బడినిట్ల బాగు చేయొచ్చు

బడినిట్ల బాగు చేయొచ్చు

ఏ సమాజంలోనైనా నాణ్యమైన, విలువలతో కూడిన విద్యనందిస్తే తప్ప ఆ సమాజం పూర్తి అభివృద్ధి జరగదు. ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాల విద్య నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విద్యను మరింత ధ్వంసం చేశారు. భారత ప్రభుత్వ నివేదిక(పీజీఐ) ప్రకారం.. విద్యా సామర్థ్యాలు అందించడంలో తెలంగాణ 36 రాష్ట్రాలకు గానూ 35వ స్థానంలో ఉంది. మన తర్వాత ఒక్క మేఘాలయ రాష్ట్రం మాత్రమే కిందన ఉన్నది. సీఎం కేసీఆర్​వనరుల పరంగా, అధికారం సమయం విద్యపై వెచ్చించలేదు. పేదలకు మంచి విద్యనందిస్తే పేదలు ప్రశ్నించే వారిగా తయారవుతారని, ధనవంతుల ఇండ్లల్లో, పరిశ్రమల్లో, వారి వ్యవసాయ భూముల్లో పని చేయడానికి అగ్గువ లేబరు దొరకరని ఆలోచించే ప్రభుత్వం బడులను, కాలేజీలను, విశ్వవిద్యాలయాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. పాఠశాల విద్యలో సరిపడా క్లాసురూమ్స్, బోర్డులు, టాయిలెట్స్, బల్లలు, లైబ్రరీలు, కంప్యూటర్లు, కరెంట్, టీచర్లు సహా ఏమీ లేవు. విద్యా బోధనలో నాణ్యత లేదు. ‘మనఊరు మనబడి పథకం’ వనరులు లేక, మానిటరింగ్ లేక మూలకుపడింది. ఎంఈవోలు, డీఈవోలు లేరు. రాష్ట్రంలో 6678 సింగిల్ టీచర్ బడులు అంటే ఈ బడుల్లో ఒక టీచర్ 5 తరగతులు చెప్పాలట. ఇంకో 7 వేల బడుల్లో 5 తరగతులకు ఒకటే గది ఉన్నది.

రాష్ట్రంలోని మొత్తం పిల్లల్లో 49 శాతం ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. అమెరికా, జర్మనీ లాంటి దేశాల్లో కూడా ఇప్పటికీ 90 శాతం పైగా పిల్లలు ప్రభుత్వ బడుల్లో(ఎయిడెడ్ బడులతో సహా) చదువుతుంటారు. అసలు ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థనే చాలా లోప భూయిష్టంగా ఉంది. ఒక ఎంఈవో 50 నుంచి 60 బడులను పర్యవేక్షణ చేయాలి. ఒక డీఈవో1000 బడులను సందర్శించాలి. ఇంటర్నేషనల్ స్కూళ్ల టీచర్ల కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ జీతాలు పొందుతున్న ప్రభుత్వ టీచర్లు ఉన్నా, ప్రభుత్వ పర్యవేక్షణ లేక, సరైన సౌలత్​లు, టీచర్లు లేక.. సర్కారు బడుల చదువులో నాణ్యత లోపించింది. 60 శాతం పైబడి పిల్లలు సీ గ్రేడ్​లో ఉంటున్నారు. అందుకే పేదలు అప్పుచేసి తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపిస్తున్నారు. 

