ఇంటర్​ సెకండియర్​లో 71% పాస్

ఇంటర్​ సెకండియర్​లో 71%  పాస్
  • ఫస్టియర్​లో 66.89% మంది..
  • రిజల్ట్స్ రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి 
  • ఫలితాల్లో ములుగు టాప్.. కామారెడ్డి లాస్ట్ 
  • -కార్పొరేట్​ కంటే గురుకులాల్లోనే ఎక్కువ ఉత్తీర్ణత
  • ఈసారి కూడా సత్తా చాటిన అమ్మాయిలు 
  • నేటి నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్​కు దరఖాస్తులు 
  • మే 22 నుంచి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఈసారి పాస్​పర్సంటేజీ పెరిగింది. ఫస్టియర్​లో  66.89% మంది స్టూడెంట్లు పాస్ కాగా.. సెకండియర్​లో 71.37%  మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే  ఫస్ట్​ఇయర్, సెకండ్​ఇయర్​ ఫలితాల్లోనూ ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది ఫస్టియర్​లో 60.01 శాతం మంది  పాస్ కాగా, ఈసారి 64.19శాతం  మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ లో గతేడాది 64.19 శాతం మంది పాస్ కాగా, ఈసారి 71.37శాతానికి పెరిగింది. ఈ లెక్కన ఫస్టియర్​లో 5.21శాతం, సెకండియర్ లో 7.18 శాతం పాస్ పర్సంటేజీ పెరిగినట్లయింది. సెకండియర్ ఫలితాల్లో మరోసారి ములుగు జిల్లా టాప్​లో నిలవగా.. కామారెడ్డి చివరిస్థానానికి పడిపోయింది.

ఈ సారి ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల కంటే గురుకుల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ఎప్పటిలాగే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే మళ్లీ సత్తా చాటారు. నాంపల్లిలోని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఫలితాలను రిలీజ్ చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వారంతా అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యారంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని, ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని భట్టి వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ యోగితరాణా, ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

సెకండియర్​లో 71.37శాతం ఉత్తీర్ణత.. 

సెకండియర్ లో జనరల్ రెగ్యులర్ కేటగిరీలో 3,99,943 మంది పరీక్షలు రాయగా.. 2,85,435 (71.37%) మంది పాసయ్యారు. అమ్మాయిలు 2,06,161 మంది పరీక్షలు రాస్తే.. 1,60,244 మంది (77.73%) మంది పాసయ్యారు. అబ్బాయిలు 1,93,782 మంది పరీక్షలు రాయగా.. 1,25,191 (54%) మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ కేటగిరీలో రెగ్యులర్ విద్యార్థులు 40,864 మంది పరీక్షలు రాయగా.. 28713 (70.26%) మంది పాసయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 62,503 మందికి గానూ 17,358 మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా, ఫలితాల్లో ములుగు జిల్లా 81.06% పాస్ పర్సంటేజీతో టాప్​ లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా (80.24%), మేడ్చల్ జిల్లా (77.91%) ఉన్నాయి. 56.38 శాతంతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 

ఫస్టియర్​లో 66.89 శాతం పాస్.. 

ఫస్టియర్​ లో జనరల్ కేటగిరీలో 4,39,302  మంది పరీక్షలు రాయగా.. 2,93,852 (66.89%) మంది పాసయ్యారు. వీరిలో ఏ గ్రేడ్ (75% కంటే ఎక్కువ మార్కులు) పొందిన విద్యార్థులు ఏకంగా 1,89,638 ఉండటం గమనార్హం. అమ్మాయిలు 2,23,407 మంది పరీక్షలు రాయగా.. 1,64,876 (77.73%) మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 2,15,895 మంది ఎగ్జామ్స్ రాయగా.. వారిలో 1,28,976 (59.74%) మంది పాసయ్యారు. వొకేషనల్ కేటగిరీలో మొత్తం 49,128 మంది పరీక్షలు రాయగా.. 28,339 (57.68%) మంది పాసయ్యారు. ఓవరాల్ గా ఇంటర్ ఫస్టియర్​లో 4,88,430 మంది పరీక్షలు రాస్తే.. 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్​ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 77.21శాతంతో టాప్​లో ఉండగా, రెండు, మూడు స్థానాల్లో రంగారెడ్డి (76.36%), కుమ్రంభీం ఆసిఫాబాద్ (70.52%) జిల్లాలు నిలిచాయి. 48.43%తో మహబూబాబాద్ జిల్లా చివరిస్థానంలో నిలిచింది.  

కార్పొరేట్ కంటే గురుకులాల్లోనే ఉత్తీర్ణత ఎక్కువ.. 

