తెలంగాణలో ఎల్లుండి నుంచి అంటే 2024 ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్ష్లలు జరగనున్నాయి. పరీక్ష ఏర్పాట్లపై ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి మీడియాతో మాట్లాడారు. ఇంటర్ పరీక్షల కోసం 1521 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలకు 9లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవుతారని చెప్పారు. 1521 చీఫ్ సూపరింటెండెంట్, 27 వేల 900 ఇన్విజిలేటర్లు, 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని తెలిపారు.
విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని టీఎస్ ఆర్టీసీని కోరామని చెప్పారు. పరీక్ష కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ఆమె.. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని రావొద్దన్నారు. ఎగ్జామ్ సెంటర్ లలో నీటి, వైద్య సదుపాయం ఉంటుందని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని.. నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించేది లేదన్నారు. కాగా మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.