కామన్ ​స్కూల్​ విధానం

దేశంలో కామన్ స్కూల్​ విధానం పెట్టాలని కొఠారి కమిషన్ ఒక గొప్ప సిఫారసు చేసింది. దీని ప్రకారం ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్న పేద, ధనిక పిల్లలు అందరూ ఒకటే బడిలో చదువుకోవాలి. ఇది పెడితే తెలంగాణ రాష్ట్రం, దేశం గొప్పగా అభివృద్ధి చెందుతాయి. యువతకు రెండు మూడు శతాబ్దాల తర్వాత రిజర్వేషన్ల అవసరం కూడా రాకపోవచ్చు. సీఎం మనుమడు చదువుకుంటున్న ఆక్రిడ్జ్ తోపాటు, కేంద్రీయ విద్యాలయాల లాంటి బడులు ప్రతి మండలంలో సగటున ఐదు కట్టాలి. అందులో ఎల్​కేజీ నుంచి పది వరకు తరగతులు ఉండాలి. ఇంగ్లీషు మీడియం ఉండాలి. 1 నుంచి12 వరకు తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేయాలి. మండల కేంద్రంలోని స్కూల్లో 11, 12 తరగతులు కూడా ఉండాలి. ఒక్క బడికి సుమారుగా 2000 నుంచి 2500 విద్యార్థులు ఉంటారు. 85 గదులు కావాల్సి ఉంటుంది. 65000 చదరపు అడుగుల భవన సముదాయంతో ఒక్కో స్కూలు భవనం కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న బడుల్లో ఎక్కువ స్థలం ఉన్న హైస్కూళ్లను ఈ కొత్త భవనాలు కట్టడానికి ఎంపిక చేసుకోవాలి.

ఒక్కో స్కూలుకు కనీసం 5 ఎకరాలు స్థలం ఉండాలి. సరిపడా భూమి లేకపోతే అదనపు భూమి ప్రభుత్వం కొనాలి. ముఖ్యభవన సముదాయం సహా వాటిల్లో అన్ని వసతులు సమకూర్చితే ఒక్కో స్కూలుకు రూ. 16 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే 600 మండలాలలో మండలానికి సగటున 5 బడులు కడితే రాష్ట్రంలో 3000 పెద్ద బడులు కట్టాల్సి ఉంటుంది. పాత స్కూళ్లను కూలగొట్టి కొత్తగా కడితే కూడా మొత్తం అంచనా రూ.50,000 కోట్ల వరకు ఉంటుంది. అంటే ఐదేండ్లలో ఏటా రూ.10,000 కోట్లు అదనంగా కేటాయిస్తే మనం కూడా అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మన విద్యా వ్యవస్థను నిర్మించుకోవచ్చు.

స్కూలుకు రవాణా సాధ్యమే

మండలానికి సగటున 40 ఆవాసాలు/గ్రామాలు ఉంటాయి. అంటే సగటున ఒక స్కూలుకు 8 గ్రామాలు/ఆవాసాలు వస్తాయి. ఒక మండలంలో సుమారుగా10 వేల మంది విద్యార్థులు ఉంటారు. మండలంలో 7000 మంది విద్యార్థులకు రవాణా సౌకర్యం అవసరం అవుతుంది. అంటే మండలానికి సుమారుగా 100 మినీ బస్సులు అవసరం అవుతాయి. ఒక్క మినీ బస్సు ధర రూ. 8 లక్షలు. దళితబందు / గిరిజన బంధు/బీసీ బంధు కింద స్థానిక యువతీ యువకులకు 80 శాతం సబ్సిడీ కింద మినీ బస్సులు కొనిస్తే 60,000 మందికి జీవనోపాధి దొరుకుతుంది. దీనికి అయ్యే ఖర్చు ప్రభుత్వానికి రూ. 4000 కోట్లు అవుతుంది. ఐదేండ్ల పథకంలో ఒక సంవత్సరానికి ప్రభుత్వానికి వన్ టైం ఖర్చు రూ. 800 కోట్లు అనుకోవచ్చు.

బస్సు యజమాని ఒక్కో విద్యార్థికి నెలకు 300 రూ. చార్జి చేస్తే అతనికి నెలకు 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట చేస్తే చాలు. మిగతా సమయంలో స్థానికులను వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడం ద్వారా కనీసం ఇంకో రూ.15000 నెలకు అదనపు ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు ఈ మాత్రం వారి పిల్లల మీద రవాణా ఖర్చు పెట్టుకోడానికి ముందుకు వస్తారు. దీని ద్వారా మంచి స్కూలు రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది.

