- ఆ ప్రాజెక్టును ఆపాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినం: ఉత్తమ్
- హరీశ్ రావు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్
- బనకచర్లపై ఏపీ కేవలం ప్రతిపాదనలే పంపింది.. అయినా మేం పోరాడ్తున్నం
- తెలంగాణ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం
- బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రానికి తీరని నష్టం
- వాళ్ల అసమర్థతతోనే ఏపీ నీళ్ల దోపిడీ రెండింతలైంది
- కృష్ణా జలాల్లో కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకున్నది వాళ్లేనని ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై తాము అలర్ట్‌గా ఉన్నామని, దాన్ని కచ్చితంగా అడ్డుకుంటామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆపాలని, అనుమతులు ఇవ్వొద్దని, నిధులు కేటాయించవద్దని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్పాటిల్ తో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ పంపించామని వెల్లడించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టానికి పూర్తి వ్యతిరేకమని ఆయన అన్నారు. ‘‘ఈ ప్రాజెక్టు కోసం ఏపీ సీఎం కేంద్రానికి కేవలం ప్రతిపాదనలే పంపారు.
అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బనకచర్లపై మా సర్కార్ పోరాటం ప్రారంభించింది. కానీ బనకచర్లపై హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. గతంలో ఇరిగేషన్మినిస్టర్గా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం సమంజసం కాదు. ఏపీ సీఎం నిధుల కోసం కేంద్రానికి లేఖ రాశారని హరీశ్‌రావు అంటున్నారు. ఫండ్స్కోసం రాస్తే రాసి ఉండొచ్చు. కానీ బనకచర్ల ప్రాజెక్టు అక్రమమని, దానికి నిధులు కేటాయించవద్దని నిర్మలా సీతారామన్‌కు మేం విజ్ఞప్తి చేశాం” అని తెలిపారు. ‘‘వాళ్లే ఇరిగేషన్‌ను ఉద్ధరించినట్టు.. మేమేమీ చేయనట్టు హరీశ్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. కేసీఆర్, హరీశే అద్భుతాలు సృష్టించినట్టు.. నీళ్ల కోసం కొట్లాడినట్టు నాటకాలు ఆడుతున్నారు. వాళ్ల అసమర్థత, అవగాహనలేమి, అహంకారంతో.. రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో కోలుకోలేని నష్టం జరిగింది” అని అన్నారు.
తెలంగాణకు ద్రోహం చేసిందే బీఆర్ఎస్ నేతలు..
కృష్ణా నీళ్లలో తెలంగాణకు రావాల్సిన వాటా కోసం పోరాడుతున్నామని, బీఆర్ఎస్చేసిన తప్పులను సరిచేస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. ‘‘కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ట్రిబ్యునల్ 2లో వాదనలకు నేనే స్వయంగా హాజరయ్యాను. బహుశా ఏ ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ట్రిబ్యునల్‌లో విచారణకు ఇప్పటి వరకు వెళ్లలేదు. బీఆర్ఎస్ఒప్పుకున్న నీటి వాటాలపై రివ్యూ చేయాలని ట్రిబ్యునల్ ముందు వాదించాం. అందులో సక్సెస్అయ్యాం. తెలంగాణకు ద్రోహం చేసిందే బీఆర్ఎస్ నేతలు” అని మండిపడ్డారు. ‘‘2015 జూన్18, 19న జరిగిన మీటింగ్స్ కు ఎస్కే జోషి హాజరయ్యారు. తెలంగాణకు 299 టీఎంసీలే చాలు.. ఏపీకి 512 టీఎంసీలు ఇవ్వాలని అంగీకరించింది హరీశ్ రావు, కేసీఆరే. నదీ పరివాహకం ఆధారంగా తెలంగాణకు 70 శాతం, ఏపీకి 30 శాతం ఇవ్వాలి. కానీ, రివర్స్‌లో చేశారు.
2016 జూన్21, 22లోనూ అదే వాటాకు ఒప్పుకున్నారు. 21 సెప్టెంబర్2016న కేసీఆర్ హాజరయ్యారు. కేంద్ర, ఏపీ మినిస్టర్ల మీటింగ్‌లోనూ పాత వాటాకు అంగీకరించారు. కేసీఆర్ సీఎంగా, హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా.. 2017లో ముచ్చుమర్రి కెపాసిటీని పెంచినా నోరు మెదపలేదు. శ్రీశైలం డెడ్‌స్టోరేజీ నుంచి రాయలసీమ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ జీవో జారీ చేసినా.. నాటి ఏపీ సీఎం జగన్‌తో అలయ్ బలయ్ చేసుకున్నారు. తెలంగాణ రాకముందు ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు తీసుకుపోతే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్హయాంలో 96 వేల క్యూసెక్కులు తీసుకుపోయింది’’ అని ఉత్తమ్ చెప్పారు.
70 శాతం వాటాకు ఎందుకు పోరాడలేదు?
