పౌర సమాజం చైతన్యంతోనే..ప్రజా తెలంగాణ సాధ్యం

మన తెలంగాణ సమాజానిది ఆత్మ గౌరవ స్వభావం. కనీసం వెయ్యేండ్ల చరిత్రను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. ఇక్కడి ప్రజలు కష్టపడి పనిచేస్తారు. శ్రమనే నమ్ముకొని జీవిస్తారు. ఆకాశం వంక చూసి వర్షం కావాలని కోరుకుంటారు. భూదేవి వైపు చూసి పంటను ఇమ్మని ప్రార్థిస్తారు. కష్టపడి సంపదను సృష్టిస్తారు. ఎదుటి మనిషికి సాయం చేయటం, వారి విముక్తి కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికి సిద్ధపడటం తెలంగాణ ప్రజలకు పుట్టుకతో వస్తుంది. 

అయితే కొందరు స్వార్థపరులు, దోపిడీకి అలవాటుపడిన దొంగలు, ప్రజలను మోసం చేసే అవినీతిపరులూ ఉంటారు. వీళ్ల శాతం కేవలం ఒకటి నుంచి ఐదు వరకు మాత్రమే ఉంటుంది. ఈ దోపిడీదారుల నుంచి, అవినీతిపరుల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ భూమి పుత్రులదే. 

కా కతీయ రాజైన ప్రతాపరుద్రుడిపై సమ్మక్క, సారక్క బరిగీసి పోరాడారు, నిలబడ్డారు. యుద్ధంలో తమ రక్తం చివరి బొట్టువరకు చిందించి పోరాడారే గానీ పారిపోలేదు. ఆదివాసీ ఆత్మ గౌరవాన్ని సమున్నతంగా చాటి చెప్పారు. భక్త కవి పోతన రాజును ధిక్కరించి తన కవిత్వాన్ని ప్రజలకు అంకితం చేశాడు. సర్వాయి పాపన్న గోల్కొండ రాజ్యానికి సవాలు విసిరి సొంత ఆస్తిత్వాన్ని కాపాడుకున్నాడు. 

ఉన్నోన్ని కొట్టి.. లేనోడికి పంచిపెట్టిన పండుగ సాయన్న ఈ నేల మీదనే సంచరించాడు. ఆధునిక కాలంలో భారతదేశం ఎలా వ్యక్తం కావాలో నేర్పిన చరిత్ర కూడా తెలంగాణకే ఉంది. నాజీలను మించిన నైజాంకు వ్యతిరేకంగా ఆయుధం ఎత్తిన తెలంగాణ భారతదేశంలోనే సాయుధ పోరాటానికి సాలు పోసింది. కాలికింది మట్టి కంట్లో ఎగసి పడినట్లు నీ బాంచెన్ దొర కాల్మొక్తా అన్న వాళ్లే దొరల గడీలను కూలగొట్టారు. “ముసలినక్కకు రాజరికంబు దక్కునే”, రైతుదే తెలంగాణంబు అంటూ రైతాంగ పోరాటాన్ని నడిపారు.  ఏ ప్రజా పోరాటానికైనా తెలంగాణ ఆదర్శంగా నిలబడింది.

గత పోరాట స్ఫూర్తితో..

తెలంగాణ నేలను ఆంధ్రాపాలకులు ఆక్రమించారని, ఇక్కడి నీళ్లు, నిధులు, సంపద, భూమిని ఆంధ్రా పెత్తందారులు స్వాధీనం చేసుకున్నారని, 60 ఏండ్లు తెలంగాణను ఆగం చేశారని, భాషను ఎక్కిరించారని, బతుకు మీద చితిపేర్చారని, పదవులు ఆంధ్రా వాళ్లే అనుభవించారని, తెలంగాణ ప్రజలను దిగువ స్థాయికి నెట్టివేశారని, ఉద్యోగాలు కొల్లగొట్టారని, చదువులను ఆగం చేశారని, తెలంగాణ భాషను హీనంగా చూశారని, ఇలా తన అస్తిత్వాన్నే కోల్పోయే క్రమంలో తెలంగాణ నేల కన్నెర్ర చేసింది. కథనాన దూకింది.