సాఫ్ట్​వేర్​తో పర్యవేక్షణ

ఏ వ్యవస్థ అయినా, పథకమైనా విజయవంతం కావాలంటే మానిటరింగ్, రివ్యూ చాలా ముఖ్యం. దీనికి ఒక పటిష్టమైన సాఫ్ట్​వేర్, యాజమాన్య సమాచార నివేదికల అవసరం ఉంటుంది. దీన్ని ఒక మంచి సాఫ్ట్​వేర్ కంపెనీతో తయారు చేయించవచ్చు. దీనికి సంబంధించి విద్యాశాఖలో ఒక ఐదు మంది ఐటీ సిబ్బందితో ఒక టీంను కమిషనర్ (పాఠశాల విద్య) ఆఫీసులో ఏర్పాటు చేయాలి. సమగ్ర సమాచార వ్యవస్థతో సాఫ్ట్​వేర్ ​తయారు చేయాలి. దీని ద్వారా టీచర్ల హాజరు, తరగతి గదిలో జరిగే పాఠ్యాంశాల సమాచారం, బోధించే పద్ధతులు, పాఠాల ప్రణాళిక, ప్రగతి, విద్యార్థుల సమాచారం, ఆటల జట్లు, ఆటల ప్రగతి, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల సామర్థ్యాలు, మౌలిక సదుపాయాల అందుబాటు, విద్యార్థుల హాజరు, అన్ని రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సమీకరించుకొని సమీక్షలో భాగం చేయాలి. ఈ సమాచారం ఆధారంగా ప్రతి బడి పనితీరు మీద సాధించిన ప్రగతి మీద ర్యాంకింగ్స్ ఇవ్వాలి. బడుల ప్రగతిని బట్టి మండలాలకు జిల్లాలకు కూడా రాంకింగ్స్​ఇచ్చి కలెక్టర్లతో ప్రతివారం ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, అలాగే ప్రతి నెలలో ఒకసారి సమీక్షలు నిర్వహించి తక్కువ ప్రగతి సాధించిన బడులు, మండలాలు, జిల్లాలను గుర్తించి వారి సమస్యలను తెలుసుకొని తగిన పరిష్కారాలు చేయాలి.

ప్రతి 15 రోజులకొకసారి సీఎం రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించాలి. ప్రతి మూడు మండలాలకు ఒక బ్లాకు విద్యాధికారి, ప్రతి జిల్లాకు జిల్లా విద్యాధికారిని నియమించాలి. ప్రతి బ్లాక్ విద్యాధికారి నెలలో కనీసం ప్రతి స్కూలును ఒకసారైనా సందర్శించాలి. డీఈవో కనీసం 20 బడులు నెలలో సందర్శించాలి. వారి సందర్శనలో చూసిన విషయాలు సాఫ్ట్​వేర్​లో భాగమైన మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయాలి. 

