తెలంగాణ జాబ్స్​​ స్పెషల్ ​: ప్రభుత్వ రుణం

తెలంగాణ జాబ్స్​​ స్పెషల్ ​: ప్రభుత్వ రుణం

ప్రభుత్వ రాబడులను, వ్యయాన్ని తెలియజేసేది పబ్లిక్​ ఫైనాన్స్. వ్యయానికి సరిపడినంత ఆదాయం సమకూర్చుకోలేనప్పుడు ప్రభుత్వ రుణం చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం అంతర్గత రుణాన్ని, బహిర్గత రుణాన్ని తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వ రుణ సేకరణ మార్గాలు, ప్రభుత్వ రుణం తిరిగి చెల్లించే పద్ధతులు, రుణం వల్ల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం మొదలైన అంశాలను ఇది అధ్యయనం చేస్తుంది. 

ప్రభుత్వ కార్యకలాపాలు రోజురోజుకూ పెరగడం, ఆదాయాన్ని మించి వ్యయం వల్ల ప్రభుత్వ రుణం పెరుగుతూ వస్తోంది. రుణం చేసే పద్ధతిని బట్టి రుణాన్ని స్వచ్ఛంద, నిర్బంధ రుణాలుగా విడదీస్తారు. ప్రజలు స్వచ్ఛందంగా రుణమిస్తే అది స్వచ్ఛంద రుణం. ప్రజల నుంచి నిర్బంధంగా రుణాలు స్వీకరిస్తే అది నిర్బంధ రుణం. 1974లో కంపల్సరీ డిపాజిట్​ స్కీమ్​ను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టి నిర్బంధ రుణం స్వీకరించింది. రుణం ప్రయోజనాన్ని బట్టి రుణం రెండు రకాలు. అవి ఉత్పాదక రుణం, అనుత్పాదక రుణం. ఉత్పాదక రుణం ఉదా: రైల్వేలు, పరిశ్రమల అభివృద్ధికి తీసుకొనేవి. అనుత్పాదక రుణం. ఉదా: దేశ రక్షణ, కరువు నివారణకు తీసుకొనే రుణాలు. 

రుణం తిరిగి చెల్లించే విధానం లేదా కాలం బట్టి 2 రకాలు. అవి.. నిధీకృత రుణం, నిధీకృతం కాని రుణం. 

నిధీకృత రుణం : రుణం తిరిగి చెల్లించేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసి తద్వారా రుణాన్ని చెల్లిస్తే అది నిధీకృత రుణం. ఇదీ దీర్ఘకాలానికి చెందింది. దీని కాల వ్యవధి 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. 

నిధీకృతం కాని రుణం : ఇది స్వల్పకాలానికి చెందింది. ఏడాది కాలంలో తిరిగి చెల్లించాలి. దీనిని చెల్లించేందుకు నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. రుణం తీసుకున్న ప్రాంతాన్ని బట్టి రెండు రకాలు. అవి.. స్వదేశీ రుణం, విదేశీ రుణం.

స్వదేశీ రుణం : ప్రజలు, సంస్థలు, బ్యాంకులు, ఆర్​బీఐల నుంచి తీసుకునే రుణాన్ని స్వదేశీ/ అంతర్గత రుణం అంటారు. దీన్ని స్వదేశీ కరెన్సీలో చెల్లించవచ్చు. 

విదేశీ రుణం : విదేశీ ప్రభుత్వ, సంస్థల నుంచి తీసుకునే రుణాలు. వీటిని విదేశీ కరెన్సీ ద్వారా చెల్లించాలి. ఇందుకోసం ఎగుమతులు పెంచి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాలి. దీనివల్ల వనరులు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలిపోతాయి. అయితే, కొన్ని ప్రత్యేక రుణాలను దేశీ కరెన్సీలో చెల్లించవచ్చు. ఉదా: అమెరికా నుంచి తీసుకున్న పీఎల్​–480(పబ్లిక్​ లా) రుణం.

ప్రముఖ ఆర్థిక వేత్త హిక్స్​ రుణాన్ని మూడు రకాలుగా విభజించాడు.

క్రియాత్మక రుణం : స్వయంగా రుణాలను చెల్లించే ప్రాజెక్టులు, పరిశ్రమలపై చేసే వ్యయం.

