పోలీసింగ్లో దేశానికే ఆదర్శం: హోం మంత్రి మహమూద్ అలీ

ఆసిఫాబాద్/కాగజ్​నగర్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్కసారి కూడా కర్ఫ్యూ పెట్టలేదని, దీన్ని బట్టి రాష్ట్రంలో కేసీఆర్ పాలన, పోలీసింగ్ ఎంత బాగుందో తెలుస్తోందని, తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆయన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్ తో కలిసి పర్యటించారు. 12.3 కోట్లతో నిర్మించిన కాగ జ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్, రూరల్ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ఆఫీస్, కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్ పేట్, రెబ్బెన పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు.

కాగజ్ నగర్ మండలం అందెవల్లి పెద్దవాగు బ్రిడ్జిని జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులు బ్రిడ్జి నిర్మిస్తారన్న నమ్మకం తనకు లేదని ఎమ్మెల్యే కోనప్ప అనడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆర్ అండ్ బీ ఈఎన్ సీ రవీందర్ రావుతో మాట్లాడారు. కొత్త బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అవసరమైతే సీఎం కేసీఆర్, ఆర్ అండ్ బీ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి తో తాము మాట్లాడుతామని చెప్పారు. కచ్చితంగా వచ్చే వానాకాలం నాటికి బ్రిడ్జి నిర్మాణం జరిగేలా చూస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న నిత్యాన్నదానం కేంద్రాన్ని పరిశీలించి భోజనం వడ్డించారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీలో స్టూడెంట్లతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ సురేష్ కుమార్, వైస్ చైర్మన్ కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.