తెలంగాణ జాబ్స్ స్పెషల్

తెలంగాణ జాబ్స్ స్పెషల్

ఒక వ్యక్తి తన కనీస అవసరాలు తీర్చుకోవడానికి కావాల్సిన కనీస ఆదాయం పొందలేని స్థితిని పేదరికంగా నిర్వచిస్తారు. ప్రతి దేశంలో ఆ దేశ ఆర్థికాభివృద్ధి స్థాయిని అనుసరించి పేదరికపు రేఖ, కనీస సౌకర్యాల స్థాయిలు మారుతాయి.

నిరపేక్ష పేదరికం: ఒక వ్యక్తి జీవించడానికి అవసరమైన కనీస జీవనాధార వినియోగ వ్యయం చేయలేని పరిస్థితి నిరపేక్ష పేదరికం. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది. 

సాపేక్ష పేదరికం: సమాజంలో పైనున్న 5 శాతం నుంచి 10 శాతం ప్రజల జీవన ప్రమాణంతో పోల్చినప్పుడు దిగువన ఉన్న 5 శాతం నుంచి 10 శాతం ప్రజల జీవన ప్రమాణం తక్కువగా ఉంటుంది. దీన్నే సాపేక్ష పేదరికం అంటారు. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని లారెంజ్​ వక్రరేఖ లేదా గిని గుణకం ద్వారా కొలవవచ్చు. 

పేదరికపు రేఖ 

ఒక వ్యక్తి జీవించడానికి కావలసిన కనీస జీవితావసరాలను నిర్ణయించి వాటిని పొందేందుకు చేయాల్సిన కనీస వ్యయాన్ని నిర్ధారిస్తారు. ఈ కనీస వ్యయమే దారిద్ర్యరేఖ. అంతకంటే తక్కువ వ్యయం చేసేవారిని పేదరికపు దిగువన(బీపీఎల్​) ఉన్నవారని, అంతకంటే ఎక్కువ వ్యయం చేసేవారిని పేదరిక రేఖకు పైన(ఏపీఎల్​) ఉన్నవారని పిలుస్తారు. 1969లో పౌష్టికాహార నిపుణుల సలహా మేరకు లభ్యమయ్యే కేలరీల శక్తిని బట్టి కనీస పోషకాహార స్థాయిని నిర్ణయించింది.

గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 210‌‌‌‌‌‌‌‌0 కేలరీలు శక్తినిచ్చే ఆహారాన్ని ప్రాతిపదికగా తీసుకొని పేదరికాన్ని నిర్వచించింది. 1973–74 సంవత్సరాన్ని పేదరికపు గీత నిర్ణయించడంలో జీవన ప్రమాణాన్ని అంచనా వేయడానికి ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆ సమయంలో నెలసరి తలసరి వినియోగ వ్యయం గ్రామాల్లో రూ.49, పట్టణాల్లో 56గా తీసుకున్నారు. ఇది కాలానుగుణంగా పెరుగుతూ వచ్చింది.

ఎన్​ఎస్​ఎస్​ఓ 68వ రౌండ్​లో గ్రామాల్లో నెలసరి తలసరి వినియోగ వ్యయం రూ.816(రోజుకు రూ.27.2), పట్టణాల్లో రూ.1000(రూ.33.33)గా నిర్ణయించారు. మన దేశంలో ఎన్​ఎస్​ఎస్​ఓ ప్రతి ఐదేండ్లకు ఒకసారి లార్జ్​ శాంపిల్​ సర్వే ద్వారా కుటుంబ వ్యయాన్ని అంచనా వేస్తున్నారు. ఎన్​ఎస్​ఎస్​ఓ అంచనాలను ప్రణాళిక సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ ప్రకారం భారత దేశంలో పేదరికాన్ని  అధికారికంగా అంచనా వేసేది ప్రణాళిక సంఘం.