తెలంగాణ రాకముందు శ్రీశైలం నుంచి ఏపీ రోజూ 4.1 టీఎంసీ నీళ్లు తీసుకెళ్తే, తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్హయాంలో అది 9.6 టీఎంసీలకు పెరిగిందని ఉత్తమ్తెలిపారు. ‘‘2020 ఆగస్టు 10న రాయలసీమ ప్రాజెక్ట్ టెండర్ఫిక్స్ అయింది. వాస్తవానికి జులైలో అపెక్స్కౌన్సిల్మీటింగ్ఉన్నా.. ఆగస్టు తర్వాత పెట్టాలంటూ నాటి ఇరిగేషన్సెక్రటరీ కేంద్రానికి లేఖ రాశారు. కారణం అప్పటికల్లా రాయలసీమ టెండర్లు పూర్తవుతాయని నాటి సర్కార్ భావించింది. ఇన్‌డైరెక్ట్‌గా రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించేందుకే నాటి సర్కార్ చప్పుడు చేయలేదు. ఏపీతో నాటి సర్కార్ కుమ్మక్కయిందనడానికి ఇదే నిదర్శనం.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో బీఆర్ఎస్సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వాళ్లు సరిగా స్పందించి నిధులు ఇచ్చి ఉంటే ప్రాజెక్టు పూర్తయి ఉండేది. రెండో అపెక్స్కౌన్సిల్మీటింగ్కు అప్పటి సీఎంలు కేసీఆర్, జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్షెకావత్హాజరయ్యారు. ఆ మీటింగ్‌లోనూ ఏపీ, తెలంగాణకు 66:34 శాతం వాటాకు ఓకే చెప్పారు. అప్పుడే దీనిపై బీఆర్ఎస్వాళ్లు ఎందుకు పోరాడలేదు. రాష్ట్రానికి 70 శాతం వాటా ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదు’’ అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడ్తం..
రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమని ఉత్తమ్ చెప్పారు. ‘‘బీఆర్ఎస్వాళ్లు పదేండ్లలో ఏ ఒక్క ప్రాజెక్టుకూ నీటి కేటాయింపులను తేలేకపోయారు. ఇప్పుడు సీతరామసాగర్కు 60 టీఎంసీల కేటాయింపులు మేమే చేయించాం. సమ్మక్కసాగర్‌కు చత్తీస్గఢ్నుంచి ఎన్వోసీ తీసుకొస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టునూ ముందుకు తీసుకెళ్తాం” అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ కొనసాగుతున్నదని, అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ పై హరీశ్ చేసిన కామెంట్స్ పై ఉత్తమ్ స్పందిస్తూ.. ‘‘ఐఏఎస్ఆఫీసర్ల గురించి చీప్‌గా మాట్లాడొద్దు. వాళ్లు ఎక్కడ పని చేస్తే, ఆ రాష్ట్రానికి అనుగుణంగా ఉంటారు. మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి వచ్చారు. అలాంటి మీరు ఐఏఎస్గురించి ఎలా మాట్లాడుతారు? ఇవన్నీ చిల్లర రాజకీయాలు” అని మండిపడ్డారు.
అనుమతులివ్వొద్దని కేంద్రానికి లేఖ
ఏపీ నిర్మించతలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వొద్దని, ఆ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం చేయొద్దని కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ కోరారు. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి టెక్నికల్క్లియరెన్స్ లేదని, దానికి అనుమతిస్తే తెలంగాణ నీటి హక్కులకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన బుధవారం లేఖ రాయగా.. అవి ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
తెలుగు రాష్ట్రాలు ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టినా అపెక్స్‌కౌన్సిల్, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీతో పాటు సీడబ్ల్యూసీలో టెక్నికల్ అనుమతులు పొందాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టు అక్రమమని తెలిపారు. ‘‘గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్గంపగుత్తగా 1,486 టీఎంసీలు కేటాయించింది. అందులో తెలంగాణకు 968 టీఎంసీలు ఇచ్చింది. మిగులు జలాల లెక్కను ఇంకా తేల్చలేదు. ఇప్పటికే తెలంగాణలోని చాలా వరకు కరువు ప్రాంతాలు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. ఏపీ చేపట్టే ఆ ప్రాజెక్టుతో ఆయా ప్రాంతాలకు మరింత నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆర్థిక సాయం, గ్రాంట్ గానీ, అంతర్జాతీయ ఆర్థిక సహకారం గానీ అందించకూడదు” అని లేఖలో కోరారు.
కౌశిక్.. అంత ఆవేశమెందుకు?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన తీరు మార్చుకోకపోతే.. రాజకీయ భవిష్యత్ ఉండదని మంత్రి ఉత్తమ్అన్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై మీడియా చిట్‌చాట్‌లో మంత్రి అసహనం వ్యక్తం చేశారు .
‘‘మంత్రిగా నేను స్టేజి మీద ఉండగానే అల్లరి చేయడం లీడర్ లక్షణం కాదు. యువ రాజకీయ నాయకుడైన కౌశిక్ రెడ్డికి అంత ఆవేశం పనికి రాదు. కౌశిక్ రెడ్డితో నాకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు. కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే భవిష్యత్ లో ఇబ్బందిపడ్తడు” అని ఉత్తమ్ పేర్కొన్నారు.