సిలబస్, బోధనా పద్ధతులు

ఎల్​కేజీ నుంచే ఇంగ్లీషు మీడియంలో విద్యనందించడం విద్యార్థులకు చాలా అవసరం. ఇంగ్లీష్ భాష వృత్తి పరమైన కోర్సులు వైద్య, ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ, పరిశోధనలకు ఒక ప్రవేశ అర్హత. మన దేశంలో పూర్వం నుంచి విద్య మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మాతృభాషలో విద్య అభివృద్ధి12వ తరగతి దగ్గరే ఆగిపోయింది. అందుకే మనకు ఫ్రాన్స్ లాగా, జర్మనీ లాగా, స్పెయిన్ లాగా మాతృభాషలో పరిశోధన వరకు విద్య అభివృద్ధి జరగలేదు. ఉదాహరణకు విమానాల తయారీలో వారి డ్రాయింగులు, నిర్మాణ పద్ధతులు, రూపకల్పనలు అన్నీ కూడా ఫ్రెంచి భాషలోనే ఉంటాయి. ఇప్పటికిప్పుడు మన తెలుగుభాషను ఆ స్థాయికి తీసుకుపోవడం సాధ్యం కాదు, అవసరం లేదు. కాబట్టి మనం అభివృద్ధి చెందాలంటే మనకు ఇంగ్లీషు తప్పనిసరి. ఇంగ్లీషు మీడియం అంటున్నాం కాబట్టి మన తెలుగు అదృశ్యం అవుతుందనేది పిచ్చిమాటలు. 1వ తరగతి నుంచి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెడితే సరిపోతుంది. జపాన్​లో అమలు చేస్తున్నట్లు మన పిల్లలకు చిన్నప్పుడే పక్కవాళ్లతో ఎలా ఉండాలో, పెద్ద వాళ్లతో ఎలా మెలగాలో, మొక్కలను ఎలా పెంచాలో, మన ఇరుగు పొరుగును, స్నేహితులతో ఎలా మసలుకోవాలో, పక్కవాళ్లతో కరుణ, కర్టెసీ, కేరింగ్, గౌరవం, సానుభూతి, సమానత్వం, సౌభ్రాతృత్వం, బాధ్యతగా ఎలా ప్రవర్తించాలో, దేశ సమగ్రత, పని మీద శ్రద్ధ, క్రిటికల్ థింకింగ్​ మొదలైన విషయాల మీద పిల్లలకు చిన్నప్పుడే బోధించాలి. ప్రతి క్లాస్​రూమ్​లో ఒక పచ్చబోర్డుతో పాటు 75 ఇంచుల ఇంటరాక్టివ్ పానెల్ (టివి లాంటి పరికరాలు) డిజిటల్ కంటెంట్, ఇంటర్నెట్​తో పాటు ఉండాలి. వీటి ద్వారా బోధన చాలా మెరుగ్గా ఉండి, పిల్లలు విషయ పరిజ్ఞానం, కాన్సెప్టులు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. సుమారుగా 1,50,000 టీవీ పరికరాలు కావాల్సి వస్తాయి. వీటి ఖరీదు ఎక్కువ సంఖ్యలో కొంటే రూ. 1500 కోట్ల ఖర్చు వస్తుంది.  అంటే ఏటా బడ్జెట్​లో రూ.300 కోట్లు అవసరం పడుతుంది. 

ALSO READ :సమాజ గుర్తింపులో తండ్రి పాత్ర కీలకం: ప్రొఫెసర్ కోదండరాం 

ఉన్నత విద్య ఆగమాగం

కాలేజీల్లో, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, ప్రొఫెసర్ల ఖాళీల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. గత 9 ఏండ్లలో ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. రాష్ట్రంలో11 వర్సిటీల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్ల మంజూరు పోస్టులు 3,179 ఉంటే ప్రస్తుతం 818 ప్రొఫెసర్లు, లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. అంటే 74% ఖాళీలు ఉన్నాయి. వీటిని నింపకుండా.. వర్సిటీలను పూర్తిగా ధ్వంసం చేసిన బీఆర్ఎస్​ సర్కారు.. తమకు కావాల్సిన వాళ్లకు ప్రైవేటు వర్సిటీలు ఇస్తున్నది. 9000 మంది విద్యార్థులు చదువుకుంటున్న బాసర ట్రిపుల్​ ఐటీలో భయంకరమైన సమస్యలు ఉన్నాయి. సీఎం కేసీఆర్​కు రాజకీయాలు, ఓట్లు పడే పథకాల రచన మీద ఉండే ఆసక్తిలో ఒక్క శాతం కూడా సుస్థిర అభివృద్ధి మీద ఉన్నా విద్యను అభివృద్ధి చేసేవారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుదీ ఇదే తీరు. దేశంలో 11 లక్షల బడులు ఉంటే వచ్చే ఐదేండ్లలో పీఎంశ్రీ పథకంలో 14,400 (1%) బడులు మాత్రమే అభివృద్ధి చేస్తానంటున్నది.