భారత్​లో దారిద్ర్య రేఖను నిర్ణయించేటప్పుడు లభించే కనీస ఆహార స్థాయి వస్త్రాలు, పాదరక్షలు, ఇంధనం, కాంతి, విద్య, ఆరోగ్య సంబంధ అవసరాలను కనీస అవసరాలుగా తీసుకుంటారు. ఈ భౌతిక పరిమాణాన్ని ధరల్లో వ్యక్తపరుస్తారు. ఆహారాన్ని మనకు లభించే కేలరీల రూపంలో అంచనా వేస్తారు. కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పాలు, నూనెలు, చక్కెర తదితరాలను కేలరీల్లో అంచనా వేస్తారు. ఇవి వయస్సు, లింగ భేదం, పని స్వభావం బట్టి మారుతాయి. 

రంగరాజన్​ కమిటీ నివేదిక 

పేదరికాన్ని గణించే మెథడాలజీని సమీక్షించేందుకు 2012లో రంగరాజన్​ అధ్యక్షతన నిపుణుల గ్రూప్​ను ప్రణాళికా సంఘం  నియమిచింది. ఈ కమిటీ 2014 జూన్​లో నివేదిక సమర్పించింది. 1979లో వై.కె.అలాగ్​, 1993లో లాక్డావాలా, 2009లో టెండూల్కర్​ కమిటీల అధ్యయన పద్ధతులను మెరుగుపరిచింది. ప్రస్తుతం కుటుంబ వినియోగ వ్యయం ఆధారంగా పేదరికం గణిస్తారు. దీని ప్రకారం రోజుకు గ్రామాల్లో రూ.32లు, పట్టణాల్లో రూ.47లు తలసరి వినియోగ వ్యయాన్ని దారిద్ర్య రేఖగా గుర్తించారు.

గ్రామాల్లో పేదరిక శాతం 30.9 శాతం,  పట్టణాల్లో పేదరిక శాతం 26.4శాతం, దేశంలో పేదరిక శాతం 29.5శాతం(36 కోట్ల పేదలు). ఎన్​ఎస్​ఎస్​ఓ 68వ రౌండ్​తో పోలిస్తే రంగరాజన్​ నివేదికలో పేదరిక శాతం, పేదల సంఖ్య రెండూ ఎక్కువగా ఉన్నాయి. రంగరాజన్​ ప్రతిపాదనలో నెలసరి తలసరి వినియోగ వ్యయం గ్రామాల్లో రూ.972(కుటుంబానికి రూ.4860), పట్టణాల్లో రూ.1407 (కుటుంబానికి రూ.7035)గా అంచనా వేశారు. ఇండియాలో పేదరికం 29.5శాతం. 

పేదరిక శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు: ఛత్తీస్​గఢ్​(47.9శాతం), మణిపూర్​(46.7శాతం), ఒడిశా(45.9శాతం)
పేదరిక శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు: గోవా(6.3శాతం), హిమాచల్​ ప్రదేశ్​ (10.9శాతం) 

మల్టీ డైమన్షియల్​ పావర్టీ
పేదరికపు రేఖపై (కేలరీలు లేదా వ్యయ ప్రాతిపదికన) వివాదం లేవడంతో ప్రత్యామ్నాయంగా మరికొన్ని పేదరికపు కొలమానాలు తెరపైకి వచ్చాయి. పేదరికం అంటే మంచి జీవనాన్ని పొందడానికి కావాల్సిన ఎంపిక అవకాశాలు కోల్పోవడమే. అందుకే ఆదాయాతేర అంశాలను తీసుకుని మానవ పేదరికం (హెచ్​పీఐ) అనే భావనను 1997–హెచ్​డీఆర్​లో ప్రవేశపెట్టారు. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. 2010 హెచ్​డీఆర్​లో హెచ్​పీఐ స్థానంలో ఎంపీఐని ప్రవేశ పెట్టారు. ఇదీ మూడు అంశాలతో నిర్మించబడింది. 
1. ఆరోగ్యం 2. విద్య 3. జీవన ప్రమాణం. ఈ మూడు అంశాలు 10 సూచీలను తెలియజేస్తాయి. ఈ మూడింటి గరిష్ఠ స్కోర్​ 100శాతం, ఈ మూడు అంశాలు సమాన ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. 

