తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా..

తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా..

 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర సంబంధాల వ్యవహారాల్లో, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పదేండ్లుగా పీటముడిపడ్డ విభజన అంశాల్లోనూ.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ  ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అనుభవమున్న రాజకీయ నేతలకు మించిన విలక్షణమైన ఆలోచనలతో సీఎం రేవంత్​ అడుగులేస్తున్నారు. 

ఇంతకాలం రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలన్నింటినీ దారికి తెచ్చేందుకు ఆయన తెలంగాణ ప్రయోజనాలను కాపాడే సేఫ్ గార్డ్​గా నిలబడ్డారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర విభజన జరిగి పదేండ్లయింది. విభజన చట్టం ప్రకారం పదేండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా అవతరించింది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఉద్యమంలో అందరినీ ఉత్తేజపరిచి ఉర్రూతలూగించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఇగోకు పోయి రాష్ట్ర గీతంగా ప్రకటించకుండా పక్కనపెట్టింది.  పదేండ్ల తర్వాత అదే గీతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి రాష్ట్రంలోని కవులు, కళాకారులు, సాహితీవేత్తలందరి మన్ననలు అందుకున్నారు. 

అధికారులకు సీఎం రేవంత్​ దిశానిర్దేశం

ఈ దశాబ్ది వేడుకల ఏర్పాట్లపై సీఎం దగ్గర జరిగిన ఓ సమావేశంలో జరిగిన సంభాషణలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది. రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలో ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న అంశాలన్నింటినీ ఆ మీటింగ్ లో  సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. విభజన చట్టం ప్రకారం ఎవరి భూభాగంలో ఉన్న ఆస్తులు, సంస్థలన్నీ వారికే చెందుతాయి.

 కానీ.. మన సింగరేణిలో కూడా తమకు వాటా ఇవ్వాలని ఏపీ కొంతకాలంగా పట్టుబడుతోందని అధికారులు అన్నారు. ‘అయితే ఒక పని చేద్దాం.. వాళ్లు సింగరేణిలో వాటా అడిగితే.. ఏపీలో 974 కిలోమీటర్ల విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాం తంలో తెలంగాణకు వాటా అడుగుదాం. తెలంగాణలో ఓడ రేవులు లేవు. ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం  పోర్టులలో తెలంగాణకు వాటా ఇవ్వాలని అడుగుదాం’ అని ముఖ్యమంత్రి అన్నారు.  

టీటీడీలో వాటా ఇస్తారా?

హైదరాబాద్ లో ఇంతకాలం కోర్టు కేసుల చిక్కుముడి నుంచి వీడిన ఐఎంజీ, దిల్ భూముల్లోనూ తమకు వాటా ఇవ్వాలని ఏపీ అడుగుతోంది.. అని అధికారులు చెబుతుండగానే సీఎం జోక్యం చేసుకున్నారు. ‘తెలుగు ప్రజల ఆరాధ్య పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలని మనం అడుగుదాం. అది కూడా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి కిందికే వస్తుంది..’ అని అక్కడికక్కడే దిశానిర్దేశం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య పీటముడి పడ్డ అంశాలపై కిం కర్తవ్యం.... అని తటపటాయిస్తున్న అధికారులకు అది ముఖ్యమంత్రి ఇచ్చిన మర్యాద రామన్న తీర్పులాగే అర్థమయింది.

పదేండ్ల పాటు పంపకాలు జరగలేదు

ఇంతకాలం కొరకరాని కొయ్యలా తయారైన ఎన్నో పెండింగ్ అంశాల పరిష్కారాలకు సీఎం ఇచ్చిన సలహాలు కొత్తగా దిశానిర్దేశం చేసినట్లయింది.  కేసీఆర్​ సారథ్యంలోని గత బీఆర్ఎస్​  ప్రభుత్వం పదేండ్ల పాటు విభజన అంశాలను గాలికి వదిలేసింది. విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10లో పొందుపరిచిన సంస్థల పంపిణీపై నెలకొన్న పేచీలపై ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని పట్టువిడుపులతో అధికారుల స్థాయిలో పరిష్కారమయ్యేవి వీటిలో ఎక్కువగా ఉన్నాయి.

 కానీ.. పాత ప్రభుత్వం అటు ఢిల్లీలోనూ, పొరుగున ఉన్న ఏపీలోనూ సొంత రాజకీయ లబ్ధి కోసం పదేండ్లయినా వీటిని పరిష్కరించే చొరవ చూపలేదు. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్తు బకాయిల విషయంలోనూ ఇప్పటికీ స్పష్టత కొరవడింది. అటు దిశగా జరిగిన ప్రయత్నాలు తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్లే సాగాయి. 

