తెలంగాణ ఆశలు తీరినట్టేనా

నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని దాశరథి గొంతుతో నాడు కోట్లాది జనం సంబురపడ్డారు. రాష్ట్రంగా ఏర్పడి తెలంగాణ దశాబ్ది యేడులోకి అడుగిడుతున్నది. నేటికి తొమ్మిదేళ్లు పూర్తి. పదేళ్ల కాలం ఎక్కువా? తక్కువా? అంటే, రెండూ నిజమే! వివరంగా తెలిసిన ఒకట్రెండు శతాబ్దాల చరిత్రలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ గడ్డ మనుషుల సంపూర్ణ విముక్తి, వికాసానికి పదేళ్లు చిన్న సమయమే! దశాబ్దాలు సాగిన ప్రజాపోరు తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ రాష్ట్రం, సొంత సర్కార్ల పాలనలో సాధించిందెంత? సరైన బాటలోనే ఉన్నామా? అని సమీక్షించుకోవడానికి పదేళ్లు సరిపోయే సమయమే!

అభివృద్ధి-, సంక్షేమం జోడుగుర్రాల పరుగుతో దేశంలోనే రాష్ట్రాన్ని శీర్షాన నిలబెట్టామని పాలకులు జబ్బలు చరచుకుంటున్నారు. కన్న కలలు కల్లలై తెలంగాణ పోరాట యోధుల, అమర వీరుల తీరని ఆకాంక్షగానే మిగిలిపోయిందని మదనపడి పలువురు నిట్టూరుస్తున్నారు. విరుద్ధ భావనలిప్పుడు ప్రచారంలో ఉన్నాయి. ఇంతకీ జరిగిందేమిటి? అన్నది సమాధానం అంత సరళంగా లభించని, సంక్లిష్ట ప్రశ్న! విద్యుత్తు, మౌలిక వసతులు, కంపెనీలు-, పరిశ్రమలు, ఐటీ వంటి కీలక రంగాల్లో అభివృద్ధి సాధించి, రైతులు,-పేదలు, -వృద్ధులు, -మహిళలు... యోగ్య వర్గాలను కేంద్రకం చేసుకొని సంతృప్తికర సంక్షేమం అందిస్తూ తెలంగాణ ఓ కొత్త రాష్ట్రమైనా ప్రగతిపథంలో ఉందని చెబుతోంది. 

ప్రజల జీవన ప్రమాణాలు పెంచి తెలంగాణ పునర్నిర్మాణ దిశలో సాగుతున్నామనేది వారి వాదన. సామాజిక, ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లి, రైతుబంధు తప్ప వ్యవసాయం కునారిల్లి, విద్యా వైద్యం చతికిలబడి, ఆర్థిక వనరులు హరించుకుపోయి, అప్పుల పాలై తెలంగాణ ఆగమాగమైందని విపక్షాలు, ఇతర పౌరసమాజం విమర్శిస్తోంది. ఉద్యమానికి ఊపిరి పోసిన మూడు ముచ్చట్లు... నీళ్లు, నిధులు, నియామకాలు ఒట్టిపోయాయనేది వారి బాధ. భౌగోళిక తెలంగాణ ఏర్పడిందే తప్ప పదేళ్లవుతున్నా సామాజిక తెలంగాణ సాకారం కాలేదు. ప్రజాస్వామ్య వాతావరణం ఉక్కపోతలో నలుగుతోందనే ఆరోపణ బలంగా ఉంది. ఎన్నో ఆశలు కల్పించి అరకొర అమలుతో పాలకపక్షం పాస్‌‌ మార్కులతో గట్టెక్కితే, ప్రజలకొక బలమైన ప్రత్యామ్నాయం ఇస్తామనే నమ్మకం, విశ్వాసం కలిగించలేక విపక్షం విఫలమైంది.