ఆరోగ్యం సూచీలు: 1. పోషకాహార లోపంతో ఉండటం 2. చిన్న పిల్లలు చనిపోవడం

విద్య సూచీలు: 1. ఐదేండ్ల పాఠశాల విద్యను పూర్తి చేయకపోవడం 2. పాఠశాలకు వెళ్లే వయస్సు కలిగి ఉండి పాఠశాలలో నమోదు కాకపోవడం

జీవన ప్రమాణ సూచీలు: 1. పరిశుభ్రమైన మంచినీరు అందకపోవడం,  2. పారిశుద్ధ్య సదుపాయాలు లేకపోవడం 3. మురికి ఇండ్లలో నివసించడం, 
4. ఉపయోగించే ఇంధనం అత్యంత తక్కువగా ఉండటం, 5. విద్యుత్​ లేకపోవడం, 6. కారు, ఫ్రిజ్​, టెలిఫోన్​, టీవీ వంటి ఆస్తులు  లేకపోవడం
– 2005–06లో దేశంలో మల్టీ డైమన్షియల్​ పావర్టీ 54.7శాతం కాగా, 2015–16 నాటికి 27.5శాతానికి తగ్గింది. 271 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 

కొలమాన పద్ధతులు
తలల లెక్కింపు పద్ధతి(హెచ్​సీఆర్​): పేదరికాన్ని  ప్రపంచ వ్యాప్తంగా, భారత్​లోనూ ఈ పద్ధతి ద్వారానే గణిస్తున్నారు. 
హెచ్​సీఆర్= బీపీఎల్​ జనాభా/ మొత్తం జనాభా X 100
ఈ పద్ధతి పేదరికపు శాతాన్ని గణిస్తుంది. కానీ, పేదలలోని ఆదాయ అంతరాలను సూచించదు. 

పేదరికపు అంతరం: పేదరిక తీవ్రతను పేదల్లోని అంతరాలను తెలుసుకునేందుకు దీన్ని ఉపయోగిస్తారు. గౌరవ్​ దత్​, రావెల్లిన్​లు దీన్ని ఉపయోగించారు. 

పేదరికపు అంతరం= దారిద్ర్యపు రేఖ – బీపీఎల్​ ప్రజల సగటు ఆదాయం/ దారిద్ర్య రేఖ 

సేన్​​ ఇండెక్స్​: సంక్షేమ ఆర్థికవేత్త అమర్త్యసేన్​ దీన్ని అభివృద్ధి చేశారు. పేదవారి ఆదాయాల్లోని అంతరాలను తెలుసుకొని పేదరికపు గీతకు ఎక్కువ దూరంలో ఉన్న వారికి ఎక్కువ భారాన్ని, పేదరికపు గీతకు దగ్గరగా ఉన్నవారికి తక్కువ భారాన్ని (వెయిటేజీ) ఇస్తుంది. పేదరికపు గీతకు దగ్గరగా ఉన్నవారిని పైకి తీసుకొచ్చే కంటే పేదరికపు గీతకు దూరంగా ఉన్నవారిని పైకి తీసుకురావడం వల్ల సమాజ సంక్షేమం ఎక్కువ పెరుగుతుంది. 

మల్టీ డైమన్షియల్​ పావర్టీ ఇండెక్స్​: ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం, యూఎన్​డీపీ ఈ ఇండెక్స్​ను అభివృద్ధి చేసింది. ఆయుర్దాయం, అక్షరాస్యత, జీవన ప్రమాణం ఆధారంగా దీన్ని 
రూపొందిస్తున్నారు.