తెలంగాణకు ఏపీ విద్యుత్​ సంస్థలు 24 వేల కోట్ల బకాయిలు

తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.24,000 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఆంధ్రాకు తెలంగాణ ఏమైనా బకాయిలుంటే మినహాయించుకొని మిగతావి చెల్లించాలంటూ సీఎం రేవంత్​రెడ్డి స్పష్టమైన వైఖరిని ఎంచుకున్నారు. దీంతో ఒక్కటొక్కటిగా మూలనపడ్డ విభజన అంశాల పరిష్కారానికి మార్గం సుగమమైంది. కీలకమైన చిక్కుముడులకు సులువైన చిట్కాలు దొరికాయని అధికారుల్లో చర్చ జరిగింది.

కృష్ణా జలాల పంపకానికి.. పరీవాహక ప్రాంతమే ప్రామాణికం

కృష్ణా నదీ జలాల విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో వ్యవహరిస్తున్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రాల ప్రకారం నదీ పరివాహక ప్రాంతం ఉన్న భూభాగం ఎంతమేరకు ఉంటే అదే దామాషా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. ఈ లెక్కన కృష్ణా నదీ ప్రవహించే ప్రాంతం తెలంగాణ భూభాగంలోనే 68 శాతం ఉంటుంది. 

అదే దామాషా ప్రకారం 558 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలనే వాదనను సీఎం లేవనెత్తారు. అదే వాదనను ట్రిబ్యునల్ ఎదుట వినిపిం చి నీటి వాటాలకు పట్టుబట్టాలని రేవంత్ రెడ్డి తొలి అసెంబ్లీ సమావేశాల నుంచే సరైన ఎత్తుగడ వేశారు.

తెలంగాణ కమిట్​మెంట్​ను చాటుకున్న రేవంత్​

విభజనకు సంబంధించి పెండింగ్​లో ఉన్న అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాయడం, స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ఆహ్వానించి హుందాగా వ్యవహరించిన తీరు దేశమందరి దృష్టిని ఆకర్షించింది. రెండు రాష్ట్రాల ప్రజలను మెప్పించింది.  భేటీ ప్రారంభమవగానే ప్రజాకవి కాళోజీ రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని చంద్రబాబునాయుడుకు తన కానుకగా బహూకరించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తనకు అత్యంత ప్రాధాన్యమని సీఎం రేవంత్ రెడ్డి  చెప్పకనే చెప్పారు. 

తెలంగాణ  అభివృద్ధికే సీఎం రేవంత్ ప్రాధాన్యం

కృష్ణా జలాలపై గత ప్రభుత్వం పడేండ్ల పాటు నాన్చుడు ధోరణి అవలంబించింది. అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే మౌనందాల్చింది. కృష్ణా ప్రాజెక్టులపై చిన్నచూపు చూసింది. దీంతో రేవంత్ రెడ్డి ఎంచుకున్న కృష్ణా నీటి వాటాల నినాదం తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడేలా ఆయన ఎంచుకున్న నిర్ణయం అందరినీ ఆకట్టుకుంది. 

 ‘ప్రపంచంలో ఎంతటి సమస్య అయినా... అది యుద్ధం అయినా సరే... చర్చల ద్వారానే పరిష్కారమవుతుంది’ అనేది సీఎం రేవంత్ రెడ్డి నమ్మకం. అదే విషయాన్ని ఆయన ఇటీవల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలోనూ ప్రస్తావించారు. 

విభజన అంశాలను.. కేసీఆర్​ సర్కార్​ బేఖాతర్​

‘విభజన చట్టం అమల్లోకి వచ్చి పదేండ్లయింది. ఇంతకాలం హైదరాబాద్ లో ఏపీకి ఇచ్చిన  లేక్ వ్యూ గెస్ట్ హౌస్, హెర్మిటేజ్ బిల్డింగ్.. ఏమేం ఆస్తులున్నాయో లెక్కతీయండి. వాటిని స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టండి’ అని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ’కొన్నింటికి అద్దె చెల్లిస్తాం. మాకే ఇవ్వండి...’ అని ఏపీ ప్రభుత్వం కొంతకాలం కిందట లేఖ రాశారని అధికారులు చెప్పారు. వెంటనే సీఎం ’నథింగ్ డూయింగ్..’ అన్నారు. పదేండ్లుగా ఎటూ తేల్చకుండా నాన్చిన పాత కేసీఆర్​ ప్రభుత్వానికి.. రేవంత్ రెడ్డి నవతరం ఆలోచనకు ఎంత తేడా ఉందో అక్కడే తేలిపోయింది. మచ్చుకు ఇవి ఉదాహరణలు మాత్రమే.

 బొల్గం శ్రీనివాస్,
తెలంగాణ ముఖ్యమంత్రి
ప్రజా సంబంధాల అధికారి