
- స్టేట్లో 19 కేంద్రాల్లోఆన్సర్ షీట్ల మూల్యాంకనం
- కొత్తగా వరంగల్,మెదక్లో సెంటర్లు
- సీసీ కెమెరాల నిఘాలో ప్రక్రియ
- ఏప్రిల్ రెండోవారం లోపే ముగించేలా ఇంటర్ బోర్డు చర్యలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. సంస్కృతం సబ్జెక్టు కాకుండా నాలుగు విడతల్లో స్పాట్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్పాట్ కేంద్రాల్లో మరింత నిఘా పెంచేందుకు గానూ అన్నింటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 వరకు కొనసాగే ఈ పరీక్షలకు 9.96 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు అటెండ్ కానున్నారు. ఈ సారి రిజల్ట్ ను త్వరగా ఇవ్వాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
ఏప్రిల్ రెండోవారం లోపే ముగించేలా చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఈ నెల 10న సంస్కృతం ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లకు చెందిన ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. 22 న ఫస్ట్ స్పెల్వాల్యుయేషన్ ప్రారంభం కానున్నది. తొలుత ఇంగ్లిష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పేపర్లకు చెందిన స్పాట్ కొనసాగున్నది. 24న సెకండ్ స్పెల్ లో ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులు ప్రారంభం కానున్నాయి. 26న మూడో విడతలో కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టులకు , 28 నుంచి నాలుగో విడత స్పాట్ మొదలు కానుండగా.. హిస్టరీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ కానున్నది.
20వేల మందితో వాల్యుయేషన్..
ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియ కోసం ఇంటర్ బోర్డు అధికారులు 19 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గతేడాది కొత్తగా రెండు సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది మరో రెండు సెంటర్లు పెట్టాలని డిసైడ్ అయ్యారు. వీటిని మెదక్, వరంగల్ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నారు.
అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సుమారు నెలన్నర రోజులు ఈ ప్రక్రియ కొనసాగనుంది. కాగా, ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ఈ నెల 10 నుంచి ప్రారంభిస్తున్నట్టు ఇంటర్ బోర్డు సీఓఈ జయప్రదబాయితెలిపారు. గతేడాది 15వేల మందితో ఈ ప్రక్రియ కొనసాగగా.. ఈ ఏడాది 20వేల మందితో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. స్పాట్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.