విప్లవోద్యమ గడ్డ తెలంగాణ

విప్లవోద్యమ గడ్డ తెలంగాణ

 

తెలంగాణ బుద్ధభూమి మాత్రమే కాదు యుద్ధభూమి కూడా. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి 70 ఏండ్లలో తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగాయి. విప్లవోద్యమాలూ జరిగాయి.  తెలంగాణ సాయుధ పోరాటం, మొదటి విడత తెలంగాణ రాష్ట్ర పోరాటం, భూమికోసం, భుక్తికోసం జరిగిన విప్లవోద్యమం, మలివిడత తెలంగాణ రాష్ట్ర పోరాటం లాంటివన్నీ తెలంగాణ నుంచే జరిగాయి. అందుకే తెలంగాణను పోరాటాల గడ్డగా పేర్కొంటారు. అంబేద్కర్‌‌ చైతన్యంతో జరిగిన ఉద్యమాలు, కులచైతన్య , అస్తిత్వ పోరాటాలు లాంటివెన్నో ఈ నేలపై జరిగాయి.

అనేక పోరాటాలు నుంచి సామాజిక పార్టీలు, బీఎస్పీ లాంటి దళితపార్టీలు కూడా ఆవిర్భవించాయి. 2001లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో  తెలంగాణలో విప్లవ చైతన్యం, దళిత చైతన్యం, బహుజన చైతన్యం, కులోద్యమాల చైతన్యం అన్నీ మూలకుపడ్డాయి.  ముందయితే తెలంగాణ రాష్ట్రం రావాలని మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, ఆలోచనాపరులతో పాటు సామాన్య ప్రజలనందరినీ కేసీఆర్ నమ్మించాడు. తెలంగాణలోని ప్రతి వ్యక్తి, రాజకీయ పార్టీ బహుజన ఆలోచనాపరులు కూడా తమదృష్టిని తెలంగాణ రాష్ట్ర సాధనకు తమను తాము అర్పించుకున్నారు.   కోట్లమంది తెలంగాణ ప్రజల పోరాటాల ఫలంగా 1500 మంది విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

ఎవరి బతుకులూ బాగుపడలేదు

తెలంగాణ ఏర్పడ్డాక ఎవరి బతుకులూ బాగుపడలేదు. కేసీఆర్​ఎన్నికల వాగ్దానాల్లో చెప్పినట్లు దళితుడు ముఖ్యమంత్రి కాలేదు. దళితులకు మూడెకరాల భూమి రాలేదు. ఏ చిన్నరైతు బతుకులోనూ మార్పురాలేదు. వలస పాలకులను మించి తెలంగాణలో దోపిడీ జరిగింది.  కొద్దిమంది ధిక్కార స్వరం వినిపించినా అదిలించి, బెదిరించి వారి నోళ్లు మూయించారు.  కేసీఆర్​ పదేండ్ల పాలనలో తెలంగాణ విధ్వంసం, అవినీతిమయమైంది. డ్రగ్స్, బెల్టుషాపులకు నిలయమై  ఏడులక్షల  కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది.  కొన్ని కుటుంబాలవారు మాత్రం అపర కుబేరులయ్యారు. తత్ఫలితంగా 2023 ఎన్నికల్లో  బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది.  తెలంగాణ సామాజిక, రాజకీయ ముఖచిత్రం దళితులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఎందుకంటే దళితులే ఈ దేశంలోని అత్యంత పీడితులు. సామాజిక అంతరాలకు గురవుతున్నవారు. తరతరాలుగా వివక్షకు గురవుతున్నారు. అందుకే  పోరాడితే పోయేదేం లేదు.. బానిససంకెళ్లు తప్ప అనే ధైర్యం, సాహసంతో దళితులు తెగింపును అలవాటు చేసుకున్నారు.