ఇంటర్ ఫలితాల్లో సర్కారీ గురుకులాలు సత్తా చాటాయి. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలతో పోలిస్తే, భారీగా పాస్ పర్సంటేజీ నమోదైంది. అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని గురుకులాల్లో సెకండియర్ లో 80 శాతానికి పైగానే పాస్ పర్సంటేజీ రావడం గమనార్హం. ప్రైవేటు కాలేజీల్లో సెకండియర్​లో 65.83శాతం మంది పాస్ కాగా, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులాలు 92.9శాతం ఉత్తీర్ణతతో టాప్ లో నిలిచాయి. బీసీ వెల్ఫేర్ లో 81.98%, ఎస్సీ వెల్ఫేర్ లో 84.38%, ట్రైబల్ వెల్ఫేర్ లో 81.53శాతం, మైనార్టీ వెల్ఫేర్ లో 82.2శాతం మంది పాస్ అయ్యారు. అయితే, సర్కారు కాలేజీల్లో మాత్రం 53.44 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ఆర్ట్స్ విద్యార్థుల వెనుకంజ.. 

ఇంటర్ ఫలితాల్లో సైన్స్ గ్రూపులతో పోలిస్తే ఆర్ట్స్ గ్రూపులకు చెందిన విద్యార్థులు వెనుకంజలో ఉన్నారు. సెకండియర్​లో ఎంపీసీలో 72.23శాతం, బైపీసీలో 71.93 శాతం మంది ఉత్తీర్ణత సాధిస్తే.. సీఈసీలో 46.26%, హెచ్​ఈసీలో 46.26%, ఎంఈసీలో 56.96% మంది పాసయ్యారు. ఫస్టియర్​ లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎంపీసీలో 76.65%, బైపీసీలో67.88% మంది పాసైతే హెచ్​ఈసీలో 34.51%, సీఈసీలో 45.56% మంది ఉత్తీర్ణత సాధించారు. ఆర్ట్స్ లోనూ హెచ్​ఈసీ గ్రూపులోనే తక్కువ పాస్ పర్సంటేజీ నమోదైంది. ఆర్ట్స్​గ్రూపుల్లో చేరే వారంతా ఎక్కువ మంది సర్కారు కాలేజీల్లో చదివే విద్యార్థులేనని అధికారులు చెప్తున్నారు.  

నేటి నుంచి రీకౌంటింగ్​కు దరఖాస్తులు

ఇంటర్మీడియెట్ ఆన్సర్ షీట్ల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్​కు నేటి దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ నెల 30 వరకు ఆన్​ లైన్​లో అప్లై చేసుకోవాలని సూచించారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్​కు రూ.వంద, రీవెరిఫికేషన్​ కు రూ.600 ఫీజు ఉంటుందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు https://tsbie.cgg.gov.in ఇంటర్ బోర్డు వెబ్ సైట్ చూడాలని, ఈ సైట్ ద్వారానే అప్లై చేసుకోవచ్చని చెప్పారు. అలాగే, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఫెయిలైన విద్యార్థులకు మే 22 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీరోజూ రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయన్నారు. జూన్ 3 నుంచి 6 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. దీనికోసం ఈ నెల 23 నుంచి 30 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.

సెకండియర్ టాపర్లు వీరే.. 

బైపీసీ

 జక్కు అంజన (997 మార్కులు)    కరీంనగర్ 
కేతవత్ అఖిల  (996 మార్కులు)    దేవరకొండ 
డి.జ్యోష్న శ్రీ (996 మార్కులు)    కరీంనగర్ 
ఆప్షాన్ జాబీన్ (996 మార్కులు)    బాలానగర్​ 
వంటిపులి శరత్ (996 మార్కులు)    హైదరాబాద్ 

ఎంపీసీ 

ఇందూరి రష్మిత (996 మార్కులు)    ఖమ్మం 
వారణాసి మనస్వీ (996 మార్కులు)    రంగారెడ్డి 
కూన రుత్విక్ (996 మార్కులు)    కరీంనగర్ 
పి. వసంత్ కుమార్ (996 మార్కులు)    సూర్యాపేట 

సీఈసీ 

వై. కెవిన్ జోసెఫ్ (988 మార్కులు)    కూకట్ పల్లి 
బి. గ్రీష్మా (987 మార్కులు)    కరీంనగర్ 
ఏ. శరత్ (986 మార్కులు)    ఇబ్రహీంపట్నం

ఇంటర్​ ఉత్తీర్ణత వివరాలు (రెగ్యులర్ కేటగిరీ) 

ఇయర్    ఫస్టియర్(శాతం)     సెకండియర్(శాతం)
2021    100     100 
2022     63.32     67.16  
2023      61.68    63.49  
2024      60.01%      64.19%  
2025     66.89%       71.37%

గ్రూపుల వారీగా పాస్ పర్సంటేజీ  

ఫస్టియర్ 
గ్రూప్      రాసింది    పాస్       పర్సంటేజీ  
ఎంపీసీ     2,23,996     1,71,691    76.65  
బైపీసీ    98,646     66,962    67.88   
సీఈసీ    92,745    42,259    45.56    
హెచ్ఈసీ     8,959    3,092      34.51      
ఎంఈసీ    14,600        9,567     65.53

సెకండియర్ 

గ్రూప్    రాసింది    పాస్    పర్సంటేజీ
ఎంపీసీ    2,34,916    1,69,686    72.23
బైపీసీ        98,958     71,181    71.93
సీఈసీ      1,03,713    48,658    46.92
హెచ్ఈసీ    9,031     4,178     46.26
ఎంఈసీ    15,316     8,724     56.96