
పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు అనేది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో పొట్టిశ్రీరాములు తెలువు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం పనిచేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే పేర్లు మార్చుతున్నట్లు తెలిపారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై చర్చలో సందర్భంగా.. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించందని తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను ఎవరూ తక్కువ చేయడం లేదని, గాంధీ ఆదర్శంతో ప్రాణత్యాగంతో మద్రాస్ నుంచి ఆంధ్ర ఏర్పాటుకోసం ఆయన చేసిన త్యాగాన్ని ఎవరూ తక్కువగా చూడటం లేదని అన్నారు. అదే సందర్భంలో తెలంగాణ వైతాళికులను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పొట్టి శ్రీరాములు పేరుకు బదులు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని కూనంనేని సూచించారని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. 2014 పునర్విభజన తర్వాత తెలంగాణకు కొన్ని సంస్థలు, యూనివర్సిటీలు వచ్చాయని,
పరిపాలన, పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన వారి పేర్లను మన సంస్థలకు పెట్టుకోవడం జరుగుతోందని తెలిపారు.
Also Read : విద్యార్థుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతంలో ఉన్నవి ఆంధ్రకు, తెలంగాణలో ఉన్నవి తెలంగాణకు కేటాయించడం జరిగిందని, అందులో భాగంగా పేర్లు మార్చుకోవడంం జరుగుతోందని చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రకు వెళ్లిందని, తెలంగాణ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకోవడం జరిగిందని అన్నారు. దీనికి అర్థం ఎన్టీఆర్ పై గౌరవం లేనట్లు కాదని గుర్తు చేశారు.
ప్రత్యేక రాష్ట్రంలో పేరును మార్చుకోవడంలో భాగంగా ఆచార్య ఎన్జీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి.. ప్రొ.జయశంకర్ యూనిర్సిటీగా మార్చుకోవడం జరిగిందని అన్నారు. హార్టీ కల్చర్ యూనిర్సిటీకి కొండా లక్షణ్ బాపూజీ పేరు పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన యూనివర్సటీలకు పేర్లు మార్చుకోవడం సహజమని సీఎం అన్నారు.
తెలంగాణ వెటర్నరీ యూనిర్సిటీకి పీవీ నరసింహరావు పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. అదే కోణంలో తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకోవడం సముచితం అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలుగు యూనివర్సిటీకి ఆంధ్రాలో అదే పేరు కొనసాగుతోంది. కానీ తెలంగాణలో కొత్త నామకరణం చేయడం జరిగిందని అన్నారు.
సురవరం ప్రతాపరెడ్డి సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని, తెలంగాణకు అసలు భాషనే లేదు అన్న సందర్భంలో గోల్కొండ పత్రిక ప్రారంభించి కవులను ఏకథాటిపైకి తెచ్చి నడిపించారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో సురవరం సేవ మరువలేనిదని అందుకే ఆయన పేరును తెలుగు యూనివర్సిటీకి పెట్టడం సముచితం అని అన్నారు.