1969లో ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా రోడ్డు మీద దండోరా వేసింది. వందలాది మంది యువత తమ నెత్తురు ధారపోసి ఆంధ్రా పాలకులలో వణుకును పుట్టించారు. తిరిగి1996లో మలి దశ తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్నది. తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్, తెలంగాణ స్టడీ ఫోరం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ జాక్, తెలంగాణ విద్యార్థి జాక్.. ఇలా అనేక సంస్థలు, వ్యక్తులు, శక్తులు, పార్టీలు చేసిన పోరాట ఫలితంగా, సుమారు12 వందల మంది తెలంగాణ యువత బలిదానం వల్ల 2014 , జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది. దేశ చరిత్రలో తెలంగాణ శకం మొదలైంది. ఇది మన ఉజ్వల గతం.

 తాతలు, తండ్రులు, మనం కలిసి నిర్మాణం చేసుకున్న గొప్ప చరిత్ర కలిగిన మన తెలంగాణకు వారసులం మనమే.  అయితే మునుపటి చరిత్ర గొప్పతనాన్ని తలుచుకుంటూ కలల ప్రపంచంలో జీవిస్తే చివరకు మిగిలేది శూన్యమే. ఆత్మ గౌరవం అనే నినాదంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కనీసం ప్రజాస్వామిక హక్కులు కూడా అభివృద్ధి లేని స్థితి దాపురించింది. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక వయసు మీదపడి, బతుకు భారమై జీవిస్తున్నారు. తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఘనీభవించి కొందరి చేతుల్లో అభివృద్ధి బందీ అయింది. మానవత్వం, ఆత్మ గౌరవం మాయమైపోయాయి. మహిళా సంక్షేమమూ మచ్చుకైనా కనిపించదు.

ఉపాధి ఎరుగని నిరుద్యోగ యువత

తెలంగాణలో 40 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేసిన నిరుద్యోగులకు తెలంగాణ ఏమిచ్చింది అనే ప్రశ్న మనముందు ఉన్నది. తెలంగాణ వస్తే ఆంధ్ర పాలకుల కాలంలో మూతబడిన పరిశ్రమలను తిరిగి ప్రారంభిస్తామని ఉద్యమకాలంలో యువతకు హామీ ఇచ్చారు. హెచ్ఎంటీ, ఆల్విన్, బీడీఎల్, బోధన్ చక్కెర కర్మాగారం, ఆజాంజాహీ బట్టల మిల్లు ఇలా ఎన్నో పరిశ్రమలను ఆంధ్రా పాలకులు మూసివేశారు

. ఫలితంగా లక్షలాది ఉద్యోగాలు పోయాయి. తెలంగాణ ప్రభుత్వం మూతపడిన పరిశ్రమలను తిరిగి ప్రారంభించలేదు, కొత్తవి నెలకొల్పలేదు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే నియమించిన బిశ్వాల్ కమిటీ తెలంగాణలో  లక్షా 92 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. అనధికారికంగా మరో లక్ష పోస్టులు ఖాళీగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 50% లోపు మాత్రమే ఉద్యోగాలను కల్పించింది. యువత ప్రతిభ, శక్తి సామర్థ్యాలు అభివృద్ధికి దోహదపడటం లేదు.

