
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. అన్నీ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై డీఐఈఓలు, నోడల్ ఆఫీసర్లతో ఆయన జూమ్ సమావేశం నిర్వహించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద గట్టి నిఘా ఉండేందుకు జిల్లాల వారిగా కస్టోడియన్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఫ్లైంగ్, సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించాలన్నారు. పరీక్షా కేంద్రాల వివరాలను ఇంటర్ బోర్డుకు పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంటర్ బోర్డు సీఓఈ జయప్రదబాయి పాల్గొన్నారు.