రాష్ట్రం అభవృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దండగ అనుకన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చామని చెప్పారు. సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.
జలశలయాల ద్వారా సిరిసిల్ల మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. మిడ్ మానేరులో అతిపెద్ద ఆక్వాహబ్ తో మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుందని తెలిపారు. నేతన్నలకి తొలిసారి నేతన్న భీమా ప్రవేశపెట్టామని.. దాదాపు 80 వేల మంది నేతన్నలకు ఈ బీమా ద్వారా లబ్ది చేకూరనుందని చెప్పారు. జాతీయ జెండాల తయారీలో సిరిసిల్ల ప్రధాన భూమిక పోషించిందని..కోటి 20లక్షల జెండాలను 5వేల మరమగ్గాలపై తయారు చేయించినట్లు తెలిపారు.- రాష్ట్రంతోపాటు దేశంలోని12 రాష్ట్రాల నుండి జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు రావడంతో మువ్వన్నెల రంగులతో తెలంగాణ మురిసిపోయింని తెలిపారు.
అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోంది
అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సర్కారు పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మెదక్ కలెక్టరేట్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. దేశ స్వాతంత్ర్యం సహా తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన మహానీయుల త్యాగాలను మరిచిపోమని చెప్పారు. దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపామని..మన ఊరు మనబడి ద్వారా విద్యారంగ అభివృద్ధికి పాటు పడుతున్నామని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా జిల్లాల్లో 66 వేల ఎకరాలు, మల్లన్నసాగర్ ద్వారా 1.33 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా 3 వేల పైచిలుకు చెరువులను అభివృద్ధి చేశామన్న తలసాని..మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఎరువులు సకాలంలో అందడానికి మెదక్ లో ర్యాక్ పాయింట్ ఏర్పాటు చేశాని తెలిపారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా 2021-22 లో 2.81 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని..మెదక్ జిల్లాలో 4వేల965 ఇల్లు మంజూరుకాగా 2,344 ఇళ్లు పూర్తయ్యాయని..1300 ఇల్లు ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. 57 ఏళ్లు నిండిన వారికి నేటి నుంచి పెన్షన్లు అందజేస్తామని తలసాని తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి మహుముద్ అలీ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. జాతీయోద్యమ స్పూర్తితో అహింస మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. సంగారెడ్డి మెడికల్ కాలేజ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని..త్వరలోనే 150 మందితో తరగతులు స్టార్ట్ అవుతాయని తెలిపారు. ఇవాళ్టి నుంచి జిల్లాలో కొత్తగా 41,981 మందికి ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
కేసీఆర్ ముందుండి అభివృద్ధి వైపు నడిపించిండు
వ్యవసాయరంగంలో తెలంగాణ దేశంలోనే ఉన్నతస్థానంలో ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సమయంలో రాష్ట్రం అనేక రంగాల్లో సంక్లిష్ట పరిస్థితిలో ఉందని..అయితే కేసీఆర్ ముందుండి తెలంగాణను అభివృద్ధి వైపు నడిపించారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందన్న ఆయన..ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని వెల్లడించారు. అనంతరం కలెక్టరేట్లో ఆసరా పింఛన్ల మంజూరు పత్రాన్ని లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.