చిన్న రోగమొచ్చినా ప్రైవేట్ దవాఖానకే

“ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్’’ అని గురజాడ అన్నారు. ఏ సమాజంలో నైనా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజ స్థాయి ఉన్నతంగా ఉందని భావిస్తాం. తెలంగాణలో ఏ చిన్న రోగమొచ్చినా రోగులు ప్రైవేట్ దవాఖానకు పోవాల్సిందే. డబ్బులు లేని పేదలు వైద్యం చేయించుకోలేక కాటికి చేరాల్సిందే. ప్రభుత్వ హాస్పిటల్స్​లో మందులు లేవు, డాక్టర్లు లేరు, నర్సులు లేరు, సరైన వసతులు లేవు, పట్టించుకునే నాథుడే లేడు. పేదలకు రోగమొస్తే చావు కోసం ఎదురు చూసే పరిస్థితి తెలంగాణలో ఉంది. 

వందేండ్ల కిందట నిర్మించిన ఉస్మానియా హాస్పిటల్, ముప్పై ఏండ్ల కిందట నిర్మించిన గాంధీ దవాఖాన, ఎప్పుడో నిర్మించిన నిమ్స్ కనీస సౌకర్యాలు లేక, రోగుల తాకిడికి తట్టుకోలేక సతమతమవుతున్నాయి. జనాభాకు అనుగుణంగా ఆసుపత్రులను పెంచలేదు. పేదలకు ఉచిత వైద్యం అందటం లేదు. పేదలందరికీ హక్కుగా వైద్యం  అందాలనే లక్ష్యం తెలంగాణ ప్రజలకు  ఉండాలి.

యువతను తాగుబోతులుగా మారుస్తూ..

చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలను మరింత చైతన్యవంతులుగా, సంస్కారవంతులుగా మార్చి తెలంగాణ సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సమాజపు చైతన్యం తిరోగమన దిశలో ప్రయాణిస్తున్నది. ప్రభుత్వమే పనిగట్టుకొని ప్రజల క్రియాశీలతను నీరుగార్చుతున్నది. ఎన్నడూ లేనంతగా తెలంగాణ యువతను తాగుబోతులుగా మార్చుతున్న ఖ్యాతి ఈ ప్రభుత్వానిదే. 

ప్రభుత్వ విధానాల మీద నిర్మాణాత్మకమైన విమర్శ పెట్టి, ప్రజల అభివృద్ధిలో భాగం కావాల్సిన యువత మత్తులో ఊగుతోంది. 30 ఏండ్లలోపే తాగుడుకు బానిసలై యువత మరణిస్తున్నారు. ఎక్కువ మంది తాగుబోతులున్న, చిన్న వయసులోనే మరణం పాలవుతున్న యువకులున్న, విధవలు అధిక సంఖ్యలో ఉన్న తెలంగాణ అభివృద్ధిలో ముందు ఉందని సూచికలు చెబుతున్నాయంటే మనం సిగ్గుపడాలి.

ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి

ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కుల, మత, ప్రాంత, లింగ, రంగు, భాష భేదం లేకుండా అందరికీ సమానంగా ఓటు హక్కు లభించింది. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అనేది ఆత్మ వంటిది. ప్రభుత్వాలు ఓటు ద్వారానే నిర్మాణమవుతున్నాయి. ఓటు లేకపోతే ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మనుగడే లేదు. అలాంటి ఓటును తెలంగాణ రాష్ట్రంలో డబ్బు ప్రభావితం చేస్తుంది. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి కనీసం వంద కోట్లు ఖర్చు చేస్తున్నారంటే డబ్బు ప్రభావం ఎన్నికల్లో ఎంతగా పెరిగిపోయిందో అంచనా వేయవచ్చు. 

పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఓటును కొనటం, అమ్మటం అంటే రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని అర్థం. ప్రజలకు, నాయకులను ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారు. ప్రజల సమస్యలను రాజకీయ నాయకులు పట్టించుకోకపోయినా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేకుండా చేస్తున్నారు. కార్పొరేట్ రాజకీయాలను తెలంగాణ సమాజానికి మెల్లగా అలవాటు చేస్తున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలను ప్రధాన  స్రవంతికి రాజకీయాలకు దూరం చేసి, కోట్లు వెదజల్లే వారే చట్ట సభల్లోకి వెళ్లే మార్గాన్ని రూపొందించుకుంటున్నారు. 

