
తెలంగాణలో పండుగలు, జాతరలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి ఎంతో వైవిధ్యత, విభిన్నతను కలిగినవి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ జాతరలకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
సారలమ్మ: భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే గిరిజన జాతర దేశంలోనే అతిపెద్దది. దీన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996, ఫిబ్రవరి 1న రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతి రెండేండ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జరుపుతారు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా మేడారం జాతరను యునెస్కో గుర్తించింది. ఈ జాతర నాలుగు రోజులపాటు జరుగుతుంది. మొదటి రోజు కన్నెపల్లి ప్రాంతం నుంచి సారక్కను గద్దెపైకి తీసుకువస్తారు. రెండో రోజు చిలకలగుట్ట దగ్గర ఉన్న గద్దెపై సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. మూడో రోజు గద్దెలపై ప్రతిష్ఠించిన సమ్మక్క సారక్కను కొలుస్తారు. నాలుగోరోజు సాయంత్రం అమ్మవార్లను తిరిగి యుద్ధరంగానికి తరలిస్తారు. సమ్మక్కసారక్క జాతర ముగిసిన మూడో రోజు పెనక వంశానికి చెందిన వడ్డెలు పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు జాతర జరుపుతారు.
సలేశ్వరం: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన చెంచు తెగవారు సలేశ్వర పౌర్ణమి రోజున జాతర జరుపుతారు. ఈ జాతర చైత్రపౌర్ణమికి ముందు మూడు రోజులు, తర్వాత మూడు రోజులు మొత్తం వారం రోజులు నిర్వహిస్తారు. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. ఈ జాతరకు 6 కి.మీ. అటవీ ప్రాంతం నుంచి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.
అయినవోలు: వరంగల్ రూరల్ జిల్లా అయినవోలులో గల మైలార దేవునికి ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు 20 రోజులపాటు జరుగుతాయి.
కురుమూర్తి: వరంగల్ జిల్లాలోని పాలంపేట గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. ఇక్కడి ప్రధాన దైవం రామలింగేశ్వరస్వామి. ఈ జాతరను 19 రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో 8వ రోజు జరిపే శ్రీవారి ఉద్దాలసేవ పవిత్రమైనది.
సిద్ధులగుట్ట: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని సిద్ధులగుట్ట వద్ద ఈ జాతర జరుగుతుంది. ప్రాచీనకాలంలో నవనాథులు ఈ గుట్టపై శివలింగాన్ని స్థాపించి తపస్సు చేయడం వల్ల ఈ గుట్టను సిద్ధుల గుట్ట అంటారు. ఇక్కడి దేవాలయంలో శివుడిని సిద్ధలింగేశ్వరుడిగా కొలుస్తారు.
బెజ్జంకి : ఈ జాతర సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకిలో జరుగుతుంది. ఇక్కడి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంపై గోపిక నృత్యాలు, త్రిమూర్తుల విగ్రహాలు, సముద్ర మథన కథ మొదలైన వాటిని అద్భుతంగా చెక్కారు. ఈ జాతర చైత్రమాసంలో జరుపుతారు.
కొండగట్టు అంజన్న: జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామ సమీపంలో కొండగట్టు అంజన్న ఆలయం ఉంది. ఒకవైపు నరసింహస్వామి, మరోవైపు హనుమంతి ముఖాలు కలిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు 41 రోజులపాటు ఆంజనేయస్వామి దీక్ష చేస్తుంటారు. ఆంజనేయ స్వామి కొండ మీద వెలసినందున కొండగట్టు జాతరగా ప్రసిద్ధి చెందింది.