ఫక్తు రాజకీయమే! (8/10 మార్కులు)

ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్​గా మారింది. రాష్ట్రం సాధించే క్రమంలో ఉద్యమ పార్టీ, తెలంగాణ సాధించాక తమది ఫక్తు రాజకీయపార్టీ అని బహిరంగంగా అంగీకరించే బీఆర్‌‌ఎస్‌‌ నాయకత్వం ప్రతి అడుగూ రాజకీయ యోచనతోనే వేస్తున్నది. నైతికమా, అనైతికమా? పక్కనపెడితే, ఎదుటి పార్టీలని బలహీనపరచడం, ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం.. వంటివి చేస్తూ రాజకీయంగా బాగా బలపడింది. కారు ఒకింత ‘మోయలేని బరువు’తోనే ఉందిపుడు. 

తన సహజ నాయకత్వ లక్షణాలకు తోడు వ్యూహ చతురత, మాటకారితనంతోనూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్​ రాష్ట్రంలో అప్రతిహతనేతగా ఎదిగారు. ఏ పార్టీలోనూ అతనికి సమానమే కాదు, దరిదాపులకు రాగల నాయకులు కూడా లేరు. దాదాపు అన్ని ప్రత్యర్థి పార్టీల్లోనూ ‘కోవర్టు’ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం బీఆర్‌‌ఎస్‌‌ అదనపు బలం. 2018లో సాగిందేమో కానీ, ఈ సారి అత్యధిక సిట్టింగ్‌‌లను మార్చకుండా గట్టెక్కే పరిస్థితి లేదు. రాజకీయంగా కాకపోయినా.. పాలనా పరంగా ప్రజాక్షేత్రంలో ఎదురీత వారికి తప్పట్లేదు. కాంగ్రెస్‌‌ను బలమైన ప్రత్యర్థిగా ఎదగనీయకుండా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఉపేక్షించేలా వ్యవహరించిన తీరు రాజకీయంగా పులిమీద స్వారీ అన్న  విమర్శలూ వచ్చాయి.

అభివృద్ధి అస్పష్ట పదం (7/10 మార్కులు)

తాగు, -సాగు నీరు, విద్యుత్తు విషయంలో గణనీయ ప్రగతి సాధించినట్టు ప్రభుత్వ లెక్కలున్నాయి. దక్కన్‌‌ పీఠభూమిపైనున్న తెలంగాణలో జీవనది గోదావరిని గరిష్టంగా వాడేందుకు కాళేశ్వరం వంటి ఎత్తిపోతల ప్రాజెక్టుతో చరిత్ర సృష్టించామనేది సర్కారు మాట! కానీ, ఒక్క వరదతో అది కుదేలై నిరుపయోగంగా కూర్చుంది. సాగునీటికి బదులు అవినీతి ఏరులై పారిందన్నది ఘాటైన విమర్శ. మిషన్‌‌ కాకతీయ, మిషన్‌‌ భగీరథ లక్ష్యం గొప్పదే అయినా... ఆచరణ చౌకబారుతనం వల్ల ఫలితాలు దక్కలేదన్న ఆరోపణ ఉంది. విద్యావైద్యం వంటి కీలక రంగాల్లో ప్రగతి లేకపోగా ఇంకా దెబ్బతీశారని, విస్తరణ, సరైన నిర్వహణ లేక పేదలు ప్రైవేటు వేటుకు బలికావాల్సి వస్తున్న పరిస్థితికి సర్కారు వద్ద సమాధానం లేదు. 