నిష్క్రియాత్మక రుణం : ప్రత్యక్ష ఆదాయం పెరగకపోయినా సాంఘిక సంక్షేమం పెంచేందుకు దోహదపడే రుణాలు. ఉదా: విద్య, ఉద్యోగం, సాంఘిక సంక్షేమం.
 

డెడ్​ వేట్​ రుణం : భవష్యత్తులో ఎలాంటి ప్రయోజనం, ఆదాయం కల్పించలేని, ఉత్పాదక శక్తి పెంచలేని ప్రభుత్వ రుణమే డెడ్​ వేట్​ రుణం. ఉదా: యుద్ధం కోసం చేసే రుణం.

భారత ప్రభుత్వ రుణం

కేంద్ర ప్రభుత్వ అప్పులు 1986–87లో 1,82,000 కోట్లు ఉండగా, 2019–20 నాటికి 106,44,897 కోట్లకు చేరింది. 2021–22 నాటికి 139,56,643 కోట్లకు చేరింది. 
దేశీయ రుణంలో అంతర్గత అప్పుల్లో నాలుగు భాగాలు ఉంటాయి. అవి.. 1. ఇంటర్నల్​ రుణం, 
2. చిన్న పొదుపులు, డిపాజిట్లు, ప్రావిడెంట్​ ఫండ్లు, 3. ఇతర ఖాతాలు, 4. రిజర్వ్​ ఫండ్స్​, డిపాజిట్లు.

అంతర్గత రుణం : 2020, మార్చి నాటికి 81,32,361 కోట్లు అంతర్గత రుణం ఉంది. ఇంటర్నల్​ లైయబిలిటీస్​లో ఇంటర్నల్​ డెట్​ అతి పెద్ద వాటాను కలిగి ఉంది. ఇంటర్నల్​ డెట్​లో మార్కెట్​ రుణాలు అతి పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. 

మార్కెట్​ రుణాలు : ఇంటర్నల్​ డెట్​లో అతిపెద్ద వాటా మార్కెట్​ రుణాలు. వీటి కాలపరిమితి 12 నెలలు కానీ అంతకంటే ఎక్కువ గాని ఉంటుంది. దీనిపై వడ్డీ కూడా ఇస్తారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇలాంటి రుణాలు తీసుకుంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మడం ద్వారా ఈ రుణాలు తీసుకుంటారు. 

ట్రెజరీ బిల్లులు : స్వల్ప కాలానికి రాబడికి వ్యయానికి మధ్యగల అంతరాన్ని తగ్గించడానికి ట్రెజరీ బిల్లులు అనే ప్రధాన వనరుగా పనిచేస్తాయి. ఇవి 91, 182, 364 రోజులకు పరిపక్వతను కలిగి ఉంటాయి. వీటిని ఆర్బీఐకి, వాణిజ్య బ్యాంకులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర పార్టీలకు జారీ చేస్తారు. 

రిజర్వ్​ ఫండ్స్​, డిపాజిట్స్ ​: రైల్వే, పోస్టల్​, టెలికాం డిపార్ట్​మెంట్ల వారి రిజర్వు ఫండ్లు ఇందులో భాగాలు.

విదేశీ అప్పులు : అల్పాభివృద్ధి దేశాలు విదేశీ సహాయం పొందినప్పుడే ప్రారంభంలో అభివృద్ధి చెందుతాయి. యంత్రాలు, మూలధన ఎక్విప్​మెంట్​ పొందడానికి ప్రభుత్వం కూడా అమెరికా, ఇంగ్లండ్​, రష్యా తదితర దేశాలు, ఐఎంఎఫ్​, ఐబీఆర్​డీ, ఐడీఏ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి విదేశీ రుణం పొందుతోంది. 
కేంద్ర ప్రభుత్వ అప్పులో పబ్లిక్​ డెట్​లో రెండు భాగాలుంటాయి. 1. అంతర్గత రుణం 2. విదేశీ రుణం. మొత్తం అప్పుల్లో ఉన్న అంతర్గత రుణం, విదేశీ రుణం కలిపి పబ్లిక్​ డెట్​ అవుతుంది.  కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం అప్పుల్లో భారత సంఘటిత నిధికి జమ చేయాల్సిన మొత్తాలు