టీచర్ల సామర్థ్యం

ప్రతి టీచర్​ ఏడాదికి ఒకసారి వారి సామర్థ్యాలకు సంబంధించి ఒక పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి టీచర్ ​ఈ పరీక్ష పాస్ కావాలి. విశ్వసనీయ సంస్థలు నిర్వహించే ఈ పరీక్షలో సామర్థ్యం ప్రకారం ప్రతి టీచర్​ను ఏ, బీ, సీ, డీ గ్రేడ్లుగా గుర్తించి పాఠశాల శాఖ వెబ్​సైటులో పెట్టాలి. దీని ప్రకారం ప్రతి టీచర్​ ఎప్పటికప్పుడు తన జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. టీచర్లకు, లెక్చరర్లకు ఏడాదికి రెండుసార్లు వారి సబ్జెక్టు విషయాల మీద శిక్షణలు ఇప్పించాలి. హెచ్ఎంలకు స్కూల్​ మేనేజ్​మెంట్ మీద, బోధనా పద్ధతుల మీద, విద్యార్థులను లీడర్స్ గా తయారు చేయడం మీద కావాల్సిన శిక్షణలకు ఐఐఎంల ద్వారా, అవసరమైతే విదేశాల్లో తగిన శిక్షణలు, సందర్శనలు ఇప్పించాలి. టీచర్ల గ్రేడ్లను బట్టి వారికి ఎలాంటి పనిష్మెంట్​ ఇవ్వరాదు. వారి సామర్థ్యం వారే పెంచుకునేటట్లు ప్రేరేపించాలి. ప్రస్తుతం మన టీచర్ విద్యార్థుల నిష్పత్తి 1:20గా ఉంది. ఈ కొత్త వ్యవస్థలో కొత్త టీచర్ల అవసరం ఉండకపోవచ్చు. అక్కడక్కడ వెయ్యి, వెయ్యిన్నర టీచర్ల అవసరం ఉండొచ్చు. ఎల్ కేజీ, యూకేజీ క్లాసులకు మాత్రం 20,600 కొత్త ప్రత్యేక నైపుణ్యం ఉన్న టీచర్ల అవసరం రావొచ్చు. ఆ స్థాయిలో నేర్చుకోవడం అనేది భవిష్యత్ విద్యకు, భాషా నైపుణ్యాలకు ఒక మంచి పునాది లాంటిది. ప్రస్తుతం దీన్ని ప్రభుత్వాలు పూర్తిగా పక్కకు పెట్టాయి. టీచర్లు ప్రాక్టికల్​గా, ఆచరణాత్మకంగా పిల్లలకు చెప్పేటట్లుగా శిక్షణలు, సమీక్షలు, పర్యవేక్షణలు ఉండాలి. కొత్త టీచర్లను నియమిస్తే ఐదేండ్లకు రూ. 630 కోట్ల ఖర్చు అవుతుంది. శిక్షణలకు రూ.100 కోట్లు ఖర్చు అవుతుంది. కొత్తగా పెట్టే 3000 కొత్త పెద్ద స్కూళ్లకు సగం మంది హెడ్ మాస్టర్లను టీఎస్​పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలి. మిగతా సగం మంది హెచ్ఎంలకు ప్రమోషన్ ద్వారా నింపవచ్చు. హెచ్ఎంలకు, టీచర్లకు మధ్య ఒక జవాబుదారీ తనం ఉండి, ఒక మంచి టీంలా పనిచేసే వ్యవస్థను ప్రవేశపెట్టాలి.