మౌలికరంగాభివృద్ధి వల్ల పెట్టుబడుల ఆకర్షణతో పెద్ద ఎత్తున కంపెనీలు, పరిశ్రమలు, ఐటీ సంస్థలు వచ్చాయన్నది ప్రభుత్వ కథనం. అదే నిజమైతే మరి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎందుకు పెరగలేదన్నది ప్రశ్న. వాదనలు, -వాస్తవాలు పొంతన లేనివిగా ఉండటంతో వీరి ‘అభివృద్ధి’ నమూనాయే సందేహాస్పదమని ప్రత్యర్థులు పేర్కొంటున్నారు. ‘అభివృద్ధి’ అన్న పదమే ఓ నిర్దిష్ట అర్థం లేని బ్రహ్మపదార్థమని, సర్కారు పేర్కొనే దాని అర్థం ఎవరి అభివృద్ధి? అనే ప్రశ్న జనక్షేత్రంలో తరచూ తలెత్తుతోంది. నియంతల కాలం నుంచి ప్రజాస్వామ్య పాలన వరకు ‘భూమి’ ప్రజల అశాంతికి కారణమౌతున్న దురదృష్టకర పరిస్థితి రోజు రోజుకూ పెచ్చుమీరుతోంది.

సంక్షేమమంతా క్షేమమా? (6/10 మార్కులు)

ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద పరోక్ష పద్ధతిలో పేదల ప్రయోజనాలు నెరవేరుస్తున్నా.. కొన్ని ప్రత్యక్ష మేళ్లతో సంక్షేమాన్ని అసాధారణ స్థాయిలో నిర్వహిస్తున్నట్టు చెబుతోంది. ఇందులో రైతుబంధు, పెన్షన్లు, దళిత బంధు, షాదీ ముబారక్‌‌, గొర్రెల పంపకం, కళ్యాణలక్ష్మీ, కేసీఆర్‌‌ కిట్‌‌ వంటివెన్నో ఉన్నాయి. ఇవేవీ, సామాజిక భద్రత- భరోసా కల్పించేంత గొప్పవి కావని, దళిత బంధులో అవినీతి ఏకంగా సీఎం దృష్టి నుంచీ జారిపోనంత బాహాటంగా జరగటాన్ని విమర్శకులు ఎత్తి చూపుతున్నారు. కౌలురైతును లెక్కే చేయకుండా, రైతుబంధు పెద్ద పెద్ద భూస్వాములకూ ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 

తమ ఉత్పత్తులకు మద్దతు ధరైనా ఇప్పించాలని, మార్కెట్‌‌ వ్యవస్థ కల్పించాలనీ రైతాంగం కోరుతున్నారు. డబుల్‌‌ బెడ్రూమ్‌‌ ఇళ్ల పథకం చాలా చోట్ల గగన కుసుమంలా మారింది. స్కాలర్‌‌షిప్‌‌లు, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ వంటివి తరచూ వివాదాస్పదమే! హాస్టళ్ల నిర్వహణ లోపభూయిష్టమే! ఏ ప్రయోజనాలూ అర్హులందరికీ అందకపోవడం, అందిన చోట ముడుపులు, పార్టీ కార్యకర్తలకే మేపడం వంటివి విమర్శలకు తావిస్తున్నాయి. సంక్షేమం అంత గొప్పగా ఉంటే పేదరిక నిర్మూలన ఎందుకు జరగటం లేదు? పేదలు మరింత పేదరికంలోకెందుకు జారుతున్నారని పుట్టే ప్రశ్న తెలంగాణ మౌలిక అస్తిత్వాన్నే పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శకు తావిస్తోంది.

ప్రజాస్వామ్య వాతావరణం నిల్లు (3/10 మార్కులు)