ఇక చట్ట సభల్లో కార్పొరేట్ల  ప్రయోజనాల గురించి చర్చ జరుగుతుందే తప్ప ప్రజల సమస్యల గురించి కాదు. ఓటు వేయకుండా అసమ్మతిని ప్రకటించే హక్కు ప్రతి పౌరుడికి ఉండాలి. తెలంగాణలో పౌర ప్రజాస్వామిక హక్కులు ఏ పరిమితులు లేకుండా అమలయ్యే రూపాన్ని ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నం.

పొలాలకు నీళ్లిస్తేనే సరిపోదు

తెలంగాణలో కొంతమేరకు, కొన్ని ప్రాంతాలకు నీళ్లు వచ్చాయి. కానీ, కాల్వల కింద భూములు మాత్రం పేదలకు లేవు. ఆరుగాలం రైతులు కష్టపడి పంట పండిస్తే అతివృష్టి, అనావృష్టితో పంటలు పోతున్నాయి. ప్రకృతి సవాళ్లను ఎదుర్కొని రైతులు పంటను పండిస్తే మద్దతు ధర లేక నష్టపోతున్నారు. తాము పండించిన పంటమీద తమకే హక్కు ఉండటం లేదు. మధ్య దళారులు రైతు పంటకు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతుకు “కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి” వలె ఉంది. 

ఎరువులు, విత్తనాలు, పురుగుల మందు ధరలు ఎన్నో రెట్లు పెరిగాయి. వ్యవసాయ పనిముట్లు, కూలీ రేట్లు అధికంగా పెరిగాయి. ఒక రైతు ఎకరం పొలంలో పంట పండించాలంటే రాబడికంటే పెట్టుబడి ఖర్చే ఎక్కువ అవుతుంది. కానీ ప్రభుత్వం రైతుబంధు పేరిట ఎకరానికి ఇస్తున్నది 5 వేల రూపాయలు మాత్రమే. పెట్టుబడిని నామమాత్రంగా ఇవ్వడం కాకుండా వ్యవసాయ ఉపకరణాలు, ఎరువులు, విత్తనాలను ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేసి వ్యవసాయ కూలీలకు అయ్యే ఖర్చులను నగదు రూపేణా ఇవ్వాలి. పంట చేతికి వచ్చాక ప్రభుత్వమే మద్దతు ధరను కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.

నాణ్యమైన విద్యకు దూరంగానే పేదలు 

ఒక రాష్ట్ర అభివృద్ధి అంటే ఆ ప్రాంత సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి సంస్కారం విద్యారంగం మీద ఆధారపడి ఉంటుంది. పేదలు ఇంకా నాణ్యమైన విద్యను అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వం విద్యను వ్యాపారంగా కాకుండా తన బాధ్యతగా చేపట్టాలి. కానీ తెలంగాణలో వేలాది బడులు మూతపడుతున్నాయి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయటం లేదు. 

ప్రభుత్వ బడుల్లో కనీస సౌలత్​లు కల్పించడం లేదు. ఉన్నత విద్యను పట్టించుకున్న పాపాన పోలేదు. నాణ్యమైన బోధన లేక ఉన్నత విద్య పడకేసింది. యూనివర్సిటీలకు ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్​ను నిలిపి వేసింది. ఆర్భాటంగా ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత విద్య నినాదాలకే పరిమితమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గురుకుల వ్యవస్థకు చేర్పుగా కొన్ని కాలేజీలను, స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. కానీ, వాటికి శాశ్వత భవనాలు నిర్మించలేదు. నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్న వార్తలను పత్రికల్లో పతాక శీర్షికలుగా చూస్తున్నాం.

- చింతకింది కాశీం, ప్రొఫెసర్, ఓయూ