పెద్ద గొల్లగట్టు: యాదవులు తమ ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామికి మొక్కులు చెల్లించడం కోసం రెండేండ్లకు ఒకసారి సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి గ్రామంలోని పాలశేర్లయ్య గట్టు మీద ఐదు రోజులపాటు జాతర జరుపుకుంటారు. ఈ జాతరను 50 లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. తెలంగాణలో మేడారం జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర. లింగమంతుల స్వామి ఆలయాన్ని చోళ చాళుక్యులు నిర్మించారు. లింగమంతుల స్వామి తోబుట్టువు చేడమ్మతల్లికి నైవేద్యం పెడతారు. కేసారం గ్రామానికి 30 విగ్రహాలు ఉన్న పెట్టెను తీసుకొని వెళ్లి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు. ఆలయ గోపురంపై ఖాసింపేట గ్రామస్తులు పసిడి కుండను అలంకరిస్తారు. సూర్యాపేట యాదవ కులస్తులు మకర తోరణాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లేవారు.
కొమురవెల్లి : ప్రతి సంవత్సరం మాఘమాసం నుంచి చైత్రమాసం వరకు మల్లన్న దేవుని జాతర సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలోని మల్లిఖార్జున స్వామి ఆలయంలో జరుగుతుంది. స్వామి వారు వివాహం చేసుకున్న యాదవుల ఆడబిడ్డ గొల్ల కేతమ్మ, లింగ బలిజల ఆడబిడ్డ బలిజ మేడలమ్మల సమేతంగా స్వామివారు దర్శనమిస్తారు.
రామప్ప: వరంగల్ జిల్లాలోని పాలంపేట గ్రామంలో కొలువైన రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున మూడు రోజులు జాతర జరుగుతుంది. .
కోడవటంచ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కోటంచ గ్రామంలో వెలసిన లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి ఫాల్గుణ బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రథాలు అని పిలిచే ఎడ్లబండ్లలో గుడి వద్దకు చేరుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
వేలాల: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో గల వేలాల గ్రామంలో మహాశివరాత్రికి జాతర జరుగుతుంది. మొక్కులు చెల్లించడానికి చుట్టు పక్కల అనేక జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు.
మన్నెంకొండ : మన్నెంకొండ క్షేత్రం పాలమూరు పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాఘ, ఫాల్గుణ మాసంలో వేడుకగా జరిగే జాతరకు 5 లక్షలకు పైగా భక్తులు వస్తారు. మన్నుమయ్యగా పూజలందుకుంటున్న వేంకటేశుడి క్షేత్రం పేదల తిరుపతికి ప్రసిద్ధి.
ఏడుపాయల : మెదక్ జిల్లా నాగసాన్పల్లి గ్రామంలో మంజీరా నది ఏడుపాయలుగా వేరుపడిన చోట దుర్గామాత ఆలయం నిర్మించారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో మూడు రోజులపాటు జాతర జరుపుకుంటారు. ఈ జాతరలో బోనాలు, శివసత్తులు, పోతురాజులు దర్శనమిస్తారు.
నాగోబా : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో గోండులు ప్రతి సంవత్సరం పుష్యమాసంలో బహుళ అమావాస్య నాడు నాగోబా జాతర జరుపుకుంటారు. నాగోబా అంటే నాగదేవత. పామును దేవతా రూపంలో పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా 1940వ దశకంలో ప్రొఫెసర్ హైమన్ డార్స్ గోండు దర్బార్ నిర్వహించి దానికి ఆ జిల్లా కలెక్టర్‌ను ఆహ్వానించి గిరిజనులు తమ సమస్యలను విన్నవించుకునే సంప్రదాయం ప్రారంభించారు. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
తెలంగాణలో పెద్ద జాతర ఏది? (డి)
ఎ. కొండగట్టు జాతర బి. నాగోబా జాతర
సి. పెద్దగట్టు జాతర డి. సమ్మక్క సారక్క జాతర
పెద్దగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? (బి)
ఎ. జగిత్యాల బి. సూర్యాపేట
సి. కరీంనగర్ డి. వరంగల్
ఏడుపాయల జాతరలో ప్రధాన దేవత? (డి)
ఎ. లక్ష్మి బి. పార్వతి సి. సరస్వతి డి. దుర్గాదేవి
సమ్మక్క సారక్క జాతర ఎన్నేండ్లకు ఒకసారి జరుగుతుంది? (ఎ)
ఎ. 2 బి.3 సి. 4 డి. 5