మహిళా శిశు సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తున్నం : మంత్రి సీతక్క

 

  • పోషకాహార తెలంగాణ కోసం కృషిచేస్తున్నాం
  • ఉదయ్​పూర్ చింతన్ శిబిర్​లో మంత్రి సీతక్క

న్యూఢిల్లీ, వెలుగు: మహిళా శిశు సంక్షేమంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర మహిళా శిశు, సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలను తమ ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ఆమె చెప్పారు. అలాగే, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా పెరగాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా భాగస్వామ్యం పెంచాలని సూచించారు. కేంద్ర మహిళా శిశు, సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అధ్యక్షతన శనివారం రాజస్థాన్​లోని ఉదయ్ పూర్​లో చింతన్  శిబిర్ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ నుంచి మంత్రి సీతక్క, మహిళా శిశు, సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత, డైరెక్టర్ కాంతి వెస్లీ హాజరయ్యారు.

మహిళా శిశు సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న ప్రత్యేక పథకాలు, సాధించిన పురోగతి, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారం పై మంత్రి సీతక్క ప్రసంగించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంలో అంగన్​వాడీ కేంద్రాలు పోషిస్తున్న పాత్రను వివరించారు. రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి స్కీం ద్వారా గర్భిణీలు, బాలింతలకు రోజూ 200 ఎంఎల్  పాలతో పాటు అదనపు గుడ్డును అందిస్తున్నామని, అందుకోసం ఏటా రూ.296 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్  ద్వారా ప్రత్యేక పోషకాలతో కూడిన ఆహారం అందిస్తున్నామని చెప్పారు. 

రాష్ట్రంలో 35,700 అంగన్​వాడీ కేంద్రాలు

తెలంగాణలో 35,700 అంగన్​వాడీ కేంద్రాలను నడుపుతున్నామని మంత్రి సీతక్క చెప్పారు. అంగన్ వాడీ చిన్నారులకు రంగుల యూనిఫామ్ ను ఉచితంగా అందజేశామని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో మహిళా సంఘాలతో సోలార్  విద్యుత్  ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, క్యాంటీన్లను నిర్వహిస్తున్నాం. రాష్ట్రాలకు తగ్గిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తన వాటాను పెంచాలి” అని సీతక్క పేర్కొన్నారు.