- జువాలజీ, బాటనీలోనూ పది శాతం వరకు కోత
- స్టూడెంట్లపై చదువుల ఒత్తిడిని తగ్గించడం కోసం నిర్ణయం
- పాఠాలు తగ్గించినా.. క్వాలిటీ కంటెంట్ఉండేలా ఇంటర్ బోర్డు చర్యలు
- వచ్చే విద్యా సంవత్సరం ఫస్టియర్ నుంచి అమల్లోకి
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ స్టూడెంట్స్పై ఒత్తిడి తగ్గించేందుకు కొంత సిలబస్‌ను తగ్గించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. పాఠాల సంఖ్య తగ్గించి క్వాలిటీ కంటెంట్ఉండేలా చర్యలు చేపట్టింది. ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను దృష్టిలో పెట్టుకొని కెమిస్ట్రీ, ఫిజిక్స్‌తోపాటు పలు సబ్జెక్టుల్లో సిలబస్‌ను కుదించనుంది. దీన్ని 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌లో అమలు చేయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2,700లకు పైగా ఇంటర్ కాలేజీలుండగా, వాటిలో తొమ్మిదిన్నర లక్షల మంది చదువుతున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ పెంపుపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సిలబస్‌లో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు భావించింది. అయితే, పరిమితికి మించి పలు సబ్జెక్టుల్లో సిలబస్ ఉన్నట్టు బోర్డు గుర్తించింది.
Also Read :- ఫార్ములా– ఈ రేస్‌లో కేటీఆర్‌ది ఏకపక్ష నిర్ణయం
ఎన్సీఈఆర్టీ సూచించిన సిలబస్ తోపాటు అడిషనల్ సిలబస్ ఉండడంతో దాన్ని తొలగించాలని డిసైడ్ అయింది. మరో పక్క జేఈఈ, నీట్‌తోపాటు జాతీయస్థాయి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని, సిలబస్ కుదించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ఈ వారంలోనే సబ్జెక్టుల వారీగా ఎక్స్ పర్ట్ కమిటీలను ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. వారి ఆధ్వర్యంలో ఏ చాప్టర్లు తొలగించాలని, ఏ చాప్టర్లోని అంశాలను తగ్గించాలని అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. చదువుల విషయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని, ఆ ఒత్తిడిని తగ్గించేందుకే చర్యలు తీసుకుంటున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
కెమిస్ట్రీలో 30 శాతం కోత
ఫస్టియర్, సెకండియర్లోని సైన్స్ సబ్జెక్టుల్లో ఎక్కువగా సిలబస్ ఉన్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. దీంతో కెమిస్ట్రీలో 30 శాతం సిలబస్ తగ్గించాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఆరు చాప్టర్లను తొలగించనున్నారు. ఫిజిక్స్ లోనూ సుమారు 15 శాతం వరకు సిలబస్ తగ్గించాలని యోచిస్తున్నారు. దీంతో రెండు లేదా మూడు చాప్టర్లకు కోత పెట్టనున్నారు. బాటనీ, జువాలజీ సబ్జెక్టుల్లోనూ 5 నుంచి పది శాతం వరకు సిలబస్ ను తగ్గించనున్నారు. దీంతో ఒకటీ, రెండు చాప్టర్లు తీసెయ్యనున్నారు. దీంతో పాటు ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టుల్లోనూ కొంత సిలబస్ తగ్గనుంది. దీంతోపాటు కొత్త సిలబస్ 2025–26 విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్ విద్యార్థులకు అందుబాటులోకి రానున్నది. సెకండియర్ స్టూడెంట్లకు కొత్త సిలబస్ 2026–27 నుంచి అమలు కానుంది.