ఇంటర్నల్ లొల్లి!

ఇంటర్​లో  ఇంటర్నల్  లొల్లి!
  • ఆర్ట్స్, ల్యాంగ్వేజ్​ సబ్జెక్టుల్లో 80 మార్కులకు ఎగ్జామ్.. ఇంటర్నల్​కు 20 మార్కులు
  • వచ్చే ఏడాది నుంచి అమలుకు ఇంటర్​బోర్డు యోచన 
  • పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రపోజల్ 
  • ఇప్పటికే టెన్త్​లో ఇంటర్నల్ ఎత్తేయాలని సర్కారు నిర్ణయం 
  •  కార్పొరేట్ కాలేజీలకు లబ్ధి కోసమే అంటున్న లెక్చరర్లు  

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ లో ‘ఇంటర్నల్’ మార్కుల రగడ మొదలైంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం అమలు చేయాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు పంపించింది. అయితే, టెన్త్ క్లాసులో ఈ ఏడాదే ఇంటర్నల్ మార్కుల విధానాన్ని తీసేయాలని నిర్ణయించిన సర్కారు.. ఇంటర్ లో ఎలా అమలు చేస్తుందని లెక్చరర్లు, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది పూర్తిగా కార్పొరేట్ కాలేజీల లబ్ధి కోసమేనని వారు ఆరోపిస్తున్నారు. ఇంతపెద్ద సంస్కరణలు చేయాలనుకునేప్పుడు కనీసం లెక్చరర్లు, స్టూడెంట్ల అభిప్రాయాలు తీసుకోకుండా ఇంటర్ బోర్డు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అంటున్నారు.

ప్రస్తుతం ఇంటర్ లో ఎంపీసీ, బైపీసీ తదితర సైన్స్ కోర్సులు చదివే విద్యార్థులకు మాత్రమే సెకండియర్ లో ప్రాక్టికల్స్ విధానం అమలు చేస్తున్నారు. ఆర్ట్స్ సబ్జెక్టులు, ల్యాంగ్వేజీల్లోనూ ఇదే తరహాలో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశ పెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. రాతపరీక్షలకు 80 మార్కులు.. ఇంటర్నల్ కు 20 మార్కులు ఇవ్వాలని డిసైడ్ అయింది. 2025–26లో ఫస్టియర్, 2026– 27లో సెకండియర్ విద్యార్థులకు దీనిని అమలు చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

అనుమతి కోసం సర్కారుకు ప్రతిపాదనలు కూడా పంపించారు. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సైన్స్ కోర్సుల్లో ప్రాక్టికల్స్ కు 30 మార్కులు ఉండగా, కార్పొరేట్ కాలేజీల్లో పూర్తి మార్కులు వేసుకుంటున్నారు. దీనికోసం స్టూడెంట్ల నుంచి డబ్బులూ వసూలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంటర్నల్ మార్కుల విధానం తీసుకొస్తే.. సర్కారు కాలేజీలకే నష్టమని లెక్చరర్లు చెప్తున్నారు.   

టెన్త్ లో ఒకలా.. ఇంటర్ మరోలా..  

ఇటీవల ఇంటర్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పదో తరగతిలో అమలు చేస్తున్న విధానాన్ని .. ఇంటర్మీడియెట్ లో వ్యతిరేకించడం గమనార్హం. రాష్ట్రంలో ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకూ తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేయగా, ఇంటర్మీడియెట్ లో మాత్రం సెకండ్ ల్యాంగ్వేజీగా సంస్కృతాన్ని తీసుకొచ్చేందుకు ఇంటర్ బోర్డు చర్యలు మొదలుపెట్టింది. దీనిపై గత బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడే ప్రతిపాదనలు వచ్చినా.. ప్రజల్లోంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. 

ఇప్పుడు మళ్లీ వచ్చే ఏడాది ఇంటర్ లోనూ సంస్కృతం తీసుకురావాలని ఇంటర్ బోర్డు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. కాగా, కార్పొరేట్, ప్రైవేటు బడుల్లో అక్రమాలు జరుగుతున్నాయని భావించిన సర్కారు.. టెన్త్ లో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఇటీవలే ఎత్తేసింది. 2025–26 నుంచి వంద మార్కులకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ, ఇంటర్మీడియెట్​లో మాత్రం ఇంటర్నల్ విధానం ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయం తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.