
- ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
మంథని, వెలుగు: దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్శ్రీపాదరావు అడుగుజాడల్లో నడుస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం ఆయన 26వ వర్ధంతి సందర్భంగా మంథని పట్టణంలో శ్రీపాద రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రీపాద రావు చూపిన బాటలో నడుస్తూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామన్నారు. విద్య వైద్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు. వర్ధంతి కార్యక్రమంలో మంత్రి తనయుడు అనిరుద్ శ్రీపాద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంథని మార్కెట్ కమిటీ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సన్నాలకు బోనస్ పొందాలని రైతులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో లీడర్లు ప్రసాద్, కాచే, శ్రీనివాస్ పాల్గొన్నారు.
అజాత శత్రువు శ్రీపాదరావు
గోదావరిఖని, వెలుగు: ఉమ్మడి ఏపీ స్పీకర్గా వ్యవహరించిన దివంగత నేత దుద్దిల్ల శ్రీపాదరావు అజాత శత్రువని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్అన్నారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు ప్రజా సమస్యల పరిష్కారానికి తన జీవితాన్ని అంకితమిచ్చిన గొప్ప నాయకుడని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.