- బాల్కొండలో పర్యటన
- రూ.13.50 కోట్ల పనులు ప్రారంభం
నిజామాబాద్, వెలుగు: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. గురువారం బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన రూ.13.50 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. భీంగల్ మండలం జగిర్యాల్లో రూ.20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్, రూ.40 లక్షలతో జాగిర్యాల్ నుంచి కుప్కాల్ తండా వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులు, రూ.1.50 కోట్లతో కుప్కాల్ నుంచి భీంగల్ వయా గెస్ట్ హౌస్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.1.60 కోట్లతో కుప్కాల్ నుంచి దోన్పాల్ రోడ్డు పునరుద్ధరణ పనులు, రూ.20 లక్షలతో బెజ్జోరాలో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి, బెజ్జోరా నుంచి లింగాపూర్ చౌట్ వరకు రూ.1.60 కోట్లతో బీటీ రోడ్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు.
వేల్పూర్ మండలం పడగల్ నుంచి పోచంపల్లి వరకు రూ.95 లక్షలతో బీటీ రోడ్డు మరమ్మతు పనులు, లాక్కోరాలో రూ.20 లక్షలతో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అదే విధంగా రూ.7 కోట్లతో నూతనంగా నిర్మించిన స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పల్లెల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ఇక్కడి అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ తరహా పాలనను కోరుకుంటున్నారన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని, సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.