సమర్థించుకోవడం ఆత్మవంచనే

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తమను తాము నేతలు సమర్థించుకోవడం ఆత్మవంచనే అవుతుంది. బీఆర్ఎస్​ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించింది. బీజేపీతో దేశవ్యాప్తంగా రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్‌‌ మాత్రమే.  కేంద్రంలో కాంగ్రెస్‌‌ పాలన ఉన్నంత కాలం భారత రాజ్యాంగం భద్రంగా ఉంది. బీజేపీ మళ్ళీ గెలిస్తే రాజ్యాంగం రద్దు చేసే అవకాశముందని ఈ నాయకులకు తెలియదా? రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, ప్రభుత్వరంగ రిజర్వేషన్లు, దళిత అట్రాసిటీస్‌‌ ఆక్ట్‌‌, పనికి ఆహారపథకం లాంటి మానవీయ పథకాలు తెచ్చింది కాంగ్రెస్‌‌ పార్టీయే.  ఇవన్నిటినీ బీజేపీ మంటగలుపుతున్నది. అయినా,  బీజేపీ, బీఆర్ఎస్  కొమ్మెందుకు కాస్తున్నారో ఆ నాయకులకే తెలియాలి.  అనైతిక స్నేహాలతో దళితులను పక్కదోవ పట్టిస్తున్నారు. ఆ పార్టీల చేతుల్లో వీరు పావులుగా ఉపయోగపడతారే తప్ప దళితుల కొరిగేదేం లేదు. 

దళితుల ఆశలపై నీళ్లు

రాజకీయ పోరాటాల్లోనూ ముందుండి సవాళ్లకు ఎదురు నిలుస్తున్నవారు ఈ దళిత కమ్యూనిటీ నుంచి వచ్చినవారే.  కృష్ణమాదిగ మాదిగ దండోరా స్థాపించి, ఎస్సీ కులాల వర్గీకరణ ప్రధాన లక్ష్యంగా అనేక  పోరాటాలు చేస్తూ ముప్పైఏండ్లుగా శ్రమిస్తున్నాడు. ఆర్‌‌ఎస్‌‌ ప్రవీణ్‌‌కుమార్‌‌ ఐపీఎస్​అధికారిగా పనిచేసి గురుకుల పాఠశాలల సెక్రటరీగా సోషల్‌‌ వెల్‌‌ఫేర్‌‌ విద్యాలయాలను మహోన్నత దశకు తీసుకొచ్చాడు. స్వేరో లాంటి సంస్థను స్థాపించి దళిత సైన్యం తయారుచేశాడు.  దళిత, బీసీ విద్యార్థులను ఐ.ఏ.ఎస్‌‌, ఐ.పీఎస్‌‌. అధికారులుగా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి  రాజకీయరంగంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో రాజ్యాధికారం సాధించడం ద్వారా దళితుల విముక్తి జరుగుతుందని అందరూ భావించారు. కానీ, జరిగిందేమిటి?  కృష్ణమాదిగ దళిత బహుజన వ్యతిరేక పార్టీ అయిన బీజేపీ సేవలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన చెప్పే సాకు బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేస్తుందని.  పదేండ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండికూడా వర్గీకరణ ఎందుకు చేయట్లేదంటే జవాబు లేదు.  ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వర్గీకరణ చేయదలుచుకుంటే చట్టం తేవడం ఐదు నిమిషాల పని అని కృష్ణమాదిగకు తెలియదా? మరో దిక్కు రాహుల్‌‌ గాంధీ తాము వర్గీకరణ ఖచ్చితంగా చేస్తామని చెప్పినా ఆమాట విననట్టే నటిస్తున్నాడు కృష్ణమాదిగ.  కాంగ్రెస్‌‌ మిగతా పార్టీల కంటే మేలైన రీతిలో వాగ్దానాలను నిలబెట్టుకుంటోంది.

బీఆర్​ఎస్​కు బీజీపీకి తేడా లేదు

దళితుల ఆశాజ్యోతిగా, బీఎస్పీ రథసారథిగా భావించిన ఆర్‌‌.ఎస్‌‌. ప్రవీణ్‌‌కుమార్‌‌ తానెవరినైతే తిట్టరానితిట్లు తిట్టి పదవికి రాజీనామా చేశారో ఆ కేసీఆర్​ పంచన చేరడం శోచనీయం. బీజేపీ నిలువరించడానికి తాను బీఆర్‌‌ఎస్‌‌లో చేరాననడం ఆత్మవంచనే అవుతుంది. బీఆర్‌‌ఎస్‌‌కు, బీజేపీకి తేడా లేదన్న విషయం ఆయనకి తెలియంది కాదు. బీఆర్ఎస్​ గెలుచుకునే ఒకటి,  రెండు సీట్లుతో అవసరమైతే బీజేపీకి సపోర్టు ఇస్తారన్న విషయమూ తెలియని అమాయకుడు కాదు ఆర్‌‌.ఎస్‌‌ ప్రవీణ్‌‌కుమార్‌‌.

- డా. కాలువ మల్లయ్య, సోషల్​ ఎనలిస్ట్​