ఏ ఉద్యమాలు రాష్ట్ర ఏర్పాటుకు ముందు తనకు లాభించిందో వాటిపైనే బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం దెబ్బకొట్టిందనే అభిప్రాయం జనక్షేత్రంలో బలంగా ఉంది. ప్రశ్నించడాన్ని, ప్రజాస్వామ్యయుతంగా గొంతెత్తడాన్నీ తెలంగాణలో అడ్డుకుంటున్న తీరు ఆందోళనకరంగా ఉంది. సీఎం, మంత్రులు ఎక్కడ పర్యటనకు వెళ్లినా, ముందే అనుమానితుల్ని, ఆ పేరుతో సామాజిక కార్యకర్తల్ని, ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని నిర్బంధించడం మామూలైంది. ప్రభుత్వం ఏర్పడ్డ నెలల్లోనే... ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు ప్రక్రియను పోలీసులు అడ్డుకున్న నుంచి ఈ పంథా బలపడింది. పోలీసు వ్యవస్థను చట్టాలకు-, చట్టబద్ధ పాలనకు కాకుండా అధికారానికి తొత్తుగా మార్చారనే విమర్శ ఉంది.

 కులపరమైన వివక్ష, ఆధిపత్య పోరాటాలు అంతగా లేకపోయినా... ప్రజాసంఘాలు, పౌర సమాజ సంస్థలపై పరోక్షంగా గట్టి నిర్బంధమే ఉంది. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఏదో ఓ కులసానుకూల ముద్రలో నలుగుతున్నా, ఇక్కడ బీఆర్‌‌ఎస్‌‌కు అంత బలమైన కుల ముద్ర లేదు. ‘విభిన్న కులాల హరివిల్లు’ పేరే ఉన్నా... ఉద్యమకాలంలో త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు కాకుండా ఉద్యమాన్ని వ్యతిరేకించి, అణగదొక్కిన వారికే అందలాలు దక్కాయన్నది ఘాటైన విమర్శ.

జాతీయ ప్రత్యామ్నాయం ప్రయాసేనా? (2/10 మార్కులు)

75 ఏండ్ల స్వతంత్ర భారతం సాధించిందేమీ లేదని, విఫలమైన బీజేపీ, -కాంగ్రెస్‌‌ పార్టీలకు ప్రత్యామ్నాయం దేశ పాలనలోకి రావాలని ఆకాంక్షిస్తున్న బీఆర్‌‌ఎస్‌‌ జాతీయ తెరపైకి ఎగబాకుతోంది. ఆ దిశలో పెద్దగా ఆశావహ వాతావరణమేమీ ఇప్పటివరకు కనబడటం లేదు. కంటి ముందరి కర్నాటక ఎన్నికల్ని కాదని, ఎప్పుడో వచ్చే మహారాష్ట్రను విస్తరణకు ఎంచుకోవడంపై జనంలో సందేహాలున్నాయి. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన తరుణంలో టీఆర్ఎస్ నుంచి ‘తెలంగాణ’ మాటే పోయి బీఆర్‌‌ఎస్‌‌గా మారటం కొంత చర్చనీయాంశం అయింది. 

ఇది మనోభావాల పరమైన అంశమని, పేరు తొలగించుకోవడం ఆక్షేపణీయమని కొందరు వాదిస్తున్నారు. కాళేశ్వరం భారీ ప్రాజెక్టు, తళుకులీనే కొత్త సచివాలయం, నింగిని తాకే అంబేద్కర్‌‌ విగ్రహం, పెద్ద అమరవీరుల స్మారకం.. వంటివి నిర్మించి తెలంగాణ మనోభావాలకు మేమే సరైన ప్రతీక, పునర్నిర్మాణానికి ఇదే నిదర్శనం అని పాలకులు ఎంత చెప్పినా, జనక్షేత్రంలో ఇంకా సందేహాలున్నాయి. కాస్త ఎన్నద‌‌గిన‌‌ పాస్‌‌ మార్కులు (52/100) పాలకపక్షానికి వచ్చాయి. తాము నిత్యం ఆరోపించే వైఫల్యాల్ని ఎండగట్టడంలో, ఉద్యమాలు నిర్మించడంలో, జనహృదయాలు గెలిచి వారికొక విశ్వాసం కలిగించడంలో విఫలమైన విపక్షాలకు ఆ మాత్రమూ రాలే!

-  దిలీప్‌‌ రెడ్డి, పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌,  పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ,