హనుమకొండ, వెలుగు: విద్యుత్ సంస్థలకు వేల కోట్లు బకాయిలు ఉన్న ప్రభుత్వాన్ని వదిలేసి నిరుపేదలపై భారం మోపడం ఎంతవరకు కరెక్ట్ అని వినియోగదారులు టీఎస్ఈఆర్సీ కమిషన్ఎదుట ఎన్పీడీసీఎల్ఆఫీసర్లను ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు సంస్థలకు రూ.21 వేల కోట్లు బకాయి పడినా పట్టించుకోకుండా.. మొండి బకాయిలు పేరుకుపోయాయని అదనపు చార్జీలు బాదడమేంటని నిలదీశారు. అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్(ఏసీడీ) చార్జీలు బాదుతూ బిల్లులు కట్టకుంటే రికవరీ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారని, అలాంటప్పుడు వేల కోట్ల బకాయి ఉన్న ప్రభుత్వం నుంచి ఎంత డిపాజిట్ పెట్టుకున్నారని ప్రశ్నించారు. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2023-–24 ఆర్థిక సంవత్సరానికిగానూ ప్రతిపాదించిన వార్షిక ఆదాయం, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ చార్జీలు, ఇతర విద్యుత్ సమస్యలపై హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం బహిరంగ విచారణ నిర్వహించారు.
టీఎస్ ఎన్పీడీఎసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి 53 మంది ఆబ్జెక్టర్స్, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, రైతులు ఈ పబ్లిక్ హియరింగ్‌కు హాజరుకాగా.. ఈఆర్సీ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు, టెక్నికల్ మెంబర్ ఎండీ మనోహర్‌రాజు, ఫైనాన్స్ మెంబర్ బండారు కృష్ణయ్య విచారణ జరిపారు. ముందుగా సీఎండీ అన్నమనేని గోపాలరావు 2022–-23 ఆర్థిక సంవత్సర ధరలను ఎలాంటి మార్పులు లేకుండా 2023–-24 సంవత్సరానికీ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 80 శాతం విద్యుత్ ప్రమాదాలు రైతుల అవగాహన లోపం వల్ల, మరో 20 శాతం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతున్నాయన్నారు. అనంతరం ఎన్పీడీసీఎల్పరిధిలోని కరెంట్ కనెక్షన్లు, రిటైల్సప్లయ్కి సంబంధించిన వివరాలను వెల్లడించారు. విద్యుత్ చార్జీలు, క్షేత్రస్థాయిలో సమస్యలు, వ్యవసాయానికి కరెంట్ సప్లయ్, అధికారులపై తీరుపై వివిధ రైతు సంఘాల నేతలు, వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కోతలతో పంటలు ఎండుతున్నయ్
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి.. కరెంట్ కోతలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు రైతులు ఈఆర్సీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ కోతలతోపాటు ట్రాన్స్ఫార్మర్లు పనిచేయక పంటలు ఎండుతున్నాయని కొంతమంది ఆబ్జెక్టర్స్ఈఆర్సీ దృష్టికి తీసుకొచ్చారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే కంపెనీలే రిపేర్లు చేయించాలి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదన్నారు. రిపేర్ల భారం రైతుల మీద మోపడమే కాకుండా.. కూలి ఇస్తామని చెప్పి వారినే రిపేరింగ్ కు తీసుకెళ్లాలని చెబుతున్నారన్నారు. ఆఫీసర్లు చేయాల్సిన పనులు రైతులతో చేయిస్తరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు చనిపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రాము మండిపడ్డారు. విద్యుత్ ప్రమాదాల్లో చనిపోయిన వారికి పైసా పరిహారం కూడా అందించడం లేదన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో కంపెనీ తప్పిదాల వల్ల నిరుడు ఇద్దరు రైతులు చనిపోయారని, వారి కుటుంబాలను ఈఆర్సీ, కంపెనీ పెద్దలెవరూ పరామర్శించలేదన్నారు. పైసా సాయం కూడా చేయలేదన్నారు. ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు స్పందిస్తూ కామారెడ్డి మీటింగ్ లో బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడామన్నారు. టీఎస్ ఎన్పీడీసీఎల్కు కూడా తగిన సూచనలిచ్చామన్నారు.
