- హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్లో పెరుగుతున్న కేసులు
- 2 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు
- దేశవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో 12వ స్థానం
- ఆందోళన అక్కర్లేదంటున్న ఆరోగ్య శాఖ
- హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్లో పెరుగుతున్న కేసులు
హైదరాబాద్, వెలుగు : జనాలను కరోనా మళ్లీ భయపెడుతోంది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 12వ స్థానంలో ఉంది. మునుపటితో పోలిస్తే మన రాష్ట్రంలో కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో మాత్రం వైరస్ వ్యాప్తి పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. దీని కారణంగా ఇంతకముందు వరకు 0.5 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు, ఇప్పుడు 2 శాతం వరకు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో రెండు వారాల నుంచి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆయా జిల్లాల ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ జిల్లాల్లో టెస్టులు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో నలుగురైదుగురికి పాజిటివ్ వస్తోంది. దీంతో ఆయా జిల్లాల ఆఫీసర్లు వైరస్ కట్టడిపై దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ సూచించింది. కాగా, కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల హెల్త్ సెక్రటరీలతో సెంట్రల్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ సోమవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మన రాష్ట్ర హెల్త్ సెక్రటరీ రిజ్వీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర అధికారులకు రిజ్వీ వివరించగా.. టెస్టింగ్, కంటైన్‌మెంట్‌పై దృష్టి సారించాలని సూచించారు.
నిలకడగానే ఇన్‌ఫ్లుయెంజా కేసులు..
ఎండాకాలం వచ్చినా శ్వాశకోశ సంబంధిత సమస్యలు ఇప్పటికీ జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి రాష్ట్రంలో ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరిగాయి. డిసెంబర్‌లో 14,196 కేసులు రాగా, జనవరిలో 13,438, ఫిబ్రవరిలో 11,621 కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటికే 10,128 కేసులు వచ్చాయి. ఇవేవీ హెచ్3ఎన్2 వేరియంట్ కేసులు కాకపోవడం గమనార్హం. స్వైన్‌ఫ్లూ కేసులూ తక్కువగానే ఉన్నాయి. గత 3 నెలల్లో కలిపి 233 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ల గురించి అనవసరంగా ఆందోళన చెందొద్దని డాక్టర్లు చెబుతున్నారు.
పెరిగి.. తగ్గుతున్నయ్
రాష్ట్రంలో కరోనా కేసులు ఈ నెల మొదటి రెండు వారాల్లో పెరిగాయి. ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయి. ఆందోళన చెందాల్సిన స్థాయిలో వైరస్ వ్యాప్తి లేదు. కేసుల సంఖ్య కొంత పెరగడం, తగ్గడం సహజంగానే ఉంటుంది. ఇన్‌ఫ్లుయెంజా కేసులు మన దగ్గర తక్కువగానే ఉన్నాయి. ఈ రెండింటిపైనా క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నాం. ప్రభుత్వ సూచన మేరకు టెస్టుల సంఖ్య కూడా పెంచాం. పాజిటివిటీ రేటు ఒక్క శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాం.
- శ్రీనివాస్‌రావు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్