పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
లాస్ ఏంజెల్స్ లో తెలంగాణ టూరిజం రోడ్ షో
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనతో ముందుకెళ్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ఱారావు తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు వారసత్వాన్ని కాపాడుకునేందుకు నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటకులను ఆకర్శించడం, పర్యాటకుల, ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా తెలంగాణను ఆవిష్కరించడంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి లాస్ ఏంజెల్స్ లోని డబుల్ ట్రీ హోటల్‌లో నిర్వహించిన తెలంగాణ టూరిజం రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంప్రదాయం, ఆధునికత రెండింటి కలబోత తెలంగాణ అని అభివర్ణించారు.
తెలంగాణలో కొత్త ప్రదేశాలను చుట్టేసి, కొత్త అనుభూతులు పోగేసుకోవాలని అంతర్జాతీయ పర్యాటకులకు రాష్ట్రానికి ఆహ్వానం పలికారు. పర్యాటకంతో పాటు తెలంగాణలో పెరుగుతున్న పెట్టుబడుల అవకాశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ సిటీ దేశంలో మినీ ఇండియాగా ప్రసిద్ధి పొందిందని, ప్రపంచ స్థాయి పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఎదిగిందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఐటీ, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో అద్భుతమైన పెట్టుబడులు కల్పించుకోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడిదారుల ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.