(దీనినే సాంకేతికంగా ప్రజా రుణంగా నిర్వచిస్తారు), పబ్లిక్​ అకౌంట్​లో జమ చేయాల్సిన మొత్తాలు ఉంటాయి. ప్రభుత్వ రుణాన్ని అంతర్గత రుణం, బహిర్గత రుణం అని రెండు రకాలుగా విభజిస్తారు. ప్రభుత్వ రుణంలో అంతర్గత రుణం 94 శాతం పైగా ఉంది. అంతర్గత రుణాల్లో దీర్ఘకాలిక మార్పు కనిపిస్తున్నది. మొత్తం అంతర్గత అప్పుల్లో మార్కెట్​ రుణం రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు పబ్లిక్ అకౌంట్​ ఖాతాలో అప్పుల వాటా తగ్గుతున్నది.  

ప్రభుత్వ రుణ సమస్యలు

వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే అవస్థాపనా సదుపాయాలు మూలధన వస్తువులపై భారీగా వ్యయం చేయాలి. దీనికి కావల్సిన పన్నులు, ప్రభుత్వ సంస్థల ద్వారా సమకూర్చుకోవడం కష్టం. ప్రత్యక్ష పన్నులు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై ఆధారపడతాయి. పరోక్ష పన్నులు పెంచాల్సి వస్తే ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరుగుతాయి. పైగా ఇవి పేదలపై చెడు ప్రభావాన్ని కనబరుస్తాయి. కాబట్టి ప్రభుత్వం రుణం తీసుకోవడం తప్పనిసరి అయింది.

ప్రాజెక్టుల అభివృద్ధికి మధ్యంతర వస్తువులు, పెట్రోలియం దిగుమతులు చేసుకోవడం వల్ల దిగుమతుల బిల్లు కూడా పెరుగుతున్నది. దీనికి తగ్గట్టుగా ఎగుమతులు లేకపోవడంతో విదేశీ రుణాలు కూడా పొందాల్సి వస్తుంది. ప్రణాళికా కాలంలో దేశీ, విదేశీ రుణాలు పెరగడంతో వాటిపై వడ్డీలు పెరుగుతూ వచ్చాయి. ఫలితంగా రుణ భారం కూడా పెరుగుతూ వస్తోంది. 

రుణం - ద్రవ్యోల్బణం

ప్రభుత్వ రుణం ఆర్​బీఐ నుంచి తీసుకుంటే ద్రవ్య సప్లయ్​ పెరుగుతుంది. మన దేశంలో ఎక్కువ రూపాయి రుణాలు (12 నెలల తర్వాత చెల్లిస్తారు) రిజర్వు బ్యాంకు నుంచి తీసుకున్నవే. ప్రభుత్వం స్వల్పకాల ట్రెజరీ బిల్లులు ద్వారా కూడా రుణాలు తీసుకుంటుంది. వీటిలో ఎక్కువ భాగం రిజర్వు బ్యాంకు అందిస్తుంది. ఈ ట్రెజరీ బిల్లులు డెఫిసిట్​ ఫైనాన్సింగ్​కు దోహదపడి ద్రవ్యోల్బణానికి కారణమవుతోంది.

చిన్న పొదుపులు, డిపాజిట్లు, పీఎఫ్​ మొత్తాలు: ప్రజల ఆదాయాలు పెరగడం వల్ల చిన్న పొదుపుల నుంచి తీసుకునే మొత్తం కూడా పెరుగుతున్నది. నేషనల్​ సేవింగ్​ సర్టిఫికెట్లను ప్రజలు కొనడం వల్ల వారికి పన్ను మినహాయింపు లభిస్తుంది. మరోవైపు ప్రభుత్వానికి రుణ రాబడి లభిస్తుంది. పీఎఫ్​లో రెండు వర్గాలు ఉంటాయి. ఎ. స్టేట్​ ప్రావిడెంట్​ ఫండ్​ బి. పబ్లిక్ ప్రావిడెంట్​ ఫండ్​. పీపీఎఫ్​ సాధారణ ప్రజానీకానికి ఉపయోగపడుతుంది. పీపీఎఫ్ లో వేసిన మొత్తాలు 15 సంవత్సరాల తర్వాత చెల్లిస్తారు.

ఇతర ఖాతాలు : పోస్టాఫీసు, బీమా, నిర్బంధ డిపాజిట్లు, ఇన్​కంట్యాక్స్​ యాన్యుటీ డిపాజిట్లు మొదలైనవి ఇందులో భాగాలు.