ఇంజనీరింగ్ ​విద్య

రాష్ట్రంలో 97 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 35 పీజీ సెంటర్లు, 17 ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర కాలేజీలు 50, ఇంకా 13 యూనివర్సిటీలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రతి జిల్లాకు కనీసం ఒక పూర్తిస్థాయి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ కోర్సుల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కారణాన ఇంకో 30 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలి. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు మార్కెట్లో అవసరమైన సాఫ్ట్​వేర్ శిక్షణలు, ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేందుకు కావాల్సిన శిక్షణలు ఇప్పించాలి. వీటిలో సుమారుగా 126 డిగ్రీ కాలేజీలకు రూ.1008 కోట్లు, పీజీ సెంటర్లకు రూ.380 కోట్లు, పాత ఇంజనీరింగ్​ కాలేజీలకు రూ.340 కోట్లు, కొత్త ఇంజనీరింగ్​కాలేజీలకు రూ.1800 కోట్లు, వర్సిటీలకు రూ.650 కోట్లు మొత్తంగా రూ. 4178 కోట్లు అవసరం పడతాయి. ఇవిగాక పైన పేర్కొన్న కొత్త బడుల నిర్మాణం, సౌలతుల కల్పన, సిబ్బంది నియామకం, సాఫ్ట్​వేర్​ వ్యవస్థ, విద్యార్థుల రవాణా ఇలా అన్ని కలిపి సుమారుగా రూ.60,865 కోట్ల వరకు అవుతుంది. ఐదేండ్లలో ఒక్కో ఏడాదికి రూ.12,173 కోట్ల ఖర్చు వస్తుంది. అంటే ఏడాది బడ్జెట్​లో అదనంగా కేటాయించాల్సిన నిధుల శాతం 4.15%  మాత్రమే. ఇప్పటికే ఉన్న 6.4% కు అదనంగా 4.15% అంటే మొత్తం11 శాతం బడ్జెట్(మొత్తం బడ్జెట్ లో) కేటాయించడం పెద్ద సమస్యేమీ కాదు. ఇది కొఠారి కమిషన్ సూచించిన 20 శాతం కంటే కూడా చాలా తక్కువ. రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని చదివి చర్చించుకొని, దీన్ని వారి పార్టీ మానిఫెస్టోలో పెట్టాలని కోరుకుంటున్నాం. ఈ విధానం అమలు చేసే వరకు పోరాడుతాం.

బడ్జెట్​ కేటాయింపులు

పశ్చిమ దేశాలు తీసుకున్నట్లుగా తెలంగాణలో కూడ పిల్లల బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలి. పేద, ధనిక తేడా లేకుండా అందరు పిల్లలకు సమానంగా నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విద్యకు (పాఠశాల విద్య, కాలేజీ విద్య, యూనివర్సిటీ విద్యకు) రూ. 2,93,000 కోట్ల బడ్జెట్ లో రూ.18,955 కోట్లు అంటే 6.4 శాతం మాత్రమే కేటాయించింది. ఇందులో అత్యధిక శాతం టీచర్ల, లెక్చరర్లు, ప్రొఫెసర్లు జీతాలకే పోతాయి. జాతీయ సగటు మిగతా రాష్ట్రాలు విద్యమీద పెట్టిన బడ్జెట్ శాతం తీసుకుంటే అది సుమారుగా 15 % ఉంది. కొఠారి కమిషన్1960లలోనే ప్రతి ప్రభుత్వం 20 శాతం బడ్జెట్​ను విద్యకు కేటాయించాలని సూచించింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా విద్యకు 2.5% మాత్రమే బడ్జెట్లో కేటాయిస్తూ.. ప్రభుత్వ విద్యను ప్రాధాన్యత లేని రంగంగా పరిగణిస్తున్నది.

- సోషల్ డెమొక్రాటిక్ ఫోరమ్,
 హైదరాబాద్