ఏసీడీని వెనక్కి తీసుకోవాలి
గతంలో ఏ ప్రభుత్వంలో చేయని రీతిలో బీఆర్ఎస్ సర్కారు ఏసీడీ పేరున వినియోగదారుడిపై భారం మోపుతోందని బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల కిరణ్ అన్నారు. వేల కోట్ల కాళేశ్వరం కరెంట్ బిల్లులు వసూలు చేయకుండా ప్రజల నుంచి ఏసీడీ చార్జీలు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సామాన్యులు బిల్లులు కట్టకపోతే కనెక్షన్లు తీసేసి, బలవంతంగా వసూలు చేసే సంస్థలు.. ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్ ప్రతినిధి పుల్లూరు సుధాకర్ మాట్లాడుతూ ఏసీడీ చార్జీలను కరెంట్ కనెక్షన్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు తిరిగి ఇస్తామంటున్నారని, అసలు ప్రజలు విద్యుత్ కనెక్షన్ తొలగించుకునే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం బాకీ ఉన్న 21 వేల కోట్లు ఎందుకు వసూలు చేయడం లేదన్నారు. పేదలపై భారం పడకుండా భవిష్యత్తు లో కరెంట్ బిల్లులు పెరగకుండా యాక్షన్ తీసుకోవాలని కోరారు. కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాపై ఆఫీసర్లు ప్రజలకు తగిన అవగాహన కల్పించలేకపోతున్నారన్నారు. సమావేశంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు బి.వేంకటేశ్వరరావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, వి.తిరుపతిరెడ్డి, సీజీఎంలు, ఎస్ఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కరెంట్ చావుల్లో తెలంగాణ నంబర్ వన్
80 శాతం విద్యుత్ ప్రమాదాలు రైతుల అవగాహన లోపం వల్లే జరుగుతున్నాయంటున్నారు. మరి రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరిది. లైన్మెన్లు టైమ్‌కి వస్తే.. రైతులు కరెంట్‌పనులు ఎందుకు చేస్తరు? తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సరఫరాలోనే కాదు.. విద్యుత్ ప్రమాద చావుల్లో కూడా నంబర్‌వన్‌గానే ఉంది. కామారెడ్డిలో ఇద్దరు రైతులవి ఎన్పీడీసీఎల్ హత్యలే. ఆ రెండు కుటుంబాలను ఆదుకున్న నాథులే లేరు. కంపెనీ సీఎస్సార్ కిందైనా సాయం చేయొచ్చు కదా. అన్నదాతల కుటుంబాలను పట్టించుకోకపోవడం సరికాదు.
– ముదుగంటి శ్రీధర్‌రెడ్డి, భారతీయ కిసాన్సంఘ్రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఈఆర్సీ సిఫారసు మేరకే ఏసీడీ
ఏసీడీ అనేది ఎన్పీడీసీఎల్ పెట్టిన చార్జి కాదు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 7 లక్షలకు పైగా కనెక్షన్ల నుంచి రూ.305 కోట్ల వరకు బకాయిలు పెండింగ్ఉన్నాయి. దీంతో విద్యుత్ సంస్థలపై భారం పడుతోంది. ఈఆర్సీ సిఫారసుల మేరకే ఏసీడీ చార్జీలు విధిస్తున్నారు. దీనివల్ల డిస్కంలపై భారం పడకుండా ఉంటుంది. అంతేగానీ ప్రభుత్వం బకాయిలు పూరించుకోవడానికి విధిస్తున్న భారం మాత్రం కాదు. ఏసీడీ వసూలుకు ముందు ఎన్పీడీసీఎల్ నోటీస్ ఇవ్వాల్సి ఉండగా ఆ రూల్పాటించలేదు. ఈ మేరకు సంస్థకు తగిన సూచనలు ఇచ్చాం.
– శ్రీరంగారావు, ఈఆర